ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పీఎన్‌ పణికర్‌పై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి.. పఠన సంస్కృతి పునరుద్ధరణకు పిలుపు


‘చదవడం మానేసిన సమాజం నెమ్మదిగా లోతుగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతుంది’: ఉపరాష్ట్రపతి

శ్రీ పీఎన్‌ పణికర్ గ్రంథాలయాల ద్వారా ఆశను, చైతన్యాన్ని పెంపొందించారు: ఉపరాష్ట్రపతి

యువతలో తగ్గుతున్న పఠనాసక్తిపై ఉపరాష్ట్రపతి ఆందోళన

జ్ఞానానికి, సృజనాత్మకతకు గ్రంథాలయాలు కేంద్రాలుగా ఆవిర్భవించాలి: ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 6:19PM by PIB Hyderabad

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ నేడు ఉపరాష్ట్రపతి భవన్‌లో పీపీ సత్యన్ రచించిన ‘‘ది లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా: ది స్టోరీ ఆఫ్ పీఎన్‌ పణికర్’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ... శ్రీ పీఎన్‌ పణికర్‌కు ఘన నివాళులర్పించారు. పుస్తకాలు, జ్ఞానం అనే నిశ్శబ్ద శక్తి ద్వారా లక్షలాది మంది ప్రజల తలరాతను మార్చిన దార్శనికుడిగా ఆయన్ను అభివర్ణించారు. ఈ పుస్తక రచయిత శ్రీ సీపీ సత్యన్‌ను అభినందిస్తూ... ఈ ప్రచురణ శ్రీ పణికర్ అసాధారణ దార్శనికతకు, శాశ్వత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

శ్రీ పణికర్ అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారని.. కులం, వర్గం, పేదరికం, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికీ జ్ఞానం అందుబాటులో ఉండాలనే ఒక అసాధారణమైన కలను నెరవేర్చుకున్నారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. కేరళలోని కుట్టనాడ్‌లో శ్రీ పణికర్ నిరాడంబరమైన ప్రారంభ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ నిరక్షరాస్యత అనేది కేవలం చదవలేకపోవడం మాత్రమే కాదని... ఆత్మగౌరవానికి, అవకాశాలకు, మానవ ప్రగతికి ఒక పెద్ద ఆటంకమని పణికర్‌ తన జీవితంలో చాలా ముందుగానే గ్రహించారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

శ్రీ పణికర్‌ను కేరళ సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి... జ్ఞానం ఎప్పుడూ కొద్దిమందికి మాత్రమే పరిమితమైన హక్కుగా మిగిలిపోకూడదని, మానవాళి మొత్తానికి సార్వత్రికంగా ఉపయోగపడాలని, సామాజిక చైతన్యానికి ఒక శక్తిగా మారాలని ఆయన విశ్వసించారని చెప్పారు. 

గ్రంథాలయాల పరిణామ క్రమాన్ని వివరిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులను ఆకర్షించిన నలంద, తక్షశిల వంటి దేశీయ విద్యా కేంద్రాల సంప్రదాయాన్ని ఉపరాష్ట్రపతి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ-పుస్తకాలు, డిజిటల్ ఆర్కైవ్‌లు, ఆన్‌లైన్ వనరుల ద్వారా గ్రంథాలయాలు డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టినప్పటికీ... యువతలో పఠనాసక్తి క్రమంగా క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. 

మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, క్లుప్త వినోదం (రీల్స్/షార్ట్స్ వంటివి)పై ఆధారపడటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి... లోతైన పఠనం,మననం, ఆలోచనాత్మక అభ్యసనం అనేవి మెల్లమెల్లగా కుమరుగవుతనన్నాయని చెప్పారు. సాంకేతికత సౌకర్యాన్ని తీసుకువచ్చినప్పటికీ సహనాన్ని, ఏకాగ్రతను, సాహిత్యాభిలాషని, జ్ఞానంతో అర్థవంతమైన అనుబంధాన్ని తగ్గించిందని ఆయన హెచ్చరించారు.

చదవడం ఆపేసిన సమాజం క్రమంగా విమర్శనాత్మకంగా ఆలోచించే, సృజనాత్మకంగా ఊహించే, లోతుగా అర్థం చేసుకునే తన సామర్థ్యాన్ని కోల్పోతుందని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. యువతరంలో పఠన, ఆలోచనా సంస్కృతిని పునరుద్ధరించడంలో ది లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా వంటి పుస్తకాలు గొప్ప పాత్ర పోషిస్తాయని తెలిపారు. 

శ్రీ ఎన్ బాలగోపాల్ నాయకత్వంలోని పీఎన్‌ పణికర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందిస్తూ... పఠనాన్ని, అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి అసాధారణమైన ప్రయత్నాల ద్వారా ఈ ఫౌండేషన్ శ్రీ పణికర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు. 

దేశ విజ్ఞాన వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను కూడా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన మన్‌ కీ బాత్ కార్యక్రమంలో పంచుకున్న దార్శనికతను గుర్తుచేస్తూ... గ్రంథాలయాలు సృజనాత్మకతకు ప్రతిరూపాలుగా, శక్తిమంతమైన కేంద్రాలుగా మారాలని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, పరిశోధకులకు అంతర్జాతీయ విద్యా పరిశోధనలు, జర్నల్స్ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘‘ఒకే దేశం, ఒకే చందా’’కార్యక్రమాన్ని కూడా ఆయన అభినందించారు. 

సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా దేశపు అమూల్యమైన రాతప్రతుల వారసత్వాన్ని సంరక్షించడం, డిజిటలైజ్ చేయడం, విస్తృతంగా ప్రచారం చేయడం కోసం జ్ఞాన భారతం మిషన్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. 

 శ్రీ పణికర్  గొప్పతనం కేవలం గ్రంథాలయాలను నిర్మించడంలోనే కాకుండా సామాన్య పౌరుల్లో ఆశను, చైతన్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిర్మించడంలోనూ ఉందని అన్నారు.  ‘‘ఒక గ్రంథాలయం ఒక చిన్నారి భవిష్యత్తును మార్చగలదు. ఒక పుస్తకం ఒక జీవితాన్ని మార్చగలదు. పట్టుదల కలిగిన ఒకే ఒక్క వ్యక్తి మొత్తం సమాజాన్ని మార్చగలడు’’ అని ఆయన స్పష్టం చేశారు. 

పుస్తకాలు చదవడం, నేర్చుకోవడం, జ్ఞానాన్ని విస్తరింపజేయడం పట్ల సమాజం తన నిబద్ధతను పునరుద్ధరించుకోవాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. పిల్లల్లో పఠన అలవాటును పెంపొందించేలా వారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థలను ఆయన కోరారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, పీఎన్‌ పణికర్ ఫౌండేషన్ ఉప చైర్మన్ శ్రీ ఎన్ బాలగోపాల్, పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2264479) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam