రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
టన్నెల్ ఇంజినీరింగ్, కొండ వాలుల్లో స్థిరత్వం, సామర్థ్యాభివృద్ధిలో సలహా సహకారం కోసం నార్వే భూ సాంకేతిక సంస్థతో ఎన్‌హెచ్ఏఐ అవగాహన ఒప్పందం
प्रविष्टि तिथि:
22 MAY 2026 3:03PM by PIB Hyderabad
జాతీయ రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా.. నార్వేజియన్ భూ సాంకేతిక సంస్థ (ఎన్జీఐ)తో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) ఇటీవల నార్వేలోని ఓస్లో నగరంలో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భూ సాంకేతిక ఇంజినీరింగ్, ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను తగ్గించడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఎన్‌జీఐ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా.. దేశ జాతీయ రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి, నిర్వహించేందుకు ఎన్‌హెచ్ఏఐ కట్టుబడి ఉందనడానికి ఈ భాగస్వామ్యం నిదర్శనం. ముఖ్యంగా భౌగోళికంగా అత్యంత సున్నితమైన, సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో ఇంజినీరింగ్ సామర్థ్యాలను పెంపొందించే దిశగా ఇది కీలక ముందడుగు.
సొరంగాల నిర్మాణం, కొండచరియల స్థిరత్వ విశ్లేషణ, కొండ వాలు పర్యవేక్షణ, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాల్లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక, రూపకల్పన, అంచనా, పర్యవేక్షణకు సహకరించేలా అంతర్జాతీయ అత్యాధునిక నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం. ఈ ఒప్పందం ప్రకారం ఎన్‌జీఐ సంస్థ వివిధ రకాల సంప్రదింపు సేవలను అందిస్తుంది. టన్నెల్ ప్రాజెక్టుల కోసం క్షేత్రస్థాయి పరిశీలన, మున్ముందు చేపట్టే టన్నెల్ ప్రాజెక్టుల కోసం సాధ్యసాధ్య అధ్యయన నివేదికలు. సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీ, ప్రస్తుతం నడుస్తున్న సొరంగాల నిర్మాణ భద్రత తనిఖీలు వీటిలో ఉన్నాయి. అలాగే పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించి, తగిన నివారణ చర్యలను సిఫార్సు చేయడం కోసం అత్యాధునిక కొండ వాలుల స్థిరత్వ అంచనాలను కూడా అందిస్తుంది. కొండ వాలును పర్యవేక్షించడం కోసం 'ఇన్‌సార్' డేటా విశ్లేషణ, మౌలిక సదుపాయాల భద్రతను పెంపొందించే లక్ష్యంతో ముందస్తు హెచ్చరిక వ్యవస్థల రూపకల్పన కూడా ఈ ఉమ్మడి భాగస్వామ్యంలోని అంశాలుగా ఉన్నాయి.
సంస్థాగత సామర్థ్య నిర్మాణం, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా ఈ అవగాహన ఒప్పందం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల తగ్గింపునకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై ఇరు సంస్థల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. ఉమ్మడి కార్యశాలలు, సెమినార్లు, సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు, ప్రత్యేక సాంకేతిక అంశాల ప్రచురణ ద్వారా రహదారి రంగంలో సాంకేతిక సామర్థ్యాలను పెంపొందిస్తారు.
గుర్తించిన రంగాల్లో కలిసి పనిచేయడానికి ఇరు సంస్థలు కృషిచేస్తాయి. అయితే, ఈ ఒప్పందం నిర్దిష్ట పరిధులకే పరిమితం కాబోదు. ప్రాజెక్ట్ - ప్రాజెక్ట్ ప్రాతిపదికగా ఉండే ఈ ఒప్పందం వల్ల.. అవసరాన్ని బట్టి ఇతర సంస్థలతో స్వతంత్రంగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకునే వెసులుబాటు ఇరుపక్షాలకూ ఉంటుంది. ఈ అవగాహన ఒప్పందం అయిదేళ్ల పాటు అమలులో ఉంటుంది.
ఎన్‌హెచ్ఏఐ, ఎన్జీఐ మధ్య ఈ ఒప్పందం.. సురక్షిత, సుస్థిర, ప్రపంచ స్థాయి జాతీయ రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన వినిమయం, సుస్థిర ఇంజినీరింగ్ పద్ధతుల్లో భారత్, నార్వే మధ్య పెరుగుతున్న సహకారాన్ని కూడా ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతోపాటు దీర్ఘకాలిక సంస్థాగత సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.
****
(रिलीज़ आईडी: 2264194)
आगंतुक पटल : 44