ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నుంచి అగ్రికోలా పతకాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 MAY 2026 10:55PM by PIB Hyderabad

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి 2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక అగ్రికోలా పతకాన్ని ప్రదానం చేశారు. భారత్‌తో పాటు ప్రపంచస్థాయిలోనూ ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాల పరిష్కారానికి ఆయన ప్రదర్శించిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు.

ఎఫ్‌ఏఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్వూ డాంగ్యూ చేతుల మీదుగా ప్రధానమంత్రి ఈ అవార్డును అందుకున్నారు. భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆహార భద్రత, పోషకాహార అవసరాలను తీర్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న భారతీయ రైతులకు, భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలకు పీఎం ఈ గౌరవాన్ని అంకితం చేశారు. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారతదేశ నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇది అని స్పష్టం చేశారు. భారత్‌లో వ్యవసాయ జీవనానికున్న ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. భూమాతకు, భారత ప్రజలకు మధ్య ఉన్న పవిత్రమైన బంధం వ్యవసాయమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

వ్యవసాయంలో భారత్‌ అవలంబిస్తున్న శాస్త్రీయ, ఆవిష్కరణల ఆధారిత విధానం.. స్థిరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగల, భవిష్యత్‌ అవసరాలకు సిద్ధంగా ఉండే వ‌్యవస్థను పెంపొందిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రయత్నంలో 'ప్రతి నీటి బొట్టుకు అధిక పంట' వంటి పద్ధతులు, సూక్ష్మ నీటి పారుదల, ఖచ్చితమైన వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన మిషన్ ఆధారిత విధానం వంటివి దేశ వ్యవసాయ విధానాలకు మార్గనిర్దేశం చేస్తున్నాయని చెప్పారు. సాంకేతిక ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను వివరిస్తూ.. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఏఐ ఆధారిత సలహా వ్యవస్థలు, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలు, సెన్సార్ ఆధారిత యంత్రాలు.. అధిక దిగుబడిని, అధిక ఆదాయాన్ని పొందటంలో భారత రైతులకు సహాయపడుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత పదేళ్లలో వాతావరణ మార్పులను తట్టుకోగల సుమారు 3,000 పంట రకాలను భారత్‌ అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. భారతదేశ శాస్త్రీయ ఆధారిత వ్యవసాయం, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రపంచ ఆహార భద్రతను బలోపేతం చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు.

ఎఫ్‌ఏఓ వ్యవస్థాపక సభ్యుడిగా ప్రపంచ ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, సుభిక్షమైన ప్రపంచాన్ని పెంపొందించేందుకు, ఆ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం భారత్‌కు లభించటం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ వేడుకల ద్వారా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించటంలో భారత్‌తో కలిసి పనిచేసినందుకు ఎఫ్‌ఏఓకు కృతజ్ఞతలు తెలిపారు.

గత 30 ఏళ్లలో ఎఫ్‌ఏఓ ప్రధాన కార్యాలయానికి ఒక భారత ప్రభుత్వాధినేత వెళ్లడం ఇదే తొలిసారి.

****


(రిలీజ్ ఐడి: 2263959) సందర్శకుల సూచీ సంఖ్య : : 84