భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఈ-బస్సులు, ఈ-ట్రక్కుల వాడకాన్ని వేగవంతం చేసేందుకు కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
దేశపు తదుపరి దశ హరిత రవాణా మార్పునకు నాయకత్వం వహించాలని రవాణా రంగ భాగస్వాములకు కేంద్రమంత్రి పిలుపు
దేశవ్యాప్తంగా ఉన్న రవాణా ఆపరేటర్లు, అగ్రిగేటర్లు, పరిశ్రమ ప్రముఖులు ఈ వ్యూహాత్మక ఈవీ రవాణా చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు
సుస్థిరమైన, పొదుపుతో కూడిన పాలనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఉన్న దార్శనికతకు అనుగుణంగా సమావేశ నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
20 MAY 2026 6:10PM by PIB Hyderabad
దేశంలో పర్యావరణహిత వాహనాల వాడకాన్ని మరింత వేగవంతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కుల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి నేడు న్యూఢిల్లీలో సంబంధిత భాగస్వాములతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థలో భాగమవుతున్న వాహనాల ఆపరేటర్లు, రవాణా రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, లీజింగ్ సంస్థలు, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి చెందిన పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోవడం, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల వాడకాన్ని వేగవంతం చేయడం, ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి.
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కామ్రాన్ రిజ్వీ, అదనపు కార్యదర్శి డాక్టర్ హనీఫ్ ఖురేషీలతో సహా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. దేశంలో భారీ ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ప్రణాళికలపై తమ అభిప్రాయాలను భాగస్వాములతో పంచుకున్నారు.
సమావేశాన్ని ఉద్దేశించి హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ.. దేశంలో ప్రయాణికుల రవాణాకు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులే ప్రధాన వెన్నుముకగా మారబోతున్నాయని చెప్పారు. పర్యావరణానికి మేలు చేసే రవాణా, సరుకు రవాణా రంగాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
‘‘ పర్యావరణహిత, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ వైపు భారత్ ఓ నిర్ణయాత్మకమైన మార్పును చూస్తోంది. మన దేశంలో ప్రయాణికుల రవాణాకు ఈ-బస్సులు భవిష్యత్తు కాబోతుండగా.. సరుకు రవాణా రంగంలో తదుపరి కొత్త శకాన్ని ఈ-ట్రక్కులు నిర్దేశించబోతున్నాయి’’ అని హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు.
సహకార విధాన రూపకల్పన ప్రాముఖ్యతను వివరిస్తూ.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్పు ఆచరణాత్మకంగా, అందరికీ అందుబాటులో ఉండేలా, వ్యాపారపరంగా లాభదాయకంగా సాగేలా చూడటం కోసం ఆపరేటర్లు, పరిశ్రమల భాగస్వాములతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
‘‘ఈ సమావేశం కేవలం విధానాలపై చర్చించడానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశమంతటా క్షేత్రస్థాయిలో రవాణా సేవలను నిర్వహిస్తున్న ఆపరేటర్లు, పరిశ్రమల భాగస్వాముల నుంచి నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ముఖ్యమైన వేదికగా నిలిచింది. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించడంలో వారి అభిప్రాయాలు, అనుభవాలు చాలా విలువైనవి’’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
పర్యావరణ సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యం, బాధ్యతాయుతమైన పాలన వైపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ కార్యక్రమం పూర్తిగా అనుగుణంగా ఉందని శ్రీ హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్ సుస్థిరత, ఆవిష్కరణలు, సమర్థవంతమైన ప్రజా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిచ్చే భవిష్యత్తు వైపు సాగుతోంది. ఈ-బస్సులు, ఈ-ట్రక్కుల వాడకాన్ని ప్రోత్సహించడం అనేది కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదు.. ఇది నవ భారతానికి ఆర్థిక, వ్యూహాత్మక అవసరం కూడా’’ అని శ్రీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో భాగస్వాములు ఆర్థిక సహాయం లభ్యత, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, వాహన సముదాయ విస్తరణ, కార్యాచరణ సాధ్యత, ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలకు దీర్ఘకాలిక మద్దతు వంటి అంశాలపై విస్తృతమైన అభిప్రాయాలు, కార్యాచరణ అనుభవాలు, రంగాల వారీ ఆందోళనలు, ఆచరణాత్మక సూచనలను పంచుకున్నారు.
మంత్రిత్వ శాఖ స్వయంగా ముందుకు వచ్చి ఈ విధమైన చర్చలు జరపడాన్ని, రవాణా రంగాన్ని ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వంతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడాన్ని ప్రతినిధులందరూ స్వాగతించారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై నమ్మకాన్ని పెంచడం, అలాగే పట్టణాల్లో, నగరాల మధ్య, సరుకు రవాణా వ్యవస్థల్లో ఈ-బస్సులు, ఈ-ట్రక్కులను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడానికి ఒక బలమైన వ్యవస్థను సృష్టించడంపై ప్రధానంగా చర్చలు జరిగాయి.
దేశంలో పర్యావరణహిత భారీ రవాణా వ్యవస్థను వేగవంతం చేయడానికి, దేశ రవాణా, సరుకు రవాణా (లాజిస్టిక్స్) రంగాల తదుపరి దశ మార్పుల్లో పరిశ్రమల భాగస్వాములను చురుకుగా భాగస్వామ్యం చేయడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తీసుకున్న ఒక అత్యంత కీలకమైన చర్యగా ఈ సమావేశాన్ని భావిస్తున్నారు.
****
(రిలీజ్ ఐడి: 2263516)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15