జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘భారత్ టెక్స్ – 2026’ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీ రావు


కార్యక్రమ సమాచారం, ఎగ్జిబిటర్ల వివరాలు, బీ2బీ సమావేశాలు, డిజిటల్ బ్యాడ్జి, కొనుగోలుదారుల సమీకరణ, ఏఐ ఆధారిత సాయాన్ని అందించే అందించే భారత్ టెక్స్ యాప్
భారత్‌లో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ జౌళి కార్యక్రమానికి డిజిటల్ గా సాయం చేసే ఏకీకృత యాప్
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026 జులై 14-17 వరకు జరిగే ‘భారత్ టెక్స్-2026’

నాడు పోస్టు చేయడమైనది: 20 MAY 2026 2:25PM by PIB Hyderabad

‘భారత్ టెక్స్ – 2026’ కార్యక్రమ యాప్‌ను జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీ రావు ఈ రోజు ఆవిష్కరించారు. భారత్‌‌లో జరిగే ఈ అంతర్జాతీయ జౌళి కార్యక్రమానికి వచ్చే కొనుగోలుదారులు, అంతర్జాతీయ ప్రతినిధులు, వక్తలు, సోర్సింగ్ కన్సల్టెంట్లు, భాగస్వాములు, ఎగ్జిబిటర్లు, సందర్శకులకు మెరుగైన అనుభవాన్నిచ్చే ఏకీకృత డిజిటల్ వేదికగా దీనిని రూపొందించారు.

డిజిటల్ విధానానికి ఈ కార్యక్రమం ఇస్తున్న ప్రాధాన్యాన్ని అధికారిక భారత్ టెక్స్ – 2026 యాప్ ప్రతిబింబిస్తుంది. ఇది వ్యాపార భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో, సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, డేటా ఆధారిత భాగస్వామ్య విధానానికి వీలు కల్పించడంలో, మొత్తంగా భారత్ టెక్స్ – 2026 విస్తృతిని, లక్ష్యానికి తోడ్పాటు అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

భారత్ టెక్స్-2026 కోసం సమగ్ర డిజిటల్ సాయాన్ని అందించేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ సాయంతో కార్యక్రమ సమాచారాన్ని, ఎగ్జిబిటర్ల వివరాలను, సమావేశాల సమయాలను తెలుసుకోవచ్చు. వేదికను చేరుకోవడానికి, కొనుగోలుదారుల సమీకరణకు, విజ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ఎప్పటికప్పుడు కార్యక్రమ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఒకే ఒక్క మొబైల్ ఇంటర్‌ఫేస్ సాయంతో చేయవచ్చు.

ప్రదర్శనకారులు, అంతర్జాతీయ ప్రతినిధులు, విదేశీ కొనుగోలుదారులు, దేశీయ టోకు కొనుగోలు దారులు, సోర్సింగ్ కన్సల్టెంట్లు, సాధారణ విజిటర్లు తదితర భాగస్వాములందరికీ వారి వ్యక్తిగత అవసరాలకు తగినట్టుగా సమాచారాన్ని, వీక్షణలు, భాగస్వామ్య సాధనాలను అందిస్తుంది.

24x7 అందుబాటులో ఉండేలా రూపొందించిన ఏఐ స్మార్ట్ అసిస్టెంట్.. ఈ యాప్‌లో ఉన్న ముఖ్యమైన ప్రత్యేకత. వినియోగదారులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలను సరళమైన భాషలో అడిగి వివరాలను పొందవచ్చు. కార్యక్రమాలు, వేదిక, షెడ్యూలు, మార్గాలు, ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని దీని ద్వారా పొందవచ్చు. సులభంగా ఉపయోగించగలిగిన, స్పందించే డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా  ఈ యాప్ భారతీయ, విదేశీ సందర్శకులకు తోడ్పాటును అందిస్తుందని భావిస్తున్నారు.

నెట్వర్కింగ్, మీటింగ్ మాడ్యూళ్ల ద్వారా నిర్మాణాత్మక వ్యాపార భాగస్వామ్యానికి ఈ యాప్ మద్దతునిస్తుంది. ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, ప్రతినిధులు తమకు తగిన భాగస్వామిని గుర్తించడానికి, సమావేశాలను ఏర్పాటు చేసుకోవడానికి, లభ్యతను నిర్వహించడానికి, సమావేశాల అభ్యర్థనలను స్వీకరించడానికి, ఖరారైన సమావేశాలను పర్యవేక్షించడానికి ఇది వీలు కల్పిస్తుంది. దీనిలోని లీడ్ వ్యాలెట్, క్యూఆర్-బేస్డ్ లీడ్ క్యాప్చర్ ఫీచర్ల ద్వారా ఎగ్జిబిటర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రదర్శకుల డిజిటల్ బ్యాడ్జిలను స్కాన్  చేసి, కార్యక్రమం ముగిసిన తర్వాత సంప్రందించడానికి వీలుగా వారి వివరాలను భద్రపరచుకోవచ్చు.

 

భారత్ మండపంలో అత్యాధునిక నావిగేషన్, వే ఫైడింగ్ సదుపాయాలను కూడా ఈ యాప్ అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు వేదిక లోపల ఫ్లోర్ ప్లాన్లను, బూత్‌లను, సంస్థలను గుర్తించడం, స్టాల్ స్థాయిలో మార్గనిర్దేశాన్ని ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

అంతర్జాతీయ కొనుగోలుదారులు, వాణిజ్య సందర్శకుల కోసం రూపొందించిన ఎగ్జిబిటర్ డిస్కవరీ మాడ్యూల్ వివిధ ఎగ్జిబిటర్ విభాగాల్లో నిర్మాణాత్మక శోధన, సమాచారాన్ని వడపోసే వీలును కల్పిస్తుంది. పేరు, ఉత్పత్తి విభాగం, ఎగ్జిబిటర్ రకాన్ని బట్టి సంస్థల గురించి వినియోగదారులు శోధించవచ్చు. ఇది జౌళి సరఫరా వ్యవస్థ అంతంటా లక్షిత ఉత్పత్తి సేకరణ, కేంద్రీకృత వ్యాపార చర్చలకు వీలు కల్పిస్తుంది.

అదే విధంగా అజెండా, విజ్ఞాన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే వీలును ఈ యాప్ అందిస్తుంది. అలాగే మొత్తం కాన్ఫరెన్సు షెడ్యూలు ఆధారంగా తమ వ్యక్తిగత ఆసక్తులకు అనుగుణంగా కార్యక్రమాలకు సంబంధించిన నోటిఫికేషన్లను పొందవచ్చు. ఇది భారత్ టెక్స్ – 2026లో భాగంగా నిర్వహించే విధానపరమైన, పారిశ్రామికపరమైన చర్చలు, విజ్ఞాన ఆధారిత కార్యక్రమాల్లో మెరుగైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

భారత్ టెక్స్ యాప్‌ను పొందడానికి లింక్: https://onelink.to/zcrm4s.

image.png

 

జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో 11 జౌళి ఎగుమతుల ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమ సంఘాలతో కూడిన భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్.. భారత్ టెక్స్ – 2026ను నిర్వహిస్తోంది. ఫార్మ్ నుంచి ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ నుంచి ఫారిన్ వరకు అనే ప్రధానమంత్రి 5ఎఫ్ దార్శనికతకు స్ఫూర్తితో భారత్‌ను ప్రపంచంలో విశ్వసనీయమైన, సుస్థిరమైన, ఆవిష్కరణ ఆధారిత జౌళి కేంద్రంగా, పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026 జులై 14 నుంచి 17 వరకు భారత్ టెక్స్ – 2026 జరుగుతుంది. ప్రపంచ వస్త్ర రంగానికి  చెదిన 7,000 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులను, 1,30,000కు పైగా వాణిజ్య సందర్శకులను ఈ కార్యక్రమం ఒక్క చోటకు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నార, నూలు, వస్త్రాలు, దుస్తులు, గృహాలంకరణ వస్త్రాలు, సాంకేతికపరమైన వస్త్రాలు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, పర్యావరణహిత వస్త్రాలు, మేధోపరమైన తయారీ సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన భారతీయ జౌళి విలువ ఆధారిత వ్యవస్థను ఈ కార్యక్రమం ప్రదర్శిస్తుంది. భారత్ టెక్స్-2026 ఎక్స్‌పోనకు సంబంధించిన మరింత సమాచారాన్ని www.bharat-tex.com లో చూడవచ్చు.


(రిలీజ్ ఐడి: 2263514) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam