శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత అణు రంగంలో ప్రైవేటు పెట్టుబడి అవకాశాలపై డాక్టర్ జితేంద్ర సింగ్‌తో చర్చించిన అమెరికా పారిశ్రామిక ప్రతినిధి బృందం
అణుశక్తి సహకారంపై అమెరికా పారిశ్రామిక ప్రముఖులతో చర్చించిన కేంద్ర మంత్రి
దేశ అణు విస్తరణ, శాంతి చట్టంతో అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్యాల్లో కొత్త అవకాశాలు: డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రైవేటు పెట్టుబడులు, ఎస్ఎంఆర్‌లు, అధునాతన అణు సాంకేతికతలపై భారత్ - అమెరికా చర్చల్లో ప్రధాన చర్చ
నాడు పోస్టు చేయడమైనది:
18 MAY 2026 4:20PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో- అణు ఇంధన - అంతరిక్ష విభాగం - సిబ్బంది, ప్రజా వ్యవహారాలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్‌తో.. ఉన్నత స్థాయి అమెరికా పారిశ్రామిక ప్రతినిధి బృందం ఈ రోజు వివరణాత్మక చర్చలు నిర్వహించింది. అణు ఇంధన సంస్థ, యూఎస్ - ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం (యూఎస్ఐఎస్పీఎఫ్) ప్రతినిధులు ఆ బృందంలో ఉన్నారు. భారత అణుశక్తి రంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక సహకారానికి ఉన్న సరికొత్త అవకాశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
అమెరికా అణుశక్తి రంగానికి చెందిన సీనియర్ ప్రతినిధులు, వ్యాపార భాగస్వాములు, పౌర అణుశక్తి, అత్యాధునిక సాంకేతికతల్లో ఇండో - అమెరికా సహకారంతో ముడిపడి ఉన్న ఉన్నతాధికారులు.. ఈ ప్రతినిధి బృంద పర్యటనల్లో ఒకే వేదికపైకి వచ్చారు. యూఎస్ - ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం నేతృత్వంలో ఈ పర్యటన సాగింది.
భారత ప్రతిష్ఠాత్మక అణుశక్తి మిషన్, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఇటీవల చేపట్టిన విధానపరమైన సంస్కరణలు, శుద్ధ ఇంధనం, కీలక సాంకేతికతల్లో భారత్ - అమెరికా సహకారం విస్తరణపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేశ్ ఎస్. గోఖలే, అణుశక్తి, శాస్త్ర సాంకేతిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, అమెరికా పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, శుద్ధ ఇంధనం, అత్యాధునిక రంగాల్లో బలమైన, భవిష్యత్ ప్రాతిపదికతో కూడిన భాగస్వామ్యం నేడు భారత్, అమెరికా మధ్య ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇందులో పౌర అణు సహకారానికి వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు. 2025 ఫిబ్రవరి 13న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సమావేశం సందర్భంగా ప్రారంభించిన యూఎస్ - ఇండియా ట్రస్ట్ కార్యక్రమం.. కీలక, అత్యాధునిక సాంకేతికతల్లో ఉమ్మడి సహకారానికి సరికొత్త మార్గాలను తెరిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
కృత్రిమ మేధ, సెమీ కండక్టర్లు, బయోటెక్నాలజీ, క్వాంటం సాంకేతికతలు, అధునాతన పదార్థాలు, కీలక ఖనిజాలు, ఇంధనం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విశ్వసనీయ సాంకేతిక భాగస్వామ్యాలు, పటిష్టమైన సరఫరా వ్యవస్థలు, ఆవిష్కరణ వ్యవస్థలు ప్రాతిపదికలుగా ఉన్న ట్రస్ట్ కార్యక్రమం... ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, అంకుర సంస్థల నడుమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒక బలమైన వ్యవస్థను ఏర్పరుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
వికసిత భారత్ 2047 కింద దేశ దీర్ఘకాలిక శుద్ధ ఇంధన లక్ష్యాలను ప్రస్తావిస్తూ.. దేశ అణుశక్తి సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 8.8 గిగావాట్ల నుంచి 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దశలవారీగా, అత్యంత జాగ్రత్తగా రూపొందించిన విస్తరణ వ్యూహంతో దీన్ని సాధించగలమని దీమా వ్యక్తం చేశారు. వేగంగా విస్తరిస్తున్న భారత అణుశక్తి కార్యక్రమం.. తయారీ, సాంకేతిక సహకారం, సరఫరా వ్యవస్థ సమీకరణ, అత్యాధునిక పరిశోధనల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలకు విస్తృతమైన అవకాశాలను సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు.
అణుశక్తి రంగంలో విదేశీ భాగస్వామ్యం సహా ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా భారత్ ఇటీవల శాంతి చట్టం - 2025ను ఆమోదించిందని ప్రతినిధి బృందానికి మంత్రి తెలిపారు. భారతదేశ అణుశక్తి మిషన్‌కు అనుగుణంగా.. పెట్టుబడులు, పారిశ్రామిక సహకారం, తయారీ భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారానికి మరింత అనుకూల వాతావరణం ఈ సంస్కరణ ద్వారా ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో ఉమ్మడి భాగస్వామ్య అవకాశాలను మరింత బలోపేతం చేసేలా.. ఈ చట్టం పరిధిలోని అమలు కార్యాచరణను ప్రస్తుతం తుది దశకు తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు.
దాదాపు రూ. 20,000 కోట్ల భారీ కేటాయింపులతో స్మాల్ మోడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి ప్రణాళికల్లోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. మైక్రో-రియాక్టర్లు, కృత్రిమ మేధ ఆధారిత అణు రక్షణ వ్యవస్థలు, వైజ్ఞానిక కంప్యూటింగ్, అణుశక్తి నమూనాల రూపకల్పన, సంస్థాగత సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అత్యాధునిక రంగాల్లో భారత్-అమెరికా భాగస్వామ్యానికి విస్తృతమైన పరిధి ఉందని ఆయన వెల్లడించారు.
కొవ్వాడలో ప్రతిపాదిత వెస్టింగ్‌హౌస్ ఏపీ 1000 ప్రాజెక్టు, ఇండో-అమెరికా పౌర అణు ఇంధన కార్యాచరణ బృందం పరిధిలో సహకారం, హైడ్రోజన్ ఉత్పత్తి, సమగ్ర ఇంధన వ్యవస్థలు, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ అనువర్తనాలు, అరుదైన భౌగోళిక ఖనిజాల్లో భాగస్వామ్యం, ఫెర్మిల్యాబ్ భాగస్వామ్యాల ద్వారా హై ఇంటెన్సిటీ సూపర్‌కండక్టింగ్ ప్రోటాన్ యాక్సిలరేటర్ సాంకేతికతలు సహా.. ప్రస్తుతం కొనసాగుతున్న పలు భారత్-అమెరికా ఉమ్మడి కార్యక్రమాల పురోగతిని కూడా ఈ చర్చల్లో సమీక్షించారు.
లైగో-ఇండియా ప్రాజెక్టు పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. అమెరికాకు చెందిన లైగో లేబొరేటరీ, నేషనల్ సైన్స్ ఫౌండేషన్లతో కలిసి భారత ప్రభుత్వ అణుశక్తి, శాస్త్ర సాంకేతిక శాఖలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. రూ. 2,600 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఆమోదించిన ఈ ప్రాజెక్టు.. భారత్ – అమెరికా అత్యాధునిక శాస్త్రీయ సహకారానికి ముఖ్య ఉదాహరణల్లో ఒకటి.
శుద్ధ ఇంధనం, అణు సాంకేతికతలు, అత్యాధునిక తయారీ రంగం, ఆవిష్కరణలు చోదకంగా ఉన్న రంగాల్లో భారత్, అమెరికా మధ్య ఆచరణాత్మక, పరిశ్రమల నేతృత్వంలో, పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న ఉమ్మడి నిబద్ధతతో ఈ సమావేశం ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 2262640)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17