వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్లు, అయిదేళ్లలో 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు భారత్ లక్ష్యం: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఎగుమతి లక్ష్యం జాతీయ ప్రాధాన్యం.. మార్కెట్ లభ్యతను మెరుగుపరచడం కోసం దాదాపు 38 అభివృద్ధి చెందిన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు
అవకాశాలను గుర్తించి, దిగుమతి ప్రత్యామ్నాయంతో దేశానికి సహాయపడేలా దిగుమతి ధోరణులను పర్యవేక్షించాలని వ్యాపార సంస్థలను కోరిన మంత్రి
స్వదేశీని ప్రోత్సహిద్దాం.. దేశీయ ఉత్పత్తులకు దన్నుగా నిలిచి దిగుమతులపై ఆధీనతను తగ్గించుకుందాం
పెరుగుతున్న వినియోగంతో విస్తృతమైన అవకాశాల సృష్టి.. అయితే దిగుమతుల పెరుగుదలను నివారించేందుకు దేశీయ పరిశ్రమ ముందుకు రావాలి
యువత, అంకుర సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని శ్రీ పీయూష్ గోయల్ పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
18 MAY 2026 2:54PM by PIB Hyderabad
ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్లు, వచ్చే అయిదేళ్లలో 2 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను సాధించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందని, ఆత్మనిర్భర్ భారత్‌కు ఇదే అసలైన ప్రమాణమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన భారతీయ వ్యాపార మహోత్సవ్ వెబ్‌సైట్ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ఏడాది ఎగుమతులు 863 బిలియన్ డాలర్లకు చేరాయని, గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 5 శాతం ఎక్కువని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో వస్తువులు, సేవల ఎగుమతులు రెండూ పెరగడం విశేషమైన విజయమని ఆయన అభివర్ణించారు.
ఇది కేవలం ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదని, యావద్దేశ లక్ష్యమని మంత్రి అన్నారు. దీన్ని సాధించడం కోసం అవసరమైన ఎలాంటి సాయాన్ని అందించడానికైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీ గోయల్ పేర్కొన్నారు. గత మూడున్నరేల్ల కాలంగా దాదాపు 38 అభివృద్ధి చెందిన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం కృషి చేశామని, దీనివల్ల మన పోటీదారులతో పోలిస్తే తక్కువ దిగుమతి సుంకాలతోనే భారతీయ వస్తువులను విక్రయించుకునేలా విస్తృతమైన మార్కెట్లలోకి ప్రవేశించడంలో మనకు ప్రాధాన్యం లభిస్తుందని అన్నారు. ఈ ఒప్పందాలు క్రమంగా అమలులోకి వస్తాయని చెబుతూ.. ఒమన్‌తో కుదిరిన ఎఫ్‌టీఏ జూన్ 1 నుంచి అమల్లోకి రావచ్చన్నారు. అలాగే సంతకాలు పూర్తికావాల్సి ఉన్న మిగిలిన ఒప్పందాలు కూడా అనంతరం కార్యాచరణలోకి వస్తాయని ఆయన తెలిపారు.
వాణిజ్య మంత్రిత్వ శాఖ ట్రేడ్ పోర్టల్ ద్వారా దిగుమతుల సరళిని అధ్యయనం చేయాలని, తద్వారా దేశీయ తయారీ, దిగుమతి ప్రత్యామ్నాయాలకు గల అవకాశాలను గుర్తించాలని భాగస్వామ్య పక్షాలను శ్రీ పియూష్ గోయల్ కోరారు. దేశంలోకి ఎలాంటి వస్తువులు దిగుమతి అవుతున్నాయో నిరంతరం గమనించాల్సిన అవసరం ఉందని, ఈ ధోరణులు భారతీయ వ్యాపార సంస్థలకు విశేషమైన అవకాశాలను అందిస్తాయని ఆయన చెప్పారు. విదేశాల నుంచి భారత్‌లోకి వస్తున్న ఉత్పత్తులను పేర్కొంటూ.. మరింత క్రమబద్ధమైన పద్ధతిలో ఈ అవకాశాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా వాణిజ్య మంత్రిత్వ శాఖ పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. దిగుమతులకు ప్రత్యామ్నాయం, ఎగుమతులు ఆర్థిక వృద్ధికి రెండు ముఖ్యమైన చోదకాలన్నారు. వ్యాపార సంస్థలు ఈ అవకాశాలను ఉపయోగించుకునేలా.. మన దేశానికి బలం, సామర్థ్యం ఉన్న రంగాలకు సంబంధించి కూడా మంత్రిత్వ శాఖ ప్రదర్శనలు చేస్తుందని తెలిపారు.
దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను, స్వదేశీ స్ఫూర్తిని బలోపేతం చేయాల్సిన ప్రాధాన్యాన్ని శ్రీ పియూష్ గోయల్ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల పట్ల చూపే చిన్నపాటి మొగ్గు కూడా దేశీయ పరిశ్రమను బలహీనపరుస్తుందని గుర్తుచేశారు. మధ్యతరగతి విస్తరణతో దేశంలో వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్ తన అవసరాలను తానే తీర్చుకోవడం అత్యావశ్యకమని, లేనిపక్షంలో దిగుమతులు ఆ అంతరాన్ని ఆక్రమిస్తాయని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే ఒకరికొకరు సరఫరాదారులు, వినియోగదారులుగా వ్యవహరిస్తూ.. వ్యాపార సంస్థలు, వినియోగదారులు పరస్పర సహకరించుకోవాలని ఆయన కోరారు. భారతీయ స్వదేశీ మేళా వంటి కార్యక్రమాల ద్వారా ఈ భావన బలపడితే, అది మేడిన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త ఉద్యమంగా విస్తరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
మూలధన వస్తువుల వంటి రంగాల్లో భారత్ నేటికీ విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతోందని శ్రీ గోయల్ అన్నారు. దిగుమతులపై ఆధారపడడానికి స్వస్తి చెప్పి దేశీయ ఉత్పత్తిని పెంచాలని రాజ్‌కోట్, జలంధర్, లూథియానా, బటాలా, పూణె వంటి పారిశ్రామిక క్లస్టర్లకు ఆయన పిలుపునిచ్చారు.
దేశీయంగా వైద్య పరికరాల తయారీ క్రమంగా పెరుగుతోందని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖపట్నంలో తయారైన సీటీ స్కాన్ యంత్రాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. భారత్‌లో తయారైన ఉత్పత్తులను మనం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే, వాటికి అంతగా డిమాండ్ పెరిగి వ్యాపార పరిధి మరింత విస్తరిస్తుందని ఆయన చెప్పారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయినంత మాత్రాన భారత్ ఏమాత్రం అలసత్వానికి లేదా మితిమీరిన ఆత్మవిశ్వాసానికి లోనుకావద్దని శ్రీ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశం మేరకు.. ఈ అమృత కాల సమయంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా నిరంతరం పెద్ద విజయాల కోసం దేశం కృషి చేయాలని, కొత్త ఆలోచనలను సృష్టించాలని, నిరంతరాయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ప్రజల్లో ఉత్సాహంతోపాటు 140 కోట్ల భారతీయుల సమష్టి సంకల్పం.. ప్రపంచంలో ఏ శక్తీ భారత ప్రగతిని అడ్డుకోలేదనే భరోసా ఇస్తోందని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. భారత్ మండపంలో నిర్వహిస్తున్న భారతీయ స్వదేశీ మేళాను ప్రస్తావిస్తూ, ఆ వేదిక దేశ వైవిధ్యాన్ని చాటుతోందని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ ఉపయోగించిన వస్తువులు, ఉత్పత్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయన్నారు.
దేశంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడాలని, ఉత్పాదకత పెరగాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని శ్రీ గోయల్ చెప్పారు. నాణ్యత, ఉత్పాదకత అత్యంత ప్రధానమైనవని స్పష్టం చేశారు. మెరుగైన నాణ్యత, ప్యాకేజింగ్ లేకపోతే.. ప్రపంచ మార్కెట్లను భారత్ కైవసం చేసుకోలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని, దేశ ఎగుమతులు కూడా స్థిరంగా వృద్ధి చెందుతున్నాయని ఆయన గుర్తుచేశారు.
వ్యవసాయ, మత్స్య రంగాల్లోని అపారమైన సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ... దేశంలోని రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులు సహా భారత వ్యవసాయ ఎగుమతులు దాదాపు రూ. 5 లక్షల కోట్లను దాటాయని శ్రీ గోయల్ తెలిపారు. అయితే ఈ రంగాల్లో విలువ జోడింపు ఇంకా తక్కువగానే ఉందని ఆయన గుర్తుచేశారు. అదనపు విలువను జోడించే ఈ రంగాల్లోకి యువ పారిశ్రామికవేత్తలు ప్రవేశించి.. చిన్న, మధ్యతరహా, భారీ శ్రేణి ప్రాసెసింగ్, తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తే అపారమైన అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.
ఎగుమతుల ఆధారిత విధానం దిశగా భారత్ అడుగులు వేస్తే, సహజంగానే నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశీయ ఉత్పత్తులు అంతర్జాతీయ ఎగుమతులకు తగిన నాణ్యతను పెంపొందించుకుంటే, ప్రజలు విదేశీ వస్తువుల వైపు మొగ్గు చూపరని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో సమర్థంగా పోటీ పడాలంటే.. ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, పోటీతత్వాన్ని పెంపొందించడం, వ్యాపార కార్యకలాపాల పరిధిని విస్తరించడం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు.
ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని మరింత విస్తరించామని, రూ. 500 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు కూడా ఇప్పుడు ఎంఎస్ఎంఈ పరిధిలోకి వస్తాయని శ్రీ గోయల్ తెలిపారు. వ్యాపార సంస్థలు మరింతగా ఎదగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని, వారికి అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా తయారీ రంగానికి చెందిన వ్యక్తులందరినీ భారతీయ వ్యాపార మహోత్సవ్‌కు తీసుకురావాలని ఆయన నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం 1,000 వ్యాపార సంస్థలు పాల్గొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం 25 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలని ఆయన సూచించారు. దీంతో ఒక్క ఈ విభాగం నుంచే దాదాపు 700 నుంచి 750 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.
దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి, క్రమంగా హెచ్చుతున్న వినియోగం వల్ల దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ వర్తకులకు, పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని శ్రీ గోయల్ అన్నారు. అయితే దేశీయ పరిశ్రమలు గనుక దేశ ప్రజల అవసరాలను తీర్చడంలో విఫలమైతే, ఆ ఖాళీని దిగుమతులు భర్తీ చేస్తాయని ఆయన హెచ్చరించారు.
ఈ దేశవ్యాప్త కార్యక్రమంలో యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న యువత సహా తదుపరి తరాన్ని భాగస్వామ్యం చేయాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. దిగుమతుల ప్రత్యామ్నాయాలకు సంబంధించిన అవకాశాలను, అలాగే ప్రస్తుతం దేశంలోకి దిగుమతి అవుతున్న ఉత్పత్తుల వివరాలను ప్రదర్శించాలని సూచించారు. తద్వారా దేశీయంగా తయారీకి ఉన్న విస్తృతమైన పరిధిని ప్రజలు అర్థం చేసుకోగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
రూపే కార్డులు, యూపీఐలను నిర్వహించే ఎన్‌పీసీఐని భారతీయ స్వదేశీ మేళాలో భాగస్వామ్యం చేయాలని శ్రీ గోయల్ ప్రతిపాదించారు. ప్రస్తుతం యూపీఐని విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, రూపే కార్డులను తగినంతగా వినియోగించడం లేదని ఆయన గుర్తుచేశారు. ఈ వేదికలో 50 నుంచి 100 ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించి సందర్శకులు రూపే డెబిట్ కార్డులను పొందవచ్చని, అన్ని లావాదేవీలను యూపీఐ లేదా రూపే కార్డుల ద్వారా డిజిటల్ పద్ధతిలోనే నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు.
దీనికోసం బ్యాంకులన్నింటినీ ఏకతాటిపైకి తేవడం వల్ల దేశ చెల్లింపుల వ్యవస్థలను ప్రజలు మరింత విస్తృతంగా స్వీకరించేలా ప్రోత్సహించవచ్చన్నారు. భారత్ మండపంలో క్రమం తప్పకుండా అంతర్జాతీయ ప్రదర్శనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయని, ఇలాంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా రూపే, యూపీఐలను స్వీకరించేలా మరింత మందికి స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి చిన్నచిన్న కార్యక్రమాలు దేశ అమృతకాల ప్రయాణానికి సరికొత్త శక్తిని, దిశానిర్దేశాన్ని అందిస్తాయన్నారు. అలాగే ప్రజా భాగస్వామ్యం ద్వారా సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన భారత్ దిశగా మార్గాన్ని బలోపేతం చేస్తాయని శ్రీ గోయల్ అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఒక్క అడుగు ముందుకేస్తే, దేశం మొత్తం ఒకేసారి 140 కోట్ల అడుగులు ముందుకేస్తుందని అని ఆయన వ్యాఖ్యానించారు.
భారతీయ వ్యాపార మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి పనిచేయాలని శ్రీ గోయల్ కోరారు. ఈ కార్యక్రమ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ వ్యాపార మహోత్సవ్ 2026 ఆగస్టు 12 - 15 నుంచి ప్రారంభమవుతుంది.
వెబ్‌సైట్ లింక్: https://bharatiyavyaparmahotsav.com/
***
(రిలీజ్ ఐడి: 2262629)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11