ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ని (ఈఆర్‌టీ) ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2026 12:12AM by PIB Hyderabad

గోథెన్‌బర్గ్‌లో 2026 మే 17న నిర్వహించిన 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' (ఈఆర్‌టీ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. వోల్వో గ్రూప్ నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్, ఐరోపా కమిషన్ అధ్యక్షులు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఐరోపాకు చెందిన సీనియర్ పారిశ్రామిక ప్రముఖులు, ప్రముఖ యూరోపియన్- భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కీలక ఉపన్యాసం ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ.. భారత్, ఐరోపా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావించారు. రోజురోజుకూ మరింత క్లిష్టంగా, అనిశ్చితంగా మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో పరస్పరం నమ్మకమైన భాగస్వామ్యాల ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా చెప్పారు.

చారిత్రాత్మకమైన 'భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' చర్చలు విజయవంతంగా ముగియడం సహా భారత్-ఐరోపా సమాఖ్య (ఈయూ) సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందాన్ని ఆయన ఒక పరివర్తనాత్మక ఆర్థిక భాగస్వామ్యంగా అభివర్ణించారు. ఇది వాణిజ్యం, సాంకేతికత, తయారీ, సేవా రంగాలు, దృఢమైన సరఫరా వ్యవస్థలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. వీటితో పాటు 'భారత్- మధ్య ప్రాచ్యం- ఐరోపా ఎకనామిక్ కారిడార్' (ఐఎంఈసీ) వంటి అనుసంధాన ప్రాజెక్టులు భారత్-ఐరోపా వ్యాపార భాగస్వామ్యానికి సరికొత్త విలువను చేకూరుస్తాయని ఆయన పేర్కొన్నారు.

నేటి ప్రపంచంలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు భారతదేశం అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా నిలుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. వేగంగా కొనసాగుతున్న భారత ఆర్థిక వృద్ధి, నవతరం ఆర్థిక సంస్కరణలు, పాలనలో 'సులభతర వ్యాపార నిర్వహణ'పై ప్రత్యేక దృష్టి, విస్తరిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), శక్తిమంతమైన తయారీ వ్యవస్థ, వేగంగా రూపాంతరం చెందుతున్న మౌలిక సదుపాయాల రంగాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘భారత్ కోసం డిజైన్, భారత్‌లో తయారీ, భారత్ నుంచి ఎగుమతి’ అనే దేశ దార్శనికతను ఆయన పునరుద్ఘాటించారు. అలాగే భారత్‌ను ఒక నమ్మకమైన, సురక్షితమైన ఆర్థిక భాగస్వామిగా భావించి దేశంలో తమ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిందిగా ఐరోపా కంపెనీలను ఆహ్వానించారు.

దృఢత్వంతో కూడిన వైవిధ్యభరితమైన సరఫరా వ్యవస్థలను తయారు చేసేందుకు భారత్, ఐరోపా కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి మోదీ ప్రముఖంగా చెప్పారు. రవాణా, లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్, అణుశక్తి రంగాలలో భారీ పెట్టుబడులతో సహా భారత్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాలు, ఇంధన పరివర్తనను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. టెలికాం - డిజిటల్ మౌలిక సదుపాయాలు.. ఏఐ, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ తయారీ.. హరిత పరివర్తన- స్వచ్ఛమైన ఇంధనం, మౌలిక సదుపాయాలు, చలనశీలత - పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ - లైఫ్ సైన్సెస్ వంటి రంగాలలో భారత్‌తో భాగస్వామ్యం వహించాలని ఆయన ఐరోపా పారిశ్రామిక ప్రముఖులను ఆహ్వానించారు.

భారత్, ఐరోపా మధ్య ప్రతిభావంతుల రాకపోకలు, విద్య- నైపుణ్య భాగస్వామ్యాలకు ఉన్న ప్రాముఖ్యతను కూడా ప్రధానమంత్రి మోదీ ప్రధానంగా చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్‌లోని యువ, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తే ప్రధాన బలమని ఆయన అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను, ఆవిష్కరణల భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఆయన ఉద్ఘాటించారు. 

ప్రతి సంవత్సరం 'భారత్-ఐరోపా సీఈఓల రౌండ్-టేబుల్' సమావేశాన్ని నిర్వహించాలని, ఈఆర్‌టీ‌లో ఒక ప్రత్యేక 'ఇండియా డెస్క్'ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి సూచించారు. భారత్-ఐరోపా ఆర్థిక, పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసే విషయంలో అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ చర్చా కార్యక్రమం ఒక ముఖ్యమైన వేదికను అందించింది. సుస్థిర వృద్ధి, సాంకేతిక సహకారం, దృఢత్వంతో కూడిన ప్రపంచ భాగస్వామ్యాల పట్ల భారత్-ఐరోపాలకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఇది పునరుద్ఘాటించింది.

***


(రిలీజ్ ఐడి: 2262220) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam