సహకార మంత్రిత్వ శాఖ
మత్స్య రంగంలో “సహకార్ సే సమృద్ధి” దార్శనికత బలోపేతం లక్ష్యంగా హైదరాబాద్‌లో మత్స్య సహకార సంఘాల జాతీయ సదస్సు
సహకార సంఘాల నేతృత్వంలో మత్స్యరంగాన్ని విస్తరించడం, “సహకార సంఘాల మధ్య సహకారాన్ని” మరింత పటిష్ఠం చేయడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు
మత్స్య సహకార సంఘాల కోసం మరింత పటిష్ఠమైన సంస్థాగత విధాన ప్రణాళికలు, సాంకేతిక ఏకీకరణ, మార్కెట్ అనుసంధానాల ఆవశ్యకతను స్పష్టం చేసిన సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భుటాని
ఆవిష్కరణలు, అంకుర సంస్థల వ్యవస్థ, మత్స్యరంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, మత్స్యకారుల సంఘాల సమ్మిళిత వృద్ధిని ప్రస్తావించిన కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డా. అభిలక్ష్ లిఖి
నూతన మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, ప్రస్తుత సంఘాల బలోపేతం, సంస్థాగత రుణ అనుసంధానాలు, పీఎమ్ఎమ్ఎస్‌వై-అనుసంధానిత విస్తరణను చర్చించిన జాతీయ సదస్సు
జలాశయాల్లో చేపల పెంపకం పరిశ్రమ, సముద్రపు నాచు సాగు, సముద్ర జలాల్లో ఉంచిన పంజరాల్లో జలచరాల పెంపకం, మత్స్యరంగ బీమా, డిజిటల్ వేదికలు, సహకార కార్యకలాపాల విస్తరణపై సాంకేతిక సమావేశాలు
నాడు పోస్టు చేయడమైనది:
15 MAY 2026 9:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత “సహకార్ సే సమృద్ధి” మార్గదర్శనంలో... కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌లో మత్స్యరంగ సహకార సంఘాల జాతీయ స్థాయి కార్యశాలను నిర్వహించారు. మత్స్యకారుల సంఘాలు... గ్రామీణ ఆర్థిక వ్యవస్థల సమ్మిళిత, సుస్థిర వృద్ధి కోసం మత్స్యరంగ సహకార వ్యవస్థ బలోపేతం... “సహకార సంఘాల మధ్య సహకారాన్ని” ప్రోత్సహించడం లక్ష్యంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాంతీయ, జాతీయ సహకార సదస్సుల్లో భాగంగా ఈ కార్యశాలను నిర్వహించారు. ఇప్పటికే మిజోరం, జైపూర్‌లోనూ ఈ కార్యశాలలు నిర్వహించారు.
పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు, మత్స్యరంగ సంస్థలు, సహకార సంఘాలు, ఆర్థిక సంస్థలు, అభివృద్ధి సంస్థల ప్రతినిధులను ఈ జాతీయ సదస్సు ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. భారత ప్రభుత్వ మత్స్య శాఖకు చెందిన సీనియర్ అధికారులూ వీడియో అనుసంధానం ద్వారా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సదస్సు ప్రక్రియలోనూ, సాంకేతిక చర్చల్లోనూ జాతీయ మత్స్య అభివృద్ధి మండలి (ఎన్ఎఫ్‌డీబీ) చురుగ్గా పాలుపంచుకుంది. రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో మత్స్య రంగానికి సంబంధించిన పథకాల అమలును వేగవంతం చేయడం, నిరంతర పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం, విధానపరమైన అభిప్రాయాల సేకరణ కోసం సంస్థాగత యంత్రాంగాలను రూపొందించడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి.
ప్రారంభ సమావేశంలో భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భుటాని మాట్లాడుతూ... గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడంలో, ఆదాయ అవకాశాలను పెంపొందించడంలో, సుస్థిరమైన, సమాజ ఆధారితమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడంలో మత్స్యరంగ సహకార సంఘాల ప్రాముఖ్యత పెరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు, మహిళలు, మత్స్యరంగ వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న గ్రామీణ కుటుంబాల సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించడంలో సహకార సంస్థలు కీలకంగా మారాయని ఆయన పేర్కొన్నారు. మెరుగైన ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఫలితాల కోసం సంస్థాగత యంత్రాంగాలను బలోపేతం చేయడం... సరసమైన ఆర్థిక సహాయాన్ని మరింత మెరుగ్గా అందుబాటులో ఉంచడం... సహకార నిర్మాణాలను ఆధునికీకరించడం... సాంకేతికత ఆధారిత వ్యవస్థలను ఏకీకృతం చేయడం వంటి చర్యల ఆవశ్యకతను డాక్టర్ భుటాని ప్రధానంగా ప్రస్తావించారు.
సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు తర్వాత మత్స్య రంగ సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి కోసం ఒక బలమైన సంస్థాగత విధాన ప్రణాళికను రూపొందించే దిశగా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని డాక్టర్ భుటాని పేర్కొన్నారు. సహకార సంస్థలు, అభివృద్ధి సంస్థలు, ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్యంతో జరుగుతున్న సమన్వయ ప్రయత్నాలు... ఉపాధి కల్పన, పోషకాహార భద్రత, గ్రామీణ ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేయగల ఒక బలమైన క్షేత్రస్థాయి వ్యవస్థను సృష్టిస్తున్నాయని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, విధానపరమైన అభిప్రాయాలు, పథకాల సమర్థ అమలును నిర్ధారించడానికి రాష్ట్రాలతో క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకోసారి కార్యశాలలు నిర్వహించాల్సిన ప్రాముఖ్యతనూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి మాట్లాడుతూ... భారత మత్స్య రంగంలో అందుబాటులో ఉన్న అపారమైన అవకాశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆవిష్కరణల ఆధారితమైన, సహకార సంఘాల నేతృత్వంలోని వృద్ధి నమూనాల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. విస్తరిస్తున్న మత్స్యరంగ అంకురసంస్థల వ్యవస్థ గురించి మాట్లాడుతూ... మెరుగైన మార్కెట్ అనుసంధానం, డిజిటల్ ఏకీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. భారత మత్స్య రంగాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ప్రమాణాలు, భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన ప్రాముఖ్యతనూ డాక్టర్ అభిలక్ష్ ప్రధానంగా ప్రస్తావించారు.
మత్స్యరంగ సహకార సంఘాల అభివృద్ధికి సంబంధించిన బహుముఖ అంశాలను చర్చిస్తూ... సాంకేతిక, థీమాటిక్ సమావేశాలను నిర్వహించారు. కొత్త మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న సంఘాల బలోపేతం, 2026-27 ఆర్థిక సంవత్సరానికి అమలు లక్ష్యాలు, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ-యోజన కింద సంఘాల స్వయం-సమృద్ధి కోసం వ్యూహాలను గురించి చర్చించారు. సభ్యత్వాలను పెంచడం, డీసీసీబీ రుణ అనుసంధానాలను బలోపేతం చేయడం, క్రియాశీలంగా లేని మత్స్య సహకార సంఘాలను పునరుద్ధరించడం, బోర్డు సభ్యులు, సంఘ సభ్యుల సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలపైనా సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఎన్ఎఫ్‌డీబీ, ఎన్‌సీడీసీ, ఎన్ఏఎఫ్ఈడీ, ఎస్ఎఫ్ఏసీ, ఎన్ఈఆర్ఏఎమ్ఏసీ వంటి సంస్థల ప్రతినిధులు అమలు వ్యూహాలు, డిజిటల్ వేదికలు, శిక్షణా మాడ్యూల్స్, మహిళా సాధికారత కార్యక్రమాలు, సహకార అభివృద్ధి నమూనాలపై వివరణాత్మక ఆలోచనలను ప్రదర్శించారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ సహా మరికొన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులూ తమ అమలు అనుభవాలు, అత్యుత్తమ పద్ధతులు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలను పంచుకున్నారు.
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన సమావేశంలో పీఎమ్ఎమ్ఎస్‌వై, పీఎమ్-ఎమ్‌కేఎస్ఎస్‌వై, మత్స్యరంగం-ఆక్వాకల్చర్ రంగాల మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎఫ్ఐడీఎఫ్) వంటి పథకాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నమూనాలు, శిక్షణ, సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలను గురించి చర్చించారు. మత్స్య సహకార సంఘాలకు, వాటి సభ్యులకు బీమా రక్షణ కల్పించడంపైనా విస్తృతంగా చర్చించారు. సమూహ ప్రమాద బీమా పథకాలు, ఆక్వాకల్చర్ బీమా, నౌకల బీమా వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.
జలాశయ మత్స్య సంపద, అలంకార సంబంధిత చేపల పెంపకం, క్లస్టర్ ఆధారిత మత్స్యరంగ అభివృద్ధి, బయో-ఫ్లాక్ వ్యవస్థలు, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ వ్యవస్థల వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణపై ప్రత్యేకంగా సాంకేతిక సమావేశాలను నిర్వహించారు. జలాశయ లీజింగ్ వ్యవస్థల్లో చట్టపరమైన, విధానపరమైన సంస్కరణలు, పీఎమ్ఎమ్ఎస్‌వై రెండో దశ కింద మత్స్య సహకార సంఘాలకు ప్రత్యేక ప్రాజెక్టుల ఆవశ్యకతపైనా చర్చలు జరిగాయి.
సంస్థాగత రుణాల మద్దతు ద్వారా మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయడం, సహకార బ్యాంకుల పాత్రను విస్తరించడం, నాబార్డ్, ఎన్‌సీడీసీ మద్దతు యంత్రాంగాలను మెరుగుపరచడం, డీసీసీబీల ద్వారా మత్స్య సహకార సంఘాలకు రుణాలను మరింత మెరుగ్గా అందుబాటులో ఉంచడం వంటి అంశాలను ఈ కార్యశాలలో చర్చించారు.
సముద్ర సంబంధిత మత్స్య సహకార సంఘాల కార్యకలాపాల విస్తరణపైనా కూలంకషంగా చర్చించారు. సముద్ర జలాల్లో ఉంచిన పంజరాల్లో జలచరాల పెంపకం, మహిళా సాధికారత కోసం సముద్రపు నాచు సాగు, చేపల వ్యర్థాల సంబంధిత వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచడం, సర్క్యులర్ ఆర్థిక నమూనాలు, దేశీయ వినియోగం, ఎగుమతి అవకాశాలు, డిజిటల్ మార్కెటింగ్ వేదికల వంటి అంశాలపై చర్చలు జరిగాయి. బలమైన మార్కెట్ అనుసంధానాల ఆవశ్యకతను, సహకార సంఘాల నేతృత్వంలోని మత్స్యరంగ కార్యకలాపాలను విస్తరించాల్సిన అవసరాన్ని సీఎమ్ఎఫ్ఆర్ఐ, సీఐఎఫ్‌టీ, ఎమ్‌పీఈడీఏ వంటి సంస్థలు ప్రధానంగా ప్రస్తావించాయి.
సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళికపై ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో పీఏసీఎస్ గుర్తింపు, నిల్వ మౌలిక సదుపాయాలు, అమలు ప్రణాళికలు, ఏఎమ్ఐ ఫైనాన్సింగ్, డబ్ల్యూడీఆర్ఏ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలు, సహకార నిల్వ వ్యవస్థల బలోపేతంపై ప్రధానంగా దృష్టి సారించారు. వ్యాపార కార్యకలాపాల విస్తరణ, బలహీన సొసైటీల పునరుద్ధరణ ప్రణాళికలు, డిపాజిట్ల సమీకరణ, సభ్యత్వ విస్తరణ వ్యూహాలు సహా, రెండు లక్షల కొత్త బహుళార్ధసాధక పీఏసీఎస్, పాడి, మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, బలోపేతంపై మరో ప్రధాన సమావేశం దృష్టి సారించింది.
మత్స్య రంగంలో సహకార సంఘాల నేతృత్వంలోని పరివర్తనను వేగవంతం చేయడం, అమలు యంత్రాంగాలను బలోపేతం చేయడం, కొత్త మత్స్య సహకార సంఘాలను ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా మత్స్యకారుల సంఘాలకు దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక సాధికారతను కల్పించడం పట్ల సమష్టి నిబద్ధతను ప్రకటిస్తూ ఈ కార్యశాల ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 2261840)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5