సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
భారత్‌కు తిరిగి తెచ్చిన సాంస్కృతిక కళాఖండాల వైభవం: నేషనల్ మ్యూజియం వద్ద విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
నాడు పోస్టు చేయడమైనది:
13 MAY 2026 5:56PM by PIB Hyderabad
అమెరికా నుంచి పవిత్ర కళాఖండాలను తిరిగి తీసుకురావడం భారత నాగరికతా స్మృతులను పునరుద్ధరించడాన్ని సూచిస్తుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ రోజు అన్నారు. అదే విధంగా దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను తిరిగి తీసుకురావడంలో, దానిని పరిరక్షించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని తెలియజేశారు.
న్యూఢిల్లీలోని జనపథ్‌లో ఉన్న జాతీయ వస్తుప్రదర్శన శాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ నుంచి మూడు చారిత్రక కాంస్య విగ్రహాలను తిరిగి దేశానికి తీసుకురావడం కీలకమైన ఘట్టమన్నారు. చోరీకి గురైన సాంస్కృతిక కళాఖండాలను తిరిగి పొందడంలో, ప్రపంచవ్యాప్తంగా నైతిక విలువలతో కూడిన మ్యూజియం నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఇవి సూచిస్తున్నాయని చెప్పారు.
image.png
తిరిగి తీసుకొచ్చిన కాంస్య విగ్రహాల్లో క్రీ.శ. 990 నాటి చోళుల కాలానికి చెందిన శివ నటరాజ, 12వ శతాబ్దానికి చెందిన సోమస్కంద (శివ, ఉమ), 16వ శతాబ్దం నాటి విజయనగర కాలానికి చెందిన సాధు సుందరర్, పరావై విగ్రహాలునాయి. తమిళనాడులోని ఆలయాలకు చెందిన ఈ పవిత్ర విగ్రహాలను 20వ శతాబ్దపు మధ్య కాలంలో భారత్ నుంచి అక్రమంగా విదేశాలకు తరలించారు.
పైన పేర్కొన్న విగ్రహాలు ప్రాచీన కళాఖండాలు మాత్రమే కాదని, అవి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, చరిత్రకు, నాగరికతా స్మృతులకు చిహ్నాలని మంత్రి తెలిపారు. దశాబ్దాల తరబడి కొనసాగిన చారిత్రక వస్తువుల అక్రమ రవాణా కారణంగా భారత దేశం ఎంతో విలువైన సాంస్కృతిక సంపదను కోల్పోయిందన్నారు.
image.png
ఆర్కైవల్ రికార్డులు, క్షేత్రస్థాయి పత్రాలు, 1950, 1960ల నాటి చారిత్రక ఆలయాల ఛాయాచిత్రాల ఆధారంగా భారత పురావస్తు సర్వే విభాగం (ఏఎస్ఐ) విస్తృత పరిశోధన చేసి.. ఈ కళాఖండాలు తమిళనాడులోని ఆలయాలకు చెందినవని గుర్తించింది. తద్వారా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, స్మిత్సోనియన్ సంస్థ, అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం మధ్య సమన్వయ చర్యలకు మార్గం సుగమమైంది.
image.png
గుర్తించిన కళాఖండాల వివరాలు:
image.png
· శివ నటరాజ (చోళుల కాలం, సుమారు క్రీ.శ. 990 నాటిది): వాస్తవానికి ఈ విగ్రహం తంజావూరు జిల్లాలోని శ్రీ భవ ఔషదేశ్వర ఆలయానికి చెందినది. అక్కడ దీనిని 1957లో ఫొటో తీశారు.
· సాధు సుందరర్, పరావై (16వ శతాబ్దం, విజయనగర కాలం): తమిళనాడులోని వీరసోలపురం గ్రామంలోని శివాలయంలో 1956లో ఫోటో తీశారు.
· సోమ స్కంద (శివ, ఉమ) (12వ శతాబ్దం, చోళుల కాలం): తమిళనాడులోని అలత్తూర్ గ్రామంలోని విశ్వనాథ ఆలయం వద్ద 1959లో ఫోటో తీశారు.
సోమస్కంద, సాధు సుందరర్-పరావై కాంస్య విగ్రహాలు 2026 మే 12న న్యూఢిల్లీకి చేరుకున్నాయి. ‘‘ది ఆర్ట్ ఆఫ్ నోయింగ్ ఇన్ సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, అండ్ ది హిమాలయాస్’’ పేరుతో నిర్వహించే ఎగ్జిబిషన్లో ప్రదర్శన అనంతరం శివ నటరాజ విగ్రహాన్ని భారత్‌కు తీసుకువస్తారు.
సద్భావనా చర్యగా, బాధ్యతాయుతమైన మ్యూజియం నిర్వహణకు మద్దతుగా శివ నటరాజ విగ్రహాన్ని 2025 నుంచి 2028 వరకు మూడేళ్ల కాలానికి రుణ ప్రాతిపదికన ఇచ్చేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. దీని ద్వారా ఈ విగ్రహం ఆవిర్భావం నుంచి పునరాగమనం వరకు దాని చారిత్రక ప్రయాణాన్ని పూర్తిగా అర్థం చేసుకొనే వీలును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందించింది.
2014 నుంచి 666 ప్రాచీన కళాఖండాలను వివిధ దేశాల నుంచి తిరిగి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. వాటిలో 2014 నుంచి చేపట్టిన ప్రయత్నాల ద్వారా తిరిగి తెచ్చిన 653 కళాఖండాలున్నాయని తెలిపారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఏఎస్ఐ, విదేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు, ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థల ద్వారా చేపడుతున్న దౌత్యపరమైన, న్యాయపరమైన, సంస్థాగత చర్యల కారణంగా ఇది సాధ్యమైంది.
ఇటీవలే భారతదేశానికి చెందిన 657 కళాఖండాలను అమెరికాకు చెందిన లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థలు అక్కడ ఉన్న భారతీయ ఎంబసీకి అప్పగించాయి. వాటిని తరలించేందుకు, ధృవీకరించేందుకు ఏఎస్ఐ నిపుణులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్, జాతీయ వస్తు ప్రదర్శనశాలకు, భారత పురావస్తు సర్వే విభాగం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ సహకారం, నైతిక బాధ్యత, సంస్థాగత చిత్తశుద్ధి ద్వారా చోరీకి గురయిన సాంస్కృతిక వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో, పరిరక్షించడంలో భారత్ సంకల్పాన్ని ఈ కార్యక్రమం పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2260930)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12