నౌకారవాణా మంత్రిత్వ శాఖ
తూత్తుకుడిలో భారత మొట్టమొదటి మెగా గ్రీన్ ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు కోసం చారిత్రాత్మక అవగాహన ఒప్పందం
మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 లక్ష్యానికి ఊతమిస్తూ 2.5 మిలియన్ జీటీ సామర్థ్యం గల నౌకానిర్మాణ కేంద్రం ఏర్పాటుకు త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసిన హెచ్‌డి కెఎస్ఓఈ, ఎన్‌షిప్-టిఎన్, ఎస్ఎమ్ఎఫ్‌సిఎల్ సంస్థలు
నాడు పోస్టు చేయడమైనది:
13 MAY 2026 4:57PM by PIB Hyderabad
భారత నౌకాయాన రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా, తమిళనాడులోని తూత్తుకుడిలో దేశ మొట్టమొదటి మెగా గ్రీన్ ఫీల్డ్ షిప్‌యార్డ్ అభివృద్ధి కోసం 2026 ఏప్రిల్ 20న త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. నౌకానిర్మాణ రంగంలో ప్రపంచ దిగ్గజం హెచ్‌డి కొరియా షిప్‌బిల్డింగ్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ (హెచ్‌డి కెఎస్ఓఈ), భారత ప్రభుత్వ నౌకాశ్రయం వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ (వీఓసీపీఏ), తమిళనాడు ప్రభుత్వ సంస్థ సిప్‌కాట్ (ఎస్ఐపీసీఓటీ) కలిసి ఏర్పాటు చేసిన ఎన్‌షిప్-టిఎన్ (ఎన్‌షిప్-టిఎన్), కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్ ఎంఎఫ్సీఎల్) ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ భారత పర్యటనలో భాగంగా, 2026 ఏప్రిల్ 20న కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జల రవాణా శాఖ మంత్రి సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ మధ్య జరిగిన సమావేశం అనంతరం ప్రారంభించిన భారత్ - కొరియా సమగ్ర భాగస్వామ్య వ్యవస్థ- సామర్థ్యం, విస్తృతితో కూడిన నౌకానిర్మాణ కేంద్ర ఆధారిత వృద్ధి నిర్వహణ ఉమ్మడి దార్శనికత (వాయేజెస్) కింద ఈ ఒప్పందం కుదిరింది. నౌకానిర్మాణం, నౌకాయానం, సముద్ర రవాణా రంగాల్లో భాగస్వామ్యం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటైంది.
భారత-కొరియా నౌకాయాన సహకార వ్యవస్థ తొలి అమలు ఫలితాలలో తూత్తుకుడి గ్రీన్ ఫీల్డ్ షిప్‌యార్డ్ ఒకటిగా నిలుస్తుంది. నౌకాయాన రంగంలో రెండు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇది సూచిస్తుంది.
తూత్తుకుడిలో ఏటా 2.5 మిలియన్ గ్రాస్ టన్నేజ్ (జీటీ) సామర్థ్యం గల అంతర్జాతీయ స్థాయి మెగా షిప్‌యార్డ్ ఉమ్మడి అభివృద్ధి, ఆర్థిక సహకారం, నిర్మాణం, నిర్వహణకు ఈ ఒప్పందం పునాది వేస్తుంది. ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు స్థిరపడిన తర్వాత సుమారు 15,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. దీనితో పాటు తమిళనాడు, చుట్టుపక్కల ప్రాంతాలలో గణనీయమైన పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.
ప్రతిపాదిత షిప్‌యార్డ్ ఎన్‌షిప్-టిఎన్ అభివృద్ధి చేస్తున్న తూత్తుకుడి నౌకానిర్మాణ సముదాయానికి ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. తూత్తుకుడిలో ప్రతిపాదించిన ఈ గ్రీన్ ఫీల్డ్ నౌకానిర్మాణ కేంద్ర సముదాయానికి భారత ప్రభుత్వ నేషనల్ షిప్‌బిల్డింగ్ మిషన్ నుంచి సూత్రప్రాయ ఆమోదం కూడా లభించింది.
2047 నాటికి ఏటా 4.5 మిలియన్ గ్రాస్ టన్నేజ్ నౌకానిర్మాణ ఉత్పత్తిని సాధించడం ద్వారా ప్రపంచంలోని మొదటి ఐదు నౌకానిర్మాణ దేశాలలో ఒకటిగా నిలవడం భారత సముద్రయాన అమృత్ కాల్ విజన్ 2047 లక్ష్యం. తూత్తుకుడిలో ప్రతిపాదించిన ఈ కేంద్రం ఏటా 2.5 మిలియన్ గ్రాస్ టన్నేజ్ సామర్థ్యంతో భారత వాణిజ్య నౌకానిర్మాణ రంగాన్ని సమూలంగా మారుస్తుందని, దేశ ప్రస్తుత నౌకానిర్మాణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు.
నౌకానిర్మాణ సామర్థ్యం పెంచడమే కాకుండా, అనుబంధ విడిభాగాల తయారీ కేంద్రాల ద్వారా సమగ్ర నౌకాయాన పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఊతమిస్తుంది. సముద్రయాన పరికరాలు, ఇంజనీరింగ్ సరఫరా వ్యవస్థల స్వదేశీకరణ, కార్మికులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, అత్యాధునిక తయారీ పద్ధతులు, డిజిటల్ నౌకానిర్మాణం, పర్యావరణ హిత నౌకాయాన సాంకేతికతలను అందిపుచ్చుకోవడం వంటి అంశాలకు ఇది మార్గం సుగమం చేస్తుంది. ఈ భాగస్వామ్యం వల్ల కొరియాలోని హెచ్‌డి కెఎస్ఓఈ కేంద్రాలలో భారతీయ నౌకానిర్మాణ నిపుణులకు, కార్మికులకు శిక్షణ పొందే అవకాశం కూడా లభిస్తుంది.
భారతదేశాన్ని అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన నౌకానిర్మాణ కేంద్రంగా మార్చేందుకు భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో నాలుగు సూత్రాల విధానంతో కూడిన సుమారు ₹70,000 కోట్ల సమగ్ర ప్యాకేజీని ప్రకటించింది. ఈ విధాన ప్యాకేజీ ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ నౌకానిర్మాణ కేంద్రాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి, ఆర్డర్లు పెరుగుతున్నాయి. ఇది దేశ నౌకానిర్మాణ సామర్థ్యాలు, పర్యావరణహిత సాంకేతికత సన్నద్ధత పట్ల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) కు ఆరు 1,700 టీఈయూ నౌకల కోసం సిఎమ్ఎ సిజిఎమ్ ఆర్డర్లు ఇచ్చింది. నార్వే లోని స్వాన్ ఎనర్జీకి చెందిన పిపావావ్ షిప్‌యార్డ్ నుంచి ఆరు కెమికల్ ట్యాంకర్ల కోసం, బ్రిటన్ నుంచి అమ్మోనియాతో నడిచే నాలుగు కంసార్‌మాక్స్ బల్క్ క్యారియర్ల కోసం అంతర్జాతీయ ఆర్డర్లను పొందింది.
ఈ సందర్భంగా కేంద్ర ఓడరేవులు, నౌకాయాన మంత్రి శర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, “ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రపంచ నౌకాయాన శక్తిగా ఎదిగే భారత్ ప్రయాణంలో ఈ చారిత్రాత్మక ఒప్పందం ఒక కీలక ఘట్టం. ‘వాయేజెస్’ వ్యవస్థ పరిధిలోని ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను, విస్తృతిని, ఆవిష్కరణలను, పర్యావరణ హిత నౌకానిర్మాణ సామర్థ్యాలను భారతదేశానికి తీసుకువస్తుంది. ఇది భారత వాణిజ్య నౌకానిర్మాణ సామర్థ్యాన్ని మార్చడమే కాకుండా, వేలాది మందికి నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను కల్పిస్తుంది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. అంతర్జాతీయ పోటీతత్వంతో మన నౌకాయాన వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 లక్ష్యం దిశగా భారతదేశం అడుగులు వేస్తున్న తరుణంలో, తూత్తుకుడి ప్రపంచానికి ఒక వ్యూహాత్మక నౌకాయాన, పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతుంది” అని అన్నారు.
ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం భారతదేశాన్ని ప్రపంచస్థాయిలో పోటీతత్వం కలిగిన నౌకాయాన తయారీ దేశంగా నిలబెట్టడంలో ఒక ప్రధాన అడుగు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు, అత్యాధునిక సాంకేతికతలు, సుస్థిర వృద్ధి ద్వారా భారీ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాలను నిర్మించాలనే ప్రభుత్వ నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2260880)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6