కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఏపీటీ 2.0ను సమీక్షించిన కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్
పాతకాలపు విధానాల స్థానంలో లాజిస్టిక్స్ కేంద్రంగా... భారత తపాలా శాఖ ఏపీటీ 2.0 ద్వారా కచ్చితమైన, ఏఐ ఆధారిత నిర్వహణ
కార్పొరేట్ తరహా సామర్థ్యం దిశగా భారత తపాలా శాఖను నడిపిస్తున్న ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 2:07PM by PIB Hyderabad
భారత తపాలా శాఖకు చెందిన తదుపరి తరం డిజిటల్ వేదిక ఏపీటీ 2.0పై కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు సమగ్ర సమీక్ష నిర్వహించారు. భారత తపాలా శాఖను ఒక ఆధునిక లాజిస్టిక్స్, సేవల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఏపీటీ 2.0 పాత్రను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ, శాఖ కార్యాలయాలకు తక్షణ సమాచారాన్ని అందుబాటులోకి తెస్తూ ఏపీటీ 2.0 వేదిక వాటిని శక్తిమంతంగా తీర్చిదిద్దుతోందన్నారు. ఇది క్షేత్రస్థాయిలో స్థానిక అవసరాలను విశ్లేషించడానికి, పనితీరును పర్యవేక్షించడానికి, డేటా ఆధారిత నిర్ణయాలను వేగంగా తీసుకోవడానికి దోహదపడుతుందని వివరించారు. అలాగే కృత్రిమ మేధ అనుసంధానం ద్వారా తపాలా శాఖలోని భారీ స్థాయి నిర్వహణ సమాచారాన్ని విశ్లేషించడం, ఫలితాలను అంచనా వేయడం, సాధారణ విధులను ఆటోమేట్ చేయడం సాధ్యమవుతుంది. ఇది మొత్తం పోస్టల్ వ్యవస్థలో సేవల నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు.
ఈ సరికొత్త సాంకేతిక సామర్థ్యాలు భారత తపాలా శాఖకు స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తున్నాయని డాక్టర్ పెమ్మసాని పేర్కొన్నారు. వేగవంతమైన సేవలు, మానవ ప్రమేయం తగ్గడం, మెరుగ్గా నిర్ణయాలు తీసుకోవడం, వినియోగదారుల్లో సంతృప్తి వంటి సానుకూల మార్పులు దీని ద్వారా సాధ్యమవుతున్నాయని వివరించారు. వీటితోపాటు కార్యకలాపాలు మరింత విశ్వసనీయంగా, సమర్థంగా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ వేదిక ద్వారా కలిగే బలమైన వాణిజ్య ప్రయోజనాలను మంత్రి వివరించారు. ముఖ్యంగా ఇప్పటికీ సరైన సేవలు అందని గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులను గుర్తించి, వారికి సేవలందించేందుకు ఇదెంతో దోహదపడుతుందన్నారు. శాఖా కార్యాలయాల స్థాయిలో సేవల వినియోగాన్ని పెంచడానికి, డేటా ఆధారంగా ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడానికి ఇది తోడ్పడుతుందన్నారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని క్రియాశీల మేధగా మార్చడం ద్వారా.. ప్రస్తుత లాజిస్టిక్స్ రంగంలో భారత తపాలా శాఖ పోటీతత్వాన్ని ఏపీటీ 2.0 మరింత బలోపేతం చేస్తోందని ఆయన వెల్లడించారు.
డిజిటల్ సాధికార, సేవే ప్రాతిపదికగా నడిచే సంస్థగా ఉండాలన్న లక్ష్యానికి అనుగుణంగా లాజిస్టిక్స్ రంగంలో దేశానికి వెన్నెముకగా భారత తపాలా శాఖ నిలవడంలో ఈ మార్పు ప్రధాన కేంద్రంగా ఉంటుందని సహాయమంత్రి అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి ఈ పథకం అమలును భారత ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ ప్రత్యక్ష పాలన విధానానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. దీనివల్ల సంస్థ పని సంస్కృతిలో స్పష్టమైన వస్తోందన్నారు. పాతకాలం నుంచి కొనసాగుతున్న వ్యవస్థ స్థానంలో వేగంగా స్పందించే, కార్పొరేట్ తరహా, సాంకేతికత ఆధారంగా నడిచే సంస్థగా భారత తపాలా శాఖ రూపుదిద్దుకుంటోందని ఆయన వెల్లడించారు.
సమాచార సమగ్రతను కాపాడటమే కాకుండా, సైబర్ భద్రతను పటిష్టం చేసే ఒక బలమైన, సురక్షితమైన నిర్మాణాన్ని ప్రభుత్వ డిజిటల్ విధానం ఏర్పరుస్తోందని డాక్టర్ పెమ్మసాని వ్యాఖ్యానించారు. ఇది నమ్మకమైన, పటిష్టమైన, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండే డిజిటల్ ప్రజా సేవలను అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. విస్తరిస్తున్న భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై విశ్వాసాన్ని ఇది మరింతగా పెంచుతుందని, ఇక్కడ సేవల విస్తృతికి భద్రత, నమ్మకం కూడా తోడవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా నేతృత్వంలో వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా భారత తపాలా శాఖ స్థిరంగా పరివర్తనను కొనసాగిస్తోంది. సాంకేతికతను వినియోగించడం ద్వారా దేశవ్యాప్త అనుసంధానాన్ని బలోపేతం చేయడమే కాకుండా క్షేత్రస్థాయి వరకు సమర్థంగా సేవలందిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2260259)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22