హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సొలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతా పుస్తకాలు ‘ద బెంచ్, ద బార్ అండ్ ద బిజార్’, ‘ద లాఫుల్ అండ్ ద ఆఫుల్’‌లను


న్యూఢిల్లీలో ఆవిష్కరించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

‘నేను రోజూ మా అమ్మ కాళ్లకు మొక్కేవాడిని... ఆమె కాలం చేశాక, ఆమె ఫోటో ఎదుట నిత్యం దీపాన్ని వెలిగిస్తున్నాను... మన దేశంలో అనుదినమూ మాత‌ృమూర్తులకు అంకితమైందే’

‘శ్రీ తుషార్ మెహతా తన పుస్తకాల్లో న్యాయస్థాన జీవితంలో హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ, మానవ స్వభావాన్నీ అందంగా చిత్రించారు’

‘మన దేశ ప్రజాస్వామ్య మూలాలు చాలా లోతైనవి... వాటిని బలోపేతం చేయడంలో రాజ్యాంగంతో పాటు న్యాయవ్యవస్థ చాలా గొప్ప తోడ్పాటును అందించాయి’

‘చట్టసభలు, న్యాయవ్యవస్థ, కార్యనిర్వహణ యంత్రాంగాల మధ్య చక్కని సమతౌల్యంతో పాటు పరస్పర గౌరవం నెలకొనడం మన ప్రజాస్వామ్యానికి నిజమైన శోభను చేకూరుస్తోంది’

‘బలమైన న్యాయ వ్యవస్థే సామాన్య పౌరుల నమ్మకానికి, సమాజ పనితీరుకు, దేశ స్వభావానికి మూలాధారం... ఈ విశ్వాసాన్ని పరిరక్షించడంలో మనం ఒక సమాజంగా విజయవంతమయ్యాం’

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2026 8:12PM by PIB Hyderabad

సొలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతా పుస్తకాలు ‘ద బెంచ్, ద బార్ అండ్ ద బిజార్’  ‘ద లాఫుల్ అండ్ ద ఆఫుల్’‌లను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ శ్రీ సూర్య కాంత్ సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మన దేశ రాజ్యాంగ 76 సంవత్సరాల ప్రస్థానంలో మనం మన ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లను బాగా లోతుకు చొచ్చుకుపోయి బలపడేటట్లు చేసుకున్నామన్నారు.  మన బహుళ పార్టీ ప్రజాస్వామ్య చట్టసభల వ్యవస్థను మనం ఖాయంగా పటిష్ఠపరుచుకున్నామని, 1947 మొదలు ఈ రోజు వరకూ చూస్తే ఈ దేశంలో చట్టసభల ద్వారా జరిగిన మార్పులన్నీ ఆమోదం పొందాయని ఆయన అన్నారు. ఇది... మన ప్రజాస్వామ్యం వేళ్లు ఎంతో లోతుకు వ్యాప్తి చెందాయని, ఈ ప్రక్రియ.. మన రాజ్యాంగం, దేశ ప్రజానీకంతో పాటు మన న్యాయ వ్యవస్థ వాటివంతుగా చాలా పెద్ద పాత్రను పోషించాయని చాటుతోందన్నారు.
తమకు ఏమైనా అన్యాయం జరిగిందంటే అప్పుడు రాజ్యాంగం మెలకువతో వ్యవహరించి ఆదుకొంటుందని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని శ్రీ అమిత్ షా అన్నారు.  వారి హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానం తలుపులు తెరచి ఉంటాయని, ఎక్కడైనా బడుగు వర్గాల వారి గొంతుకల్ని నొక్కేయడం గానీ, బలహీనుల ఆలోచనల్ని అణచేసే ప్రయత్నాలు గానీ జరిగాయంటే అప్పుడు న్యాయస్థానాలు ఆ గళాలను తప్పక వింటాయని మంత్రి అన్నారు.  ఈ మూడు మౌలిక విషయాలపై ఆధారపడి మన ప్రజాస్వామ్యం బలోపేతం అయిందని, స్థూలంగా చెప్పాలంటే.. న్యాయం జరుగుతుందన్న సామాన్యుడి ఆశే సమాజానికి సమతుల్యాన్ని, దేశ స్వభావానికి ముఖ్య ప్రమాణంగా నిలుస్తుందనవచ్చన్నారు. ఈ వ్యవస్థలో ఇప్పటికీ ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దవలసిన బాధ్యత మన అందరికీ ఉందని, ఆ లోటుపాట్లను న్యాయవ్యవస్థతో పాటు కార్యనిర్వహణ యంత్రాంగం.. ఈ రెండూ కలిసికట్టుగా సవరించి తీరాలని ఆయన చెప్పారు. ఇది జరగాలంటే నిర్దిష్ట కాలబద్ధ మార్గసూచీతో ముందుకు కదలాల్సివుంటుందన్నారు.
వేర్వేరు సంస్థలను.. అవి ఒకదానితో మరొకటి విభేదించడానికి కాకుండా ఒకదానితో మరొకటి పరస్పరం సమతౌల్యంతో మెలిగేటందుకే రాజ్యాంగం ఏర్పాటు చేసిందని,  ఇదే మన రాజ్యాంగ సౌందర్యమని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ భావనను మనం సరైన అర్థంలో అవగాహన చేసుకోవాల్సివుందని ఆయన చెప్పారు. నిర్ణయాలను కార్యనిర్వహణ యంత్రాంగం తీసుకుంటుందని, ఆ నిర్ణయాలపై రాజ్యాంగపరంగా సమీక్షించే బాధ్యతను న్యాయ వ్యవస్థ నిర్వర్తిస్తుందని మంత్రి వివరించారు.
చర్చ, ఔచిత్యం, సమతౌల్యం.. ఈ మూడింటినీ పరిరక్షించడానికి చాలా చక్కనైన పద్ధతిలో ఒక ఉత్సాహంతో మన రాజ్యాంగ శిల్పులు రాజ్యాంగాన్ని రూపొందించారని కూడా మంత్రి చెప్పారు. ఈ సంప్రదాయాల్ని పాటిస్తూ 76 సంవత్సరాల్లో బహుశా మరో దేశం ఏదైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగిందో, లేదోనని ఆయన అన్నారు. మన దేశంలో, అన్ని సంప్రదాయాలనూ తూచా తప్పక పాటించడానికి తోడు వాటిని మరింతగా బలపరచడం మనకు అందరికీ ఎంతో సంతోషదాయకమని మంత్రి అన్నారు.  
ప్రజాస్వామ్యానికి బలం.. ఎదురొడ్డే ధోరణి నుంచి కాకుండా సంస్థాగత సమతౌల్యంతోనూ, రాజ్యాంగ ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరస్పరం గౌరవించుకోవడంతోనూ సమకూరుతుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. పరస్పర ఆదరణ విషయానికి వస్తే, ఈ భావనను స్వయంగా రాజ్యాంగమే గుర్తించి అనేక సందర్భాల్లో దీనిని పరిరక్షించిందని ఆయన అన్నారు. కార్యనిర్వహణ యంత్రాంగానికి, న్యాయ వ్యవస్థకు మధ్య చక్కని సంతులిత సంబంధాన్ని ఇప్పటి కన్న మరింతగా బలోపేతం చేయడానికి మనమంతా కలిసి తప్పక పనిచేద్దామని కూడా ఆయన అన్నారు.
శ్రీ తుషార్ మెహతా రాసిన ‘ద బెంచ్, ద బార్ అండ్ ద బిజార్’, ‘ద లాఫుల్ అండ్ ద ఆఫుల్’‌ పుస్తకాల్లో పక్షపాత రహిత విశ్లేషణను మన ముందుకు తీసుకు వచ్చినందువల్ల మనం మన  విషయంలో, మన సంస్థల విషయంలో, అలాగే మొత్తం మీదా కూడా అంతరావలోకనం చేసుకునేందుకు, పునర్మూల్యాంకనం చేసుకునేందుకు పెద్ద సదావకాశం లభించినట్లయిందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా చెప్పారు. న్యాయస్థానాల్లో ఒక్కొక్క సారి కవిత్వం ఎలా ప్రతిధ్వనిస్తుందో, అలాగే అనేక మంది న్యాయమూర్తులు విశిష్ట శైలులతో పాటు తమదైన వైఖరులను ఎలా చాటుతుంటారో ఈ పుస్తకం చెబుతోందని మంత్రి తెలిపారు. ఒక దేశంలో కవలలైన సోదరీమణులు న్యాయవాదిగా, న్యాయమూర్తిగా మారి ఒకరి పాత్రను మరొకరు పోషించిన వైనాన్నీ, అలాగే మరో ఉపాఖ్యానంలో ఒక జడ్జి వేటాడుతూ ఆడుతూ... తీర్పును వెలువరించిన తీరునూ ఈ పుస్తకం మన  దృష్టికి తీసుకువస్తుందన్నారు. ఈ ఉదంతాలన్నీ మనకు ఆలోచన చేయక తప్పని స్థితిని కల్పించేవేనని, అంతేకాకుండా కోర్టుల్లో నెలకొనే గంభీర వాతావరణం నుంచి మనను బయటకు తీసుకువచ్చి ఉపశమనాన్ని కలిగిస్తాయని ఆయన అన్నారు. శ్రీ తుషార్ మెహతా పుస్తకాలు ఒక ఆసక్తిపరుడైన వ్యక్తి మనసును ప్రతిబింబిస్తాయన్నారు. కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికతలు న్యాయ వ్యవస్థకు భవిష్యత్తులో ఎదురు కాబోయే సవాళ్లకు సంబంధించిన నిర్దిష్ట ఉదాహరణలను వెల్లడిస్తాయన్నారు. ఈ హెచ్చరికలను మనం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.
శ్రీ తుషార్ మెహతా తన పుస్తకాల్లో చట్టం తాలూకు గంభీరత్వంతో పాటు చట్ట గౌరవాన్ని పరిరక్షిస్తూనే కోర్టు కార్యకలాపాల్లో ఇమిడివున్న జీవన వాస్తవాల్ని, హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, మానవ స్వభావాన్ని ఎంతో సుందరంగా, సూక్ష్మ దృష్టితో కళ్లకు కట్టారని శ్రీ అమిత్ షా అన్నారు. శ్రీ మెహతా తన పుస్తకాలను మాతృమూర్తికి అంకితమిచ్చారని, ఈ రోజు ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమం చోటుచేసుకోవడం ఈ కార్యక్రమానికి మరింత విశిష్టతను సంతరించిందని అన్నారు. ‘‘రోజూ నేను తల్లి పాదాలకు మొక్కే వాడిని, ఆమె కాలం చేశాక.. ఆమె ఫోటో దగ్గర నిత్యం జ్యోతిని వెలిగిస్తున్నాను.. మన దేశంలో ప్రతి రోజూ తల్లులకు అంకితమైందే’’ అని శ్రీ షా అన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2259827) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati