ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సమ్మిళిత పాలన కోసం డేటా ఆధారిత ఆవిష్కరణలను ప్రదర్శించిన యూఐడీఏఐ డేటా హాకథాన్-2026
పరిష్కారాలను సమర్పించిన 5,000కు పైగా బృందాలు
డీపీఐ వ్యవస్థలోనే అతిపెద్ద డేటా ఆవిష్కరణ పోటీల్లో ఒకటిగా నిలిచిన హాకథాన్
నాడు పోస్టు చేయడమైనది:
08 MAY 2026 7:06PM by PIB Hyderabad
పరిపాలన, ప్రజా సేవల పంపిణీని మెరుగుపరచడం లక్ష్యంగా విద్యార్థులు రూపొందించిన డిజిటల్ గుర్తింపు రంగంలోని విశిష్ట ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ... 'యూఐడీఏఐ డేటా హాకథాన్-2026'ను విజయవంతంగా ముగించింది.
డిజిటల్ గుర్తింపు డేటాను వినూత్నంగా, బాధ్యతాయుతంగా వినియోగించుటను ప్రోత్సహించడం కోసం ప్రారంభించిన ఈ హాకథాన్... సమ్మిళితత్వం, సామర్థ్యం, పాలనా ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో విస్తరించదగిన, డేటా ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి విద్యార్థులకు, యువ నిపుణులకు ఒక చక్కటి వేదికను అందించింది.
ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన లభించింది. దాదాపు 15,000 బృందాలు దీని కోసం నమోదు చేసుకోగా... 5,000కు పైగా బృందాలు తమ పరిష్కారాలను సమర్పించాయి. దీంతో ఇది డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థలోనే అతిపెద్ద డేటా ఆవిష్కరణల పోటీల్లో ఒకటిగా నిలిచింది.
5,000కు పైగా సమర్పణల పరిశీలన, 30 ప్రాజెక్టుల ఎంపిక, 15 తుది జట్ల సమగ్ర మూల్యాంకనంతో కూడిన ఒక కఠినమైన, బహుళ-దశల మూల్యాంకన ప్రక్రియ ద్వారా మొదటి ఐదు స్థానాలకు ఎంపికైన బృందాలు తుది పోరులో తమ పరిష్కారాలను ప్రదర్శించాయి.
కోల్‌కతాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లకు చెందిన విజేతల బృందం... యూఐడీఏఐ పంచుకున్న సమీకృత ఆధార్ నమోదు, నవీకరణ డేటాసెట్‌లపై వివరణాత్మక విశ్లేషణను సమర్పించింది.
వారి నైపుణ్యం... వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలు, జనాభా సమూహాల్లో నమోదు ధోరణులను, బయోమెట్రిక్ నవీకరణల సరళిపై విలువైన అభిప్రాయాలను అందించడం సహా, సేవల పంపిణీని మెరుగుపరిచేందుకు పలు సిఫార్సులనూ అందించింది.
యూఐడీఏఐ సీఈవో శ్రీ వివేక్ చంద్ర వర్మ మాట్లాడుతూ... విశ్లేషణాత్మక కచ్చితత్వాన్ని బలమైన ప్రజా ప్రయోజన దృక్పథంతో మేళవించిన ఆయా బృందాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటువంటి ఆవిష్కరణలు... విధానాలను, కార్యాచరణలను మెరుగుపరిచేందుకు ఊతమిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పాలనలో సమ్మిళితత్వాన్ని, సామర్థ్యాన్నీ పెంపొందించడం కోసం బాధ్యతాయుతంగా, నైతిక విలువలకు కట్టుబడి డేటాను ఉపయోగించాల్సిన ప్రాముఖ్యతనూ ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
డిజిటల్ గుర్తింపు, ప్రజల డేటా వినియోగ రంగాల్లో ఆవిష్కరణలను పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ యూఐడీఏఐ డేటా హాకథాన్ భవిష్యత్తులో ప్రతియేటా నిర్వహించే అధికారిక కార్యక్రమంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి యూఐడీఏఐ భవిష్యత్ ప్రణాళికలను శ్రీ వివేక్ చంద్ర వర్మ వివరించారు.
భవిష్యత్తులో ఈ హాకథాన్ కేవలం విద్యార్థులకే పరిమితం కాకుండా విద్యావేత్తలు, పరిశోధకులు, అంకురసంస్థలు, ఇతర భాగస్వాములతో మరింత వైవిధ్యమైన... వివిధ రంగాల పరిజ్ఞానం, పద్ధతుల సమ్మిళితం ద్వారా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగల ఆవిష్కరణల వ్యవస్థను పెంపొందించేలా భాగస్వామ్యాన్ని విస్తరిస్తుందని భావిస్తున్నారు.
నిరంతరం ఆవిష్కరణలు, యువత భాగస్వామ్యం, ఆధారాల ఆధారిత విధానాల రూపకల్పనను అభివృద్ధి చేయడం, అమలు చేయడం, విస్తరించడం పట్ల యూఐడీఏఐ నిబద్ధతను ఈ యూఐడీఏఐ డేటా హాకథాన్-2026 ప్రతిబింబిస్తుంది. ఈ హాకథాన్‌లో పాల్గొనేవారికి వాస్తవిక ప్రపంచ డేటాసెట్‌లతో పనిచేసే అవకాశాన్ని కల్పించడం ద్వారా... ఈ కార్యక్రమం వారి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు, ప్రజా ప్రయోజనాల ఆధారితమైన పరిష్కారాలనూ ప్రోత్సహించింది.
ఈ హాకథాన్ విజయానికి సహకరించిన అభ్యర్థులు, జ్యూరీ సభ్యులు, భాగస్వాములకు యూఐడీఏఐ ధన్యవాదాలు తెలిపింది.
(రిలీజ్ ఐడి: 2259246)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8