సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
బ్రిక్స్: ఎమ్ఎస్ఎమ్ఈలకు మరింత సహకారం అంటున్న భారత్
నాడు పోస్టు చేయడమైనది:
08 MAY 2026 1:07PM by PIB Hyderabad
ఈ సంవత్సరంలో (2026) బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతను నిర్వర్తిస్తున్న భారత్ ‘‘నూతన పారిశ్రామిక విప్లవం అంశంపై బ్రిక్స్ భాగస్వామ్యం’’ (పార్ట్‌ఎన్ఐఆర్)లో భాగంగా సూక్ష్మ, లఘు, మధ్యతరహా సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఈ) సహకారానికి సంబంధించి ఒక కొత్త అజెండాను ముందుకు తీసుకుపోతోంది. భారత్ అధ్యక్ష పదవీకాలంలో ఎమ్ఎస్ఎమ్ఈ వర్కింగ్ గ్రూపునకు సంబంధించిన మూడు సమావేశాలతో పాటు మొదటి బ్రిక్స్ ఎమ్ఎస్ఎమ్ఈ ఫోరమ్‌ను కూడా నిర్వహించే బాధ్యతను సూక్ష్మ, లఘు, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖకు అప్పగించారు.
ఎస్ఎమ్ఈ వర్కింగ్ గ్రూపు తొలి సమావేశాన్ని (వెబినార్) 2026 ఏప్రిల్ 24న విజయవంతంగా నిర్వహించారు. దీనిలో ‘‘ఎమ్ఎస్ఎమ్ఈల కోసం ఆర్థిక సహాయ లభ్యత’’ అంశంపై దృష్టిని కేంద్రీకరించారు. బ్రిక్స్ సభ్యదేశాల మధ్య జరిగిన చర్చల్లో ‘‘ఆర్థిక సమ్మిళితత్వం, అక్షరాస్యత, రుణ సన్నద్ధతల ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో అంతరాన్ని పూరించడం’’తో పాటు ‘‘ఫిన్‌టెక్-ఆధారిత అనుబంధ విస్తారిత వ్యవస్థలు: ఎస్ఎమ్ఈ రుణ పరిధి విస్తరణ, నిరంతరాయంగా ప్రపంచ వాణిజ్య చెల్లింపుల ప్రక్రియ’’పై చర్చించారు.
ఈ వెబినార్లో బ్రిక్స్ సభ్యదేశాలు చురుకుగా పాలుపంచుకున్నాయి. ఎమ్ఎస్ఎమ్ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సవాళ్లు, అవకాశాలపై అనుభవ సహిత, అత్యుత్తమ పద్ధతుల్ని పంచుకోవడానికి ఈ వెబినార్ ఒక కీలక వేదికగా నిలిచింది. ఆర్థికాభివృద్ధి, ఉపాధికల్పన, నూతన ఆవిష్కరణ, అభివృద్ధి ఫలాలను అందరికీ అందుబాటులోకి తీసుకుపోవడం.. వీటికి కీలక చోదక శక్తిగా ఎమ్ఎస్ఎమ్ఈలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయని చర్చల్లో స్పష్టం చేశారు. చాలినంత రుణాలను సకాలంలో అందుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్న సంగతిని ప్రస్తావించారు. రుణ మంజూరులో అంతరాలను తొలగించడానికీ, ఆర్థిక సమ్మిళితత్వం, మెరుగైన ఆర్థిక అవగాహనల ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈల రుణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికీ బహుళపార్శ్వాలతో కూడిన దార్శనికత అవసరమని సూచించారు.
సంస్థాగత సామర్థ్యాలను పటిష్ఠపరుచుకోవాలనీ, నూతన ఆర్థిక సహాయ పద్దతుల్ని ప్రోత్సహించాలనీ, ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి సంబంధించి ఒక అనుకూల వాతావరణాన్ని ఏర్పరచడానికి బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందనీ సమావేశంలో స్పష్టం చేశారు. అభివృద్దిపరంగా ఒకే విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్న బ్రిక్స్ సభ్యదేశాల మధ్య విధాన మార్పిళ్లకు మార్గాన్ని ఈ చర్చలు సుగమం చేశాయి. బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని సుదృఢ, సమ్మిళిత, ప్రపంచ దేశాలతో పోటీ పడే ఎమ్ఎస్ఎమ్ఈ రంగాలకు ప్రోత్సాహాన్ని అందించాలన్న ఉమ్మడి నిబద్ధతను కూడా ఈ చర్చల్లో పునరుద్ఘాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2259055)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13