అంతరిక్ష విభాగం
అంతరిక్షం, కృత్రిమ మేధ, అత్యాధునిక సాంకేతికతల్లో భారత్ - ఫ్రాన్స్ భాగస్వామ్య విస్తరణపై ఫ్రాన్స్ మంత్రితో డాక్టర్ జితేంద్ర సింగ్ ద్వైపాక్షిక సమావేశం
భారత్ - ఫ్రాన్స్ మధ్య వైజ్ఞానిక, అంతరిక్ష సంబంధాల్లో నవోత్తేజం.. పురోగతి, భవిష్యత్ ప్రణాళికపై మంత్రుల సమీక్ష
2026 ఇండో - ఫ్రెంచ్ ఆవిష్కరణల సంవత్సరంలో ద్వైపాక్షిక సహకారంలో మరింత పురోగతి: డాక్టర్ జితేంద్ర సింగ్
ఏఐ, అనువర్తిత గణితశాస్త్రం, అధునాతన పదార్థ సహకారంలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్న భారత్, ఫ్రాన్స్: డాక్టర్ జితేంద్ర సింగ్
మానవ సహిత అంతరిక్ష యానంలో భారత్‌తో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ ప్రతిపాదన
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 4:06PM by PIB Hyderabad
ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన - అంతరిక్ష శాఖల మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్‌తో భారత శాస్త్ర, సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో- అణు ఇంధన - అంతరిక్ష విభాగం - సిబ్బంది, ప్రజా వ్యవహారాలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించి.. విజ్ఞాన శాస్త్ర - సాంకేతిక, అంతరిక్ష రంగాల్లో విస్తరిస్తున్న భారత్ - ఫ్రాన్స్ సహకారాన్ని సమీక్షించారు.
భారత్ - ఫ్రాన్స్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్య విస్తృతిని ఈ చర్చలు ప్రతిబింబించాయి. ముఖ్యంగా ఉన్నత సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం నిరంతరాయంగా, వేగంగా కొనసాగుతుండడం పట్ల ఇరుపక్షాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి.
వైజ్ఞానిక, అంతరిక్ష రంగాల్లో భారత్ - ఫ్రాన్స్ భాగస్వామ్యం ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఒక బలమైన మూలాధారంగా నిలిచిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సాంకేతిక పురోగతికి, ప్రజా సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతోందన్నారు. 2026ను ‘భారత-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం’గా ప్రకటించడం సరికొత్త రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకునే అద్భుత అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవలి పరిణామాలను ప్రస్తావిస్తూ.. భారత శాస్త్ర సాంకేతిక విభాగం, ఫ్రాన్స్‌లోని ప్రముఖ సంస్థల మధ్య సంస్థాగత భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంపై కేంద్ర మంత్రి మాట్లాడారు. ముఖ్యంగా అధునాతన పదార్థాలు, డిజిటల్ సైన్సుల వంటి రంగాల్లో చేపట్టిన కొత్త కార్యక్రమాలను వివరించారు. అలాగే ఈ ఏడాది ప్రారంభించిన అనువర్తిత గణితం, కృత్రిమ మేధపై ఉమ్మడి కార్యాచరణ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
అంతరిక్ష సహకారంపై మాట్లాడుతూ.. ఇస్రో, సీఎన్ఈఎస్ మధ్య ఉన్న సుదీర్ఘ సహకారాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. గతంలో చేపట్టిన మేఘా-ట్రోపిక్స్, సరళ్ వంటి ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాలను, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న తృష్ణ ప్రాజెక్టును ఆయన ప్రస్తావించారు. వీటితోపాటు ఫ్రాన్స్‌లో నావిక్ గ్రౌండ్ స్టేషన్ అభివృద్ధిలో సహకారాన్ని, భారత మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు ఫ్రాన్స్ అందిస్తున్న చేయూతను ఆయన వివరించారు.
ఇటీవలి సంస్కరణలతో భారత అంతరిక్ష రంగం శరవేగంగా విస్తరిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దాదాపు 400 అంతరిక్ష అంకుర సంస్థలతో కూడిన పటిష్టమైన వ్యవస్థ దేశంలో ఉందని, మున్ముందు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సానుకూల పరిణామాలు భారత్ - ఫ్రాన్స్ మధ్య పరిశ్రమల స్థాయిలో మరింత విస్తృత భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలను కల్పిస్తాయన్నారు.
అంతరిక్ష, పరిశోధన రంగాల్లో భారత్ ఒక అత్యంత కీలకమైన, విశ్వసనీయమైన భాగస్వామి అని ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్ అన్నారు. గతంలో ఇస్రోతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఇరు దేశాల మధ్య పటిష్టమైన సహకార వారసత్వాన్ని ఆయన వివరించారు. భూ పర్యవేక్షణ, ప్రయోగ వాహక నౌకలు, అంతరిక్ష అన్వేషణ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో తాము ఆసక్తితో ఉన్నట్టు వెల్లడించారు.
‘స్పేస్ ఫర్ ఓషన్ అలయన్స్’ ద్వారా సముద్ర సంబంధ సమాచార వినిమయంలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్ ప్రతిపాదించారు. ఫ్రాన్స్‌కు చెందిన సీఎన్ఈఎస్, భారతీయ సంస్థల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు ఉండాలని సూచించారు. మానవసహిత అంతరిక్ష యాత్రల విషయంలో సహకారాన్ని విస్తరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందులో భాగంగా వ్యోమగాములకు శిక్షణ, మైక్రోగ్రావిటీ ప్రయోగాలు, దీర్ఘకాలిక ఉమ్మడి భాగస్వామ్య అవకాశాలపై సుముఖత వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ భాగస్వామ్యాల గురించి ప్రస్తావిస్తూ.. 2026 సెప్టెంబరులో పారిస్‌లో జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో క్రియాశీలంగా పాల్గొనవలసిందిగా భారత్‌ను ప్రొఫెసర్ బాప్టిస్ట్ ఆహ్వానించారు. అంతరిక్ష రంగంపై ప్రపంచవ్యాప్త చర్చల కోసం ఒక సమన్వయ వేదికను రూపొందించే దిశగా.. పారిస్ సదస్సును భారత బెంగళూరు అంతరిక్ష వేడుకతో అనుసంధానించాలని ఆయన సూచించారు.
ఫ్రాన్స్ ప్రతిపాదనలకు స్పందిస్తూ, ఆ దేశ చొరవను డాక్టర్ జితేంద్ర సింగ్ స్వాగతించారు. సముద్ర పరిశోధన, మానవసహిత అంతరిక్ష యాన రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేలా కలసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. అలాగే డీప్ ఓషన్ మిషన్, సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం.. సముద్ర సంబంధ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో భారత ప్రధాన బలాలుగా ఆయన పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వైజ్ఞానిక సహకారాన్ని కొనసాగించడంలో, సంస్థల మధ్య పరిశోధన భాగస్వామ్యాలను పెంపొందించడంలో ఇండో - ఫ్రెంచ్ అత్యాధునిక పరిశోధన ప్రోత్సాహక కేంద్రం (సీఈఎఫ్ఐపీఆర్ఏ) ముఖ్య పాత్ర పోషిస్తోందని ఇరుపక్షాలు పేర్కొన్నాయి.
ఆవిష్కరణ, పరిశోధన, సామర్థ్యాలను వినియోగించుకుంటూ, పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనం దిశగా పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై సమావేశ ముగింపు సందర్భంగా ఇరుదేశాలు ఉమ్మడి నిబద్ధతను ప్రకటించాయి.
***
(రిలీజ్ ఐడి: 2258913)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6