సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హిందీ పాత్రికేయ ప్రస్థానం ద్విశతాబ్ది సందర్భంగా ‘సంచార్ మాధ్యం’ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ‘ఐఐఎంసీ’

· నేటి పరిణామశీల పరిస్థితుల్లో అర్థవంతమైన కలలుగంటూ, వాటి సాకారానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్

· హిందీ పాత్రికేయ పరిణామం.. భారత జ్ఞాన సంప్రదాయాలను ‘సంచార్ మాధ్యం’ ప్రత్యేక సంచిక ప్రతిబింబిస్తోంది: ఐఐఎంసీ వైస్‌చాన్సలర్‌ ప్రజ్ఞా పలీవాల్ గౌర్

నాడు పోస్టు చేయడమైనది: 05 MAY 2026 9:32PM by PIB Hyderabad

దేశంలో హిందీ పాత్రికేయ ప్రస్థానానికి 200 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఈ రోజు ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్’ (ఐఐఎంసీ) ప్రధాన పరిశోధనాత్మక పత్రిక ‘సంచార్ మాధ్యం’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ శ్రీ హరివంశ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఐఎంసీ వైస్ చాన్సలర్ డాక్టర్‌ ప్రజ్ఞా పలీవాల్ గౌర్, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ శ్రీ కె.కె.నిరాలా కూడా పాల్గొన్నారు.

భారత్‌ ప్రగతి ప్రస్థానంలో హిందీ పాత్రికేయానికిగల సుసంపన్న వారసత్వాన్ని, దాని పరిణామశీల పాత్రను ఈ సందర్భంగా హరివంశ్‌ వివరించారు. కాలానుగుణంగా మార్పు వేగం పుంజుకుంటున్న నేటి శకంలో ‘అక్షరాస్యులు-నిరక్షరాస్యులు’ అనే పదాలకు నిర్వచనం చదవడం-రాయడమనే సంప్రదాయ పరిధులను అధిగమించిందని అన్నారు. నిరంతర అభ్యసనం, అభివృద్ధి చెందుతున్న జ్ఞాన వ్యవస్థలకు అనుగుణంగా మారే సామర్థ్యం అత్యంత అవశ్యమైంది. మార్పు రావాలంటే ఒకప్పుడు శతాబ్దాలు పట్టిన నేపథ్యంలో నేటి సాంకేతికతలు సంవత్సరాలు, నెలల వ్యవధిలోనే రూపాంతరం చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇటువంటి పరిస్థితుల నడుమ అర్థవంతమైన కలలు కనడంతోపాటు వాటి సాకారానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆయన ప్రతి ఒక్కరినీ... ముఖ్యంగా యువతరాన్ని కోరారు. “అకుంఠిత దీక్షతో శ్రమిస్తేనే 1826లో కలకత్తా నుంచి ప్రచురితమైన తొలి హిందీ వార్తాపత్రిక ‘ఉదంత మార్తాండ్’  తరహాలో కాలంపై తమదైన శాశ్వత ముద్ర వేయగలర”ని ఆయన స్పష్టం చేశారు.

‘వికసిత భారత్-2047’ దృక్కోణాన్ని ప్రస్తావిస్తూ- దేశ భవిష్యత్తు రూపకల్పనలో సమాచార-ప్రసార, పరిశోధన-ఆవిష్కరణల కీలక పాత్రను శ్రీ హరివంశ్ ప్రముఖంగా వివరించారు. ప్రస్తుత కాలాన్ని “నైపుణ్యాధారిత యుగం”గా ఆయన అభివర్ణించారు. నేటి పరిస్థితులలో నైపుణ్య సముపార్జన, సద్వినియోగం జీవితాలనే మార్చేస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక రూపాంతరీకరణ ప్రాధాన్యాన్ని వివరిస్తూ- అది తరచూ విస్తృత సామాజిక పరిణామాలకు మార్గనిర్దేశం చేస్తుందని వ్యాఖ్యానించారు. హై-స్పీడ్ రైలు, ఆధునిక ఓడరేవులు, ఇతర కీలక రంగాలు సహా మౌలిక సదుపాయాల కల్పనలో భారత్‌ సాధించిన ఇటీవలి ప్రగతిని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు.

నేటి సమాచార విప్లవ శకంలో వ్యష్ఠి-సమష్టి భవిష్యత్తును తీర్చిదిద్దగల వినూత్న ఆవిష్కరణలతో సంప్రదాయ మార్గాలను మించి ముందడుగు వేయగల సాహసం అవసరమని పేర్కొన్నారు. అత్యంత సూక్ష్మ సమాచారం కూడా ప్రజలకు చేరేలా చూడటం పాత్రికేయ లక్ష్యం కావాకలని, తద్వారా జాతీయ ప్రాముఖ్యంగల అంశాలపై సమాచార సహిత బహిరంగ చర్చకు, ఏకాభిప్రాయానికి వీలు కల్పించాలని శ్రీ హరివంశ్ స్పష్టం చేశారు. సమాచార ప్రసారకర్తలు దేశ శ్రేయస్సుపై తమ బాధ్యతను పూర్తిస్థాయిలో గుర్తించాలని ఆయన సూచించారు.

ఐఐఎంసీ వైస్ చాన్సలర్ డాక్టర్ ప్రజ్ఞా పలీవాల్‌ గౌర్ మాట్లాడుతూ- గడచిన రెండు శతాబ్దాల హిందీ పాత్రికేయం పరిణామంలో కీలక ఘట్టాలను ‘సంచార్ మాధ్యం’ ప్రత్యేక సంచిక ప్రతిబింబిస్తున్నదని చెప్పారు. ప్రముఖ విద్యావేత్తలు, మీడియా నిపుణుల రచనలను ఇది గుదిగుచ్చి అందించిందని పేర్కొన్నారు. పత్రికారంగంలో నేటి పోకడలను ఈ ప్రతిక నిరంతరం నిశితంగా గమనిస్తూనే, సుసంపన్న భారతీయ జ్ఞాన సంప్రదాయాంశాలను సమకాలీన చట్రం కోణం నుంచి పునఃపరిశీలించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2258302) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Malayalam