ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రుణాల మంజూరులో 2025-26 ఆర్థిక సంవత్సరం 15.9 శాతం స్థాయిలో పటిష్ఠ వృద్ధిని నమోదు చేసిన షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు (ఎస్‌సీబీలు)..


ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం కావడంతో పాటు పరపతికి డిమాండు పెరిగిందనడానికి ఇది సూచిక

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 15.7 శాతానికి ఎగసిన రుణ వృద్ధి ... అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 10.4 శాతానికి పరిమితం... గ్రామీణ ప్రాంతాల్లో డిమాండు నిలకడగా ఉందని, రుణ మంజూరు మెరుగైందని సూచిస్తున్న పరిణామం

పారిశ్రామిక పరపతి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి చేరిక... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఇది 8.2 శాతం... ఎమ్ఎస్ఎమ్ఈలకు జోరుగా రుణాలు

సేవల రంగంలో పరపతి వృద్ధి 19 శాతం... అంతకు ముందు సంవత్సరంలో ఇది 12 శాతమే... ఎన్‌బీఎఫ్‌సీలు, వ్యాపార, వాణిజ్య ప్రధాన స్థిరాస్తి రంగాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి

వ్యక్తులకిచ్చే రుణాలు 16.2 శాతం పెరుగుదల... అంతకు ముందటి సంవత్సరంలో ఈ విభాగంలో 11.7 శాతానికి పరిమితమైన వృద్ధి... వాహన రుణాలు, బంగారం కుదవ పెట్టుకొని ఇచ్చిన రుణాలకు మంచి డిమాండు... గృహనిర్మాణ విభాగ రుణాల్లో నిలకడైన వృద్ధి

నాడు పోస్టు చేయడమైనది: 05 MAY 2026 3:26PM by PIB Hyderabad

ఆహారేతర రుణాల్లో వృద్ధి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 15.9 * శాతంగా నమోదైంది. ఇది అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం కనబరచిన 10.9 శాతం కన్నా 497 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో పటిష్ఠ స్థాయిని సూచించింది. మొత్తం రుణాలు 2025 మార్చితో ముగిసిన సంవత్సరంలో కన్నా రూ.29.2 లక్షల కోట్లు అధికంగా.. రూ.212.9 లక్షల కోట్లకు ఎగబాకాయి.
వడ్డీ రేటు తక్కువగా ఉండటం, మూలధన వ్యయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం, ఈ పరిణామాలకు అదనంగా తరచుగా విధాన సంస్కరణలను తీసుకు వస్తుండడం, ప్రయివేటు పెట్టుబడుల అవకాశాలు ఇగుర్చుకుపోవడం, దేశీయంగా పరపతి అవసరాలు పెరగడంతో ఇటు వ్యక్తిగత రుణ గ్రహీతల్లోనూ, అటు కంపెనీల్లోనూ నమ్మకాన్ని కలిగించాయి.
సేవల రంగం, వ్యక్తిగత రుణ విభాగం, వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలతో పాటు పరిశ్రమలు.. ఇలా పలు రంగాలు రుణాలు తీసుకోవడానికి ఉత్సాహంగా ముందుకు రావడంతో, 2025-26 ఆర్థిక సంవత్సరంలో పరపతి వృద్ధి అనేక రంగాలకు విస్తరించింది.


రంగాలవారీ రుణ మంజూరు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:



రంగాలవారీ రుణ మంజూరు (ఏటికేడాది వృద్ధి శాతంలో)


     • వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు:  ఈ రంగంలో రుణ వృద్ధి 15.7 శాతం ఉంది. ఇది అంతకు ముందటి సంవత్సరంలో నమోదైన 10.4 శాతం వృద్ధి కన్నా 528 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అధికం. అంతేకాక ఇది వ్యవసాయ రంగానికి దక్కుతున్న బలమైన తోడ్పాటును కూడా సూచిస్తోంది. గ్రామీణ డిమాండు నిరంతరంగా ఉండడం, గ్రామీణ రుణాలను వ్యవస్థీకరించడం వల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక రంగానికి మంజూరు చేసిన రుణాల్లో సకారాత్మక వేగం  చోటు చేసుకుంది.
    • పారిశ్రామిక రంగం: ఈ రంగంలో రుణ మంజూరు వెనుకటి సంవత్సరంలోని 8.2 శాతం కన్న దాదాపు రెండు రెట్లు అధికంగా 15 శాతానికి చేరుకుంది. 33.1 శాతం వార్షిక వృద్ధితో పాటు, సూక్ష్మ లఘు పరిశ్రమలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3.7 రెట్లు అధిక రుణ వృద్ధిని నమోదు చేశాయి. మధ్యతరహా పరిశ్రమల్లో కూడా ఇదే విధంగా సకారాత్మక ధోరణులు కనిపించాయి. వాటి రుణాల్లో వార్షిక ప్రాతిపదికన 21.7 శాతం వృద్ధి ఉంది. పారిశ్రామిక రుణ విభాగానికి ప్రధాన చోదకాలుగా మౌలిక సదుపాయాల కల్పన, మూల లోహాలు, లోహ ఉత్పాదనలు, రసాయనాలు, రసాయనిక ఉత్పాదనలు, పెట్రోలియమ్, బొగ్గు ఉత్పాదనలతో పాటు పరమాణు ఇంధనాలు వంటివి ఉన్నాయి.
     • సేవల రంగం: మొత్తం రుణాల్లో 28 శాతం ఈ రంగానిదే. ఇంతకు ముందటి సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 12.0 శాతం వృద్ధితో పోలిస్తే 19.0 శాతం స్థాయిలో బలమైన వృద్ధి ఉంది. దీనికి ప్రధానంగా బ్యాంకింగేతర ఆర్థిక సహాయ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), వ్యాపార రంగం, వాణిజ్య స్థిరాస్తి రంగాల్లో అధిక డిమాండు రావడమే కారణమైంది.  
     • వ్యక్తిగత రుణ విభాగం: మొత్తం రుణాల్లో 33 శాతం వాటా ఈ విభాగానిదే. దీనిలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 16.2 శాతం వృద్ధి నమోదైంది. ఇది అంతకు ఒక సంవత్సరం కిందట నమోదైన రుణ వృద్ధి (11.7 శాతం) కన్న 455 బేసిస్ పాయింట్లు ఎక్కువ. గృహనిర్మాణ విభాగంలో వృద్ధి నిలకడగా ఉంది. వాహన రుణాలు, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని బదులుగా ఇచ్చే రుణాలు మంచి జోరుమీదున్నాయి.
పటిష్ఠంగా ఉన్న రుణ వృద్ధి తీరు దేశంలో ఆర్థిక వాతావరణం సుదృఢంగా ఉందని తెలియజేస్తోంది. మరి మన దేశ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో రుణాల కోసం డిమాండు అంతకంతకు పెరుగుతోందని సూచిస్తోంది. రుణాల మంజూరులో వృ‌ద్ధి బలంగా ఉన్న కారణంగా, కంపెనీలు వ్యాపారాల విస్తరణకు, వ్యక్తులు మన్నికైన వస్తువుల కొనుగోలుకు రుణాలు తీసుకుంటున్నారు. దీంతో స్థిరాస్తుల్లో పెట్టుబడి ద్వారా అదనపు రుణాల అవకాశాలు, తదనుగుణంగా ఉద్యోగావకాశాలు ఏర్పడుతూ.. పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం లభిస్తోంది.
భౌగోళిక, ఆర్థిక మార్పులతో పాటు భౌగోళిక, రాజకీయ ఒత్తిడులతో ప్రపంచ దేశాల్లో సవాళ్లతో కూడిన నేపథ్యం ఏర్పడినా కూడా, భారత ఆర్థిక వ్యవస్థ అసాధారణ ధీరత్వాన్ని కనబరిచింది. ప్రపంచంలో ఇతర దేశాలన్నిటిలోకీ వేగంగా ముందుకు పోతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది.
దేశ బ్యాంకింగ్ రంగం మన ఆర్థిక అభివృద్ధికి ఒక ప్రధాన చోదకశక్తిగా  ఉంది. ఇది ప్రస్తుతం అత్యుత్తమ స్థితిలో ఉంది. దీని బ్యాలెన్స్ షీటు సుదృఢంగా ఉంది. ఆస్తుల విలువ చరిత్రాత్మకంగా తక్కువగాను, లాభదాయకత స్థిరంగాను కొనసాగుతోంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందగలదన్న అంచనాలు పెరుగుతాయి. రుణ మంజూరులో సరళతర మార్పుచేర్పులను ప్రవేశపెడుతుండడంతో పాటు లాంఛన ప్రాయంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిరంతర ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తున్న కారణంగా ఆర్థిక వ్యవస్థలో  రుణాల మంజూరు  విస్తృతమైంది.
 * (ఏటికేడాది వృద్ధి (వై-ఓ-వై గ్రోత్) గణనను, 2025 ఏప్రిల్ 4 నాటికి మంజూరు చేసిన రుణాలతో పోలిస్తే 2026 మార్చి 31 నాటికి ఏ స్థాయిలో రుణాలను అందించారన్న అంశం ఆధారంగా పూర్తి చేశారు.  2025 డిసెంబరు 31 నుంచి, బ్యాంకింగ్ సూత్రాల (సవరణ) చట్టం-2025 ప్రకారం చివరి రిపోర్టింగు పక్షం నిర్వచనాన్ని నెలలోని చివరి దినానికి మార్చారు.  దీనికి అనుగుణంగా,  2025 డిసెంబరు కన్నా తరువాతి వార్షిక వృద్ధి రేట్లు వర్తమాన సంవత్సరం నెలాఖరు గణాంకాలతో పాటు  అంతకు ముందటి సంవత్సరంలోని సంబంధిత నెల చివరి రిపోర్టింగ్ పక్షం (పాత నిర్వచనం ప్రకారం) గణాంకాలపై ఆధారపడి ఉన్నాయి.


(రిలీజ్ ఐడి: 2258170) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Gujarati