పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో రెండు రోజుల జాతీయ కార్యశాలలో నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, డిజిటల్ సాధనాలపై దృష్టి
నాడు పోస్టు చేయడమైనది:
04 MAY 2026 5:56PM by PIB Hyderabad
పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీపై పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ కార్యశాల ఇవాళ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (2026-27) తయారీకి ఉద్దేశించిన ప్రజల ప్రణాళిక ప్రచార కార్యక్రమ (పీపీసీ) కరపత్రం, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) నాణ్యతను పెంపొందించే కమిటీ నివేదిక, నూతనంగా తీర్చిదిద్దిన ఈ-గ్రామ స్వరాజ్ ప్రణాళికా పోర్టల్‌ను కూడా ఆవిష్కరించారు. భాగస్వామ్య ప్రణాళికను బలోపేతం చేయటం, పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల నాణ్యతను మెరుగుపరచటం, తద్వారా వాటిని మరింత సమర్థవంతంగా, సమ్మిళితంగా, ఫలితాల ఆధారంగా తీర్చిదిద్దటం ఈ కార్యశాల లక్ష్యం. ఈ కార్యశాలకు కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, పంచాయతీ రాజ్ శాఖలు, ఎస్ఐఆర్ డీ, పీఆర్ ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కీలక భాగస్వాములు హాజరయ్యారు.
పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ప్రసంగిస్తూ.. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) తయారీపై కీలక సూచనలు చేశారు. దీన్ని కేవలం ఒక అధికారిక నిబంధనగా భావించకూడదని, క్షేత్రస్థాయిలో నిజమైన మార్పును తీసుకువచ్చే నాణ్యమైన ఫలితాలపైనే దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. జీపీడీపీ ద్వారా ఆస్తుల కల్పనకు సరైన ప్రణాళికను రూపొందించటం వల్ల వనరుల వృథాను అరికట్టవచ్చని పేర్కొన్నారు. స్థిరత్వం, స్పష్టమైన సంస్థాగత బాధ్యతలు, వనరుల సమర్థవంతమైన వినియోగం ద్వారా పంచాయతీల నేతృత్వంలోని ప్రణాళికా రచనను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని శ్రీ భరద్వాజ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో దీర్ఘకాలిక సేవలందించటంలో డిజిటల్ వేదికల పాత్రను కూడా ఆయన వివరించారు. గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం పెరగటం వల్ల నిర్ణయాధికారం మరింత సమగ్రంగా ఉంటుందని ఆయన చెప్పారు.
జల శక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్యూఎస్) కార్యదర్శి శ్రీ అశోక్ కె.కె. మీనా ప్రసంగిస్తూ.. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) పథకాలు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడ్డాయన్నారు. ఇప్పుడు మన దృష్టి ఈ ఆస్తుల నిరంతర నిర్వహణ, సంరక్షణ, వాటి సమర్థవంతమైన వినియోగంపైకి మళ్లాలని సూచించారు. స్థానిక అవసరాలపై పూర్తి అవగాహన ఉన్న గ్రామ పంచాయతీలే సేవలందించటంలో కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. మెరుగైన ప్రాథమిక సేవలందించటంలో బలమైన స్థానిక ప్రణాళిక అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు (జీపీడీపీలు) కేవలం కాగితాలకే పరిమితం కాకుండా... వనరుల వినియోగం, ఆస్తుల నిర్వహణ, డిజిటల్ పారదర్శకతను జోడిస్తూ, క్రియాశీలకంగా, ఫలితాల ఆధారితంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జవాబుదారీతనాన్ని పెంచేందుకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమని, డిజిటల్ సాధనాలను ఎక్కువగా ఉపయోగించాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించటానికి పంచాయతీలు, గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య కమిటీల బలోపేతం, పంచాయతీలు సొంత ఆదాయ వనరులను పెంచుకోవటం, నిర్వహణ, మరమ్మత్తులను స్థానిక ప్రణాళికల్లో అంతర్భాగం చేయటం వంటి అంశాల అవసరాన్ని స్పష్టం చేశారు.
పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ లోహాని మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) మారుతున్న తీరును, నాణ్యమైన, అంశాల వారీగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ మళ్లీ మళ్లీ ఒకే రకమైన పనులను చేయటం, కేంద్ర, రాష్ట్ర పథకాల మధ్య సమన్వయ లోపం కారణంగా ఆశించిన ఫలితాలు రావటం లేదన్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్ఎల్ బీలు) కేటాయింపుల్లో 84 శాతం పెరిగినట్లు తెలిపారు. కేంద్ర నిధులు కేవలం అనుబంధమైనవి మాత్రమేనని.. రాష్ట్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు, స్థానిక సంస్థల సొంత ఆదాయానికి ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) వికేంద్రీకృత ప్రణాళికకు ఒక శక్తివంతమైన సాధనమని ఆయన అభివర్ణించారు. ఇకపై నాణ్యతపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని, ఇందుకోసం నిపుణుల కమిటీ రూపొందించిన 15 సూచికల ఆధారంగా నాణ్యతను మెరుగుపరుస్తామని తెలిపారు. నూతనోత్సాహంతో జీపీడీపీ శిక్షణపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.
16వ ఆర్థిక సంఘం నిధుల వ్యవస్థపై పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ముక్తా శేఖర్ సమగ్ర అవగాహనను కల్పించారు. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయటానికి ఈ నిధుల కేటాయింపులో అనుసరిస్తున్న సంస్కరణాత్మక విధానాన్ని ఆమె స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు మద్దతిచ్చేందుకు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలతో నిధులను అనుసంధానిస్తూ.. 2026-31 సంవత్సరాలకు గానూ రూ. 4.35 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు. పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన క్షేత్రస్థాయి పాలనను నిర్ధారించేందుకు, ఈ-గ్రామ్ స్వరాజ్, ఆడిట్ ఆన్‌లైన్ పోర్టల్స్ లో చేరటం, రాష్ట్ర ఆర్థిక సంఘాలను బలోపేతం చేయటం, సమర్థ్ వేదికను అనుసంధానించటం, ఓఎస్ఆర్ రిపోర్టింగ్‌ను మెరుగుపరచటం వంటి కీలక కార్యాచరణ అంశాలను కూడా ఆమె వివరించారు.
సాంకేతిక సెషన్ తో కార్యశాల మొదటి రోజు ప్రారంభమైంది. ఇందులో ఇతివృత్తంతో కూడిన, అధిక-నాణ్యత గల పీడీపీలను సిద్ధం చేసేందుకు వ్యూహాత్మక విధానాలు, 16వ ఆర్థిక సంఘం అన్‌టైడ్ నిధులు, వాటి షరతులను అర్థం చేసుకోవటం, స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామ పేదరిక నిర్మూలన ప్రణాళిక (వీపీఆర్ పీ)ను జీపీడీపీతో అనుసంధానించటం, పీఈఎస్ఏ జీపీడీపీ తయారీ, పునరుద్ధరించిన ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, గ్రామ మంచిత్రపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. రెండో రోజున సాక్ష్యాధారిత ప్రణాళికలో పంచాయతీ అభివృద్ధి సూచిక (పీఏఐ)ను ఏకీకృతం చేయటంపై ప్రజెంటేషన్లు ఉంటాయి. అనంతరం పునరుద్ధరించిన పోర్టల్‌లో జీపీడీపీ తయారీకి సంబంధించి వివిధ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల బృందాలు అనుభవాలను పంచుకుంటాయి.
***
(రిలీజ్ ఐడి: 2257937)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7