హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్.. అరుణాచల్ ప్రదేశ్.. హర్యానా.. చండీగఢ్.. మధ్యప్రదేశ్.. ఛత్తీస్‌గఢ్‌లలో జనగణన-2027 కింద గృహ వివరాల సేకరణ ప్రారంభం


· ఢిల్లీ.. రాజస్థాన్.. మహారాష్ట్ర.. మేఘాలయ.. జార్ఖండ్‌ సహా ‘ఎంసీడీ’ ప్రాంతాల్లో స్వీయ నమోదుకు శ్రీకారం

· జనగణనలో తొలిసారి ప్రవేశపెట్టిన స్వీయ నమోదు సౌలభ్యానికి ప్రజాస్పందన ప్రోత్సాహకరం

· ఇప్పటిదాకా దాదాపు 82 లక్షల కుటుంబాల స్వీయ నమోదు

· జనగణన చట్టం-1948 కింద సేకరించే ఈ సమాచారం అత్యంత గోప్యం... గణాంక ప్రయోజనాలు.. ప్రగతి ప్రణాళికల కోసం మాత్రమే వినియోగం

· గృహాల జాబితా సేకరణలో అధికారులకు పూర్తిగా సహకరించాలని... ఈ కీలక జాతీయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రకటిత రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను కోరిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 01 MAY 2026 7:43PM by PIB Hyderabad

దేశంలో తాజా జనగణన కింద ప్రకటించిన 15 రోజుల స్వీయ నమోదు గడువు ముగిసిన నేపథ్యంలో  జనగణన-2027 తొలి దశలో భాగంగా ఇళ్ల జాబితా, గృహ గణన (హెచ్‌ఎల్‌ఓ) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. దీనికింద ఈ నెల 30 వరకూ సుశిక్షిత గణన అధికారులు సంబంధిత సమాచార సేకరణ కోసం ఇంటింటికీ వెళ్తారు.

జనగణనలో స్వీయ నమోదు సదుపాయం కల్పించిన దృష్ట్యా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ప్రాంతం, రాజస్థాన్, మహారాష్ట్ర, మేఘాలయ, జార్ఖండ్‌లలోనూ నేటినుంచి ప్రారంభమైంది. ఈ ఆన్‌లైన్ సదుపాయం ఈ నెల 15 వరకూ పౌరులకు అందుబాటులో ఉంటుంది. తదనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారులు ఈ నెల 16 నుంచి జూన్ 14 వరకూ ఇంటింటికీ వెళ్లి, జాబితా రూపొందించే పని చేపడతారు.

మరోవైపు బీహార్‌లో ప్రకటిత 15 రోజుల స్వీయ నమోదు వ్యవధి నేటితో ముగియడంతో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే పని ఈ నెల 2 నుంచి 31వ తేదీ వరకూ కొనసాగుతుంది.

జనగణన-2027లో తొలిసారి ప్రవేశపెట్టిన స్వీయ నమోదు సదుపాయంపై ప్రజల స్పందన ప్రోత్సాహకరంగా ఉంది. తాజా జనగణన కోసం అనుసరిస్తున్న డిజిటల్ విధానం కింద ఇప్పటిదాకా సుమారు 82 లక్షల కుటుంబాలు అధికారిక పోర్టల్ (se.census.gov.in) ద్వారా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నాయి.

దేశ పౌరులు తమ వివరాలను సురక్షితంగా సులభంగా ఆన్‌లైన్‌లో సమర్పించడానికి వీలుగా వినియోగించగల డిజిటల్ వేదిక ద్వారా క్షేత్రస్థాయి గణనకు ముందే ఈ సదుపాయం కల్పించారు. జనగణన కార్యకలాపాల డిజిటలీకరణలో ఇదొక కీలక మలుపుగా నిలుస్తుంది. ఈ విధానంతో లభించే సదుపాయం, సౌకర్యం, భాగస్వామ్యంలో ఎంతో సౌలభ్యంగా ఉండటంపై విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి.

స్వీయ నమోదు పూర్తిచేసిన పౌరులు, తమకు జారీ అయిన గుర్తింపు కార్డును భద్రపరచుకోవాల్సి ఉంటుంది. అనంతరం గృహ గణన ప్రక్రియలో భాగంగా క్షేత్ర సందర్శనకు వచ్చే గణన అధికారికి దాన్ని చూపించాల్సి ఉంటుంది. స్వీయ నమోదు ప్రక్రియను అనుసరించని గృహాలను ఇంటింటి సందర్శనలో అధికారులు జాబితాలో చేరుస్తారు.

సమగ్ర, సముచిత నమోదుకు భరోసాగా మునుపటి సంప్రదాయ ఇంటింటి గణన విధానాన్ని కొనసాగిస్తూనే, తొలిసారి డిజిటల్ ఉపకరణాలను కూడా ఈ ప్రక్రియలో వినియోగిస్తున్నారు. క్షేత్రస్థాయి సందర్శన సమయంలో గణన అధికారులు మరింత కచ్చితత్వంతో, వేగంగా పని చేసేందుకు వీలుగా డిజిటల్‌ పద్ధతిలో సమాచార సేకరణ కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తారు.

గృహాల జాబితా, గృహ గణన దశలో ఇంటింటి పరిస్థితులు, కుటుంబ వివరాలు, అందుబాటులోగల సౌకర్యాలు, ఆయా కుటుంబాల ఆస్తుల సంబంధిత సమాచారాన్ని 33 నిర్దేశిత ప్రశ్నల సహిత నిర్మాణాత్మక ప్రశ్నావళి ద్వారా సేకరిస్తారు. ఈ దశలో సేకరించే వివరాలు జనగణన-2027 తదుపరి లెక్కింపు దశకు పునాదిగా ఉపయోగపడతాయి.

ఇక తెలంగాణ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ప్రకటిత షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం స్వీయ నమోదు సదుపాయం కొనసాగుతోంది. అలాగే, జాతీయ రాజధాని ప్రాంతంలోని ‘ఎన్‌డీఎంసీ’ ప్రాంతం, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డుతోపాటు అండమాన్-నికోబార్ దీవులు, దాద్రా-నాగర్ హవేలీ, దమన్‌, దయ్యూ, గోవా, కర్ణాటక, లక్షద్వీప్, మిజోరం, ఒడిషా, సిక్కిం, ఉత్తరాఖండ్‌లలో గృహాల జాబితా, గృహ గణన కింద క్షేత్రస్థాయి కార్యకలాపాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా జనగణన చట్టం-1948 కింద సేకరించే ఈ సమాచారం మొత్తం అత్యంత గోప్యంగా ఉంటుంది. దీన్ని గణాంక ప్రయోజనాల కోసం, ప్రగతి ప్రణాళికల రూపకల్పనకు మాత్రమే వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రకటిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పౌరులు గృహాల జాబితా సేకరణ సమయంలో లెక్కింపు అధికారులకు పూర్తిగా సహకరించాలని, ఈ కీలక జాతీయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రభుత్వం కోరుతోంది.

***


(రిలీజ్ ఐడి: 2257413) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Assamese , Gujarati