వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పిలిభిత్‌లో బాస్మతి, సేంద్రియ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 70 సంవత్సరాల కౌలు ఒప్పందంపై
అగ్రికల్చరల్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రాడక్ట్‌స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) సంతకాలు
పంటల మూల్యాంకనాన్ని, ఎగుమతి ప్రణాళికని మెరుగుపరచడానికి ఏఐ ఆధారిత బాస్మతి ధాన్య సర్వే ప్రాజెక్టు ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
30 APR 2026 10:39AM by PIB Hyderabad
భారత్‌లో బాస్మతి బియ్యం అనుబంధ విస్తారిత వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మరో ముఖ్య చర్య తీసుకున్నారు. అగ్రికల్చరల్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రాడక్ట్‌స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ), వ్యవసాయ విభాగం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.. వీటి మధ్య 70 సంవత్సరాల కౌలు ఒప్పందంపై సంతకాల ప్రక్రియ పూర్తి అయింది. దీంతో పిలిభిత్‌లోని టాండా బిజైసీలో బాస్మతి, సేంద్రియ శిక్షణ కేంద్రంతో పాటు ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి భూమి బదలాయింపు ప్రక్రియకు సంబంధించిన లాంఛనాన్ని నెరవేర్చినట్లయింది.
బాస్మతి, సేంద్రియ శిక్షణ కేంద్రంతో పాటు ప్రదర్శన క్షేత్రాన్ని సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పుతారు. దీనిలో భాగంగా ఒక సభాభవనం, బాస్మతి, సేంద్రియ వ్యవసాయంపై ఒక వస్తు ప్రదర్శనశాల, చిత్రశాల, సమావేశాల నిర్వహణకో గది, ప్రయోగశాల, సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన సామగ్రిని నిల్వ చేసే సదుపాయం.. వీటిని అందుబాటులోకి తీసుకువస్తారు. బాస్మతి రైతులకు, సేంద్రియ వ్యవసాయ రైతులకు శిక్షణనివ్వడంతో పాటు సామర్థ్యాన్ని పెంచడంలో ఈ కేంద్రం తోడ్పడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయ నిపుణులకు, విద్యార్థులకు రిసోర్స్ సెంటర్‌గా కూడా ఇది తన సేవలను అందించనుంది.
ఈ కేంద్రం స్థాపన పూర్తి అయిన తరువాత ఇది దేశంలో తొలి బాస్మతి సేంద్రియ శిక్షణ, ప్రదర్శన క్షేత్రంగా నిలుస్తుంది. దీనిలో సాంప్రదాయిక, సేంద్రియ .. ఈ రెండు రకాలైన బాస్మతి సాగును చేపడతారు. దీనిని నెలకొల్పుతున్న స్థానాన్ని బట్టి చూస్తే, ఈ కేంద్రం ద్వారా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రైతులకీ, ఆసక్తిదారుల (స్టేక్‌హోల్డర్స్)కీ ప్రయోజనాలు అందే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ప్రసంగిస్తూ, ఈ సంతకాల కార్యక్రమాన్ని ప్రశంసించారు. బాస్మతి బియ్యం ఉత్పాదనలో ప్రముఖ క్షేత్రంగా పిలిభీత్ అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సి ఉందని ఆయన వివరిస్తూ, దీనిలో రైతులు భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని పిలుపునిచ్చారు. సందర్శకులకు, విద్యార్థులకు సమాచారంతో పాటు అనుభవపూర్వక శిక్షణను అందజేయడానికి ఈ కేంద్రంలో ఏఐ ఆధారిత ఇంటరాక్టివ్ మ్యూజియమ్ ఏర్పాటు చేయడమే కాక రైతులకు నాణ్యమైన బాస్మతి విత్తనాలు, సేంద్రియ సామగ్రిని అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో ఒక ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన సలహా ఇచ్చారు.
ఈ సందర్భంగా, భారత ఒకటో ఏఐ ఆధారిత బాస్మతి ధాన్య సర్వే ప్రాజెక్టు (2026-2028)ను కూడా శ్రీ జితిన్ ప్రసాద ఆవిష్కరించారు. దీనిని ఏపీఈడీఏ అఖిల భారతీయ బియ్యం ఎగుమతి దారు సంస్థల సంఘం (ఏఐఆర్ఈఏ) సహకారంతో అమలు చేస్తారు. దాదాపు 40 లక్షల హెక్టార్ల క్షేత్రానికి ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు అందుతాయి. 1,50,000 కన్న ఎక్కువ క్షేత్ర స్థాయి సర్వే పాయింట్లతో ఇది డేటాను సమీకరిస్తుంది. అంతేకాక 5,00,000 మందికి పైగా రైతులతో కలసి పనిచేస్తుంది. ఖచ్చితమైన పంట మూల్యాంకనం, రకాలను గుర్తించడం, శాస్త్రీయ సలహా సేవలను అందించడంతో పాటు మెరుగైన ఎగుమతి ప్రణాళిక రచనలోనూ సహకరిస్తుంది.
త్వరలో ఏర్పాటు చేసే ఈ కేంద్రాన్ని 61వ వార్షిక ధాన్య పరిశోధన గ్రూపు సమావేశంలో గుర్తించిన ప్రకారం బాస్మతి బియ్యం పరీక్షలకు గాను అఖిల భారతీయ సమన్వయ పూరిత పరిశోధన ప్రాజెక్టుల (ఏఐసీఆర్‌పీ) కేంద్రంగా కూడా నామినేట్ చేశారు. అలాగే, నగీనా (బిజ్‌నోర్), బీఈడీఎఫ్ మోదీపురమ్ ల తరువాత ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాస్మతి జీఐ జోన్‌లో మూడో ఏఐసీఆర్‌పీ కేంద్రంగా పిలిభీత్ మారనుంది. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయ, వాతావరణ పరిస్థితులకు సరిపోయే కొత్త బాస్మతి రకాలను పద్ధతి ప్రకారం పరీక్షించడంతో పాటు వాటి మూల్యాంకనానికి కూడా మార్గం సుగమం కానుంది.
భారత్‌లో జియాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) పొందిన ఉత్పాదనలలో బాస్మతి బియ్యం కూడా ఒకటి. 2025-26లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి చేశారు. ఈ బియ్యం విలువ 5.67 బిలియన్ అమెరికా డాలర్లు. మధ్యప్రాచ్యం, యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్లలో బాస్మతి బియ్యం లభ్యం అవుతోంది. భారత వ్యావసాయిక ఎగుమతుల్లో బాస్మతి ఎగుమతుల వాటా గణనీయంగా ఉంది.
సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో శిక్షణ, ధ్రువపత్రం పొందే ప్రక్రియలో సహకరించడం, మార్కెట్ సంబంధాల విషయంలో తోడ్పడడం ద్వారా సేంద్రియ సాగును ఏపీఈడీఏ ప్రోత్సహిస్తోంది. పర్యావరణం పట్ల బాధ్యతతో కూడిన ఉత్పాదనలకు ప్రపంచంలో రోజు రోజుకూ పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఈ ప్రయత్నాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాదతో పాటు జిల్లాకు చెందిన సీనియర్ ప్రజాప్రతినిధులు, ఏపీఈడీఏ అధికారులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పాటు ఇతర ఆసక్తిదారులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2257018)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14