రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నావికాదళ నౌకా విధ్వంసక క్షిపణి (స్వల్ప శ్రేణి) తొలి సాల్వో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో, భారత నావికాదళం

నాడు పోస్టు చేయడమైనది: 29 APR 2026 7:22PM by PIB Hyderabad

నావికా దళానికి చెందిన స్వల్పశ్రేణి నౌకా విధ్వంసక క్షిపణి (ఎన్ఏఎస్ఎం-ఎస్ఆర్) సాల్వో ప్రయోగాన్ని రక్షణ పరిశోధన - అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత నౌకాదళం కలిసి విజయవంతంగా నిర్వహించాయి. ఒడిశాలోని బంగాళాఖాతం తీరంలో ఉన్న నావికాదళ హెలికాప్టర్ వేదిక నుంచి ప్రయోగాన్ని చేపట్టారు. ఈ పరీక్షలో భాగంగా ఒకే హెలికాప్టర్ నుంచి రెండు క్షిపణులను వెనువెంటనే ప్రయోగించారు. గాల్లో ప్రయోగించే అత్యాధునిక నౌకా విధ్వంసక క్షిపణి వ్యవస్థలో ఇలాంటి సాల్వో ప్రయోగం ఇదే మొదటిది.

చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఏర్పాటు చేసిన రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి వివిధ ట్రాకింగ్ పరికరాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, ఈ పరీక్ష లక్ష్యాలన్నీ పూర్తిగా నెరవేరాయి. ఈ ప్రయోగం క్షిపణుల సాల్వో ప్రయోగ సామర్థ్యాన్ని నిరూపించడమే కాకుండా, శత్రు నౌకలను జలమట్టం వద్దే ఢీకొట్టే కచ్చితత్వాన్ని కూడా క్షిపణులు చాటుకున్నాయి. డీఆర్‌డీవో సీనియర్ శాస్త్రవేత్తలతోపాటు భారత నావికాదళం, వాయుసేన ప్రతినిధులు, అభివృద్ధి-ఉత్పత్తిలో భాగస్వాములు (డీసీపీపీ) ఈ పరీక్ష ప్రయోగాలను వీక్షించారు.

ఈ ఎన్ఏఎస్ఎమ్-ఎస్ఆర్ క్షిపణిలో సాలిడ్ ప్రొపల్షన్ బూస్టర్, ఎక్కువ సేపు మండే సస్టైనర్‌ను అమర్చారు. సీకర్, సమీకృత ఏవియానిక్ విభాగం, ఫైబర్-ఆప్టిక్ గైరోస్కోప్ ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ, రేడియో-ఆల్టిమీటర్‌ను ఉపయోగించుకునే అధునాతన చోదక - నిర్దేశక వ్యవస్థ వంటి కీలక ఉపవ్యవస్థలన్నీ దేశీయంగానే రూపొందాయి. వీటితోపాటు అత్యాధునిక నియంత్రణ, మార్గనిర్దేశక అల్గారిథమ్, హై బ్యాండ్‌విడ్త్ టూ - వే డేటా లింక్, జెట్ వేన్ కంట్రోల్ వ్యవస్థలను డీఆర్‌డీవోకు చెందిన వివిధ పరిశోధనశాలలు, భారతీయ పరిశ్రమలు అభివృద్ధి చేశాయి.

ఇతర డీఆర్‌డీవో పరిశోధనశాలలైన రక్షణ పరిశోధన - అభివృద్ధి పరిశోధనశాల - హైదరాబాద్, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ - పూణె, టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ – చండీగఢ్, ఐటీఆర్ - చండీపూర్‌తో కలిసి... హైదరాబాద్‌లోని పరిశోదన కేంద్రం ఇమారత్ ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇతర భారతీయ పరిశ్రమలు, అంకుర సంస్థల సహకారంతో డీసీపీపీ ప్రస్తుతం ఈ క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది.

తొలి సాల్వో ప్రయోగాన్ని విజయవంతం చేసిన డీఆర్డీవోభారత నౌకాదళంభారత వైమానిక దళం, డీసీపీపీ భాగస్వాములు సహా పరిశ్రమ వర్గాలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ క్షిపణి అభివృద్ధి రక్షణ దళాల సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని ఆయన అన్నారు.

సాల్వో ప్రయోగాలను విజయవంతం చేసిన బృందాలకు రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ శుభాకాంక్షలు తెలిపారు.

***


(రిలీజ్ ఐడి: 2256870) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , Marathi , हिन्दी