హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమరవీరులకు పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌లో శ్రద్ధాంజలి అర్పించి ప్రార్థించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ఊహించలేని సవాళ్లు, అడుగడుక్కీ అడ్డంకులు ఎదురైనా దేశ రక్షణే పరమ కర్తవ్యమని భావించి, ప్రాణత్యాగానికి వెనుదీయని మన సాహసిక భద్రతా సిబ్బంది పరాక్రమాన్ని చూసి గర్వపడుతున్నారు భారతీయులు

జన్మస్థలమైన గంగోత్రి నుంచి పవిత్ర త్రివేణీ సంగమం దాకా... సముద్రంలో గంగా మాత విలీనమయ్యే గంగాసాగర్ వరకూ... లక్షలాది భక్తజనం హృదయాల్లో కొలువై ఉంది ఆ నదీమతల్లి

దేశ ప్రజల సంక్షేమార్థం గంగాసాగర్‌ కపిల ముని ఆశ్రమంలో శ్రీ అమిత్ షా అర్చన

కపిల ముని జ్ఞానానికి, త్యాగానికి, తపస్సు కి ప్రతీక.. ఆయన జీవితం, బోధించిన తత్త్వం దేశంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయి

ప్రాణదాత గంగా మాతకు చెందిన ఈ పవిత్ర తీర్థంలో నా మనసులో అపారమైన శాంతి, ఆధ్యాత్మిక ఆనందం ఉప్పొంగుతున్నాయి

నాడు పోస్టు చేయడమైనది: 27 APR 2026 7:22PM by PIB Hyderabad

దేశం కోసం ప్రాణాలను అర్పించడానికైనా వెనుకంజ వేయని అమర వీరులకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌ వద్ద నివాళులు అర్పించి, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కపిల ముని ఆశ్రమంలో మహర్షి కపిలుడిని మంత్రి అర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా అనేక సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘తీర్థయాత్రలకు పలుమార్లు వెళ్లవచ్చు.. కానీ, గంగాసాగర్‌ను ఒక్కసారయినా దర్శించుకొనితీరాలి! సముద్రంలో గంగ సంగమ స్థానం ‘గంగాసాగర్‌’లో పూజా కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు దక్కింది. ప్రాణదాత గంగా మాత పవిత్ర తీర్థయాత్రా స్థలమైన ఈ చోట నా మనసు ఎంతో శాంతి తో, ఆధ్యాత్మిక పారవశ్యంతో నిండిపోయింది. గంగా నదీమతల్లి దేశ ప్రజలందరికి తన ఆశీస్సులను కురిపిస్తూ ఉండు గాక.’’
మన అమరవీరులకు శ్రీ అమిత్ షా శ్రద్ధాంజలి ఘటిస్తూ, ‘‘ ఈ రోజు.. గంగాసాగర్‌లో.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మన అమరవీరులకు నివాళులు అర్పించి, వారిని స్మరించుకొంటూ పూజలో పాల్గొని వారి పట్ల నేను గౌరవ ప్రపత్తుల్ని చాటుకున్నాను. ఊహించలేని సవాళ్లు, అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నా దేశ రక్షణే పరమ కర్తవ్యంగా ఎంచి, దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి వెనుకంజ వేయని మన సాహసిక భద్రతాదళ సిబ్బంది పరాక్రమం, భారత్‌లో అందరికీ గర్వకారణం’’ అని పేర్కొన్నారు.
ప్రజలు బాగుండాలని శ్రీ అమిత్ షా ప్రార్థిస్తూ, ‘‘గంగాసాగర్‌లోని కపిల ముని ఆశ్రమంలో మహర్షి కపిలుని అర్చించాను. దేశ ప్రజలంతా చల్లగా ఉండాలని ప్రార్థించాను. కపిల రుషి జీవనం, ఆయన తత్త్వదర్శనం జ్ఞానానికి, త్యాగానికి, తపస్సు కి ప్రతీక.. పౌరులందరికీ స్ఫూర్తిదాయకం’’ అని పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ‘‘గంగోత్రిలో జన్మస్థలం మొదలు పవిత్ర త్రివేణీ సంగమ స్థానం వరకూ.. గంగా నదీమతల్లి ప్రవహించే మార్గమంతటా.. సముద్రంలో విలీనమయ్యే దాకా కూడా లక్షలాది భక్తగణం హృదయాల్లో కొలువై ఉంది’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2256156) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Gujarati