వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ - న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో... భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి శ్రీ టాడ్ మెక్‌క్లే నేతృత్వంలో ఆగ్రాలో పారిశ్రామిక సదస్సు
సుంకాలకు మాత్రమే పరిమితం కాకుండా... వాణిజ్యం, రవాణా, పెట్టుబడి, ప్రజా సంబంధాలతో సమగ్ర భాగస్వామ్యంగా నిలవనున్న భారత్ - న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
తయారీ రంగంలో అత్యధిక వృద్ధి, ప్రపంచానికి కేంద్రంగా నిలవాలన్న సంకల్పానికి చోదక శక్తిగా భారత్ - న్యూజిలాండ్ సమన్వయం: 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్న ఆగ్రా తోలు పరిశ్రమ రంగం
ఔషధ రంగం, వైద్య పరికరాలపై భారత్ - న్యూజిలాండ్ ఎఫ్‌టీఏలోని నిబంధనలను స్వాగతించిన పరిశ్రమ వర్గాలు... వేగవంతమైన నియంత్రణ సదుపాయాలు, ప్రత్యేక ఆయుష్ విభాగంతో ఈ రంగానికి ఊతం
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద విద్య, ప్రతిభా వినిమయం, వివిధ రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరిన శ్రీ పీయూష్ గోయల్
నాడు పోస్టు చేయడమైనది:
26 APR 2026 7:31PM by PIB Hyderabad
భారత్ - న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) నేపథ్యంలో... భారత వాణిజ్య - పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య - పెట్టుబడుల శాఖ మంత్రి శ్రీ టాడ్ మెక్ క్లే ఆగ్రాలో ఒక పారిశ్రామిక సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎస్.పి. బఘేల్ కూడా ఇందులో పాల్గొన్నారు. తోలు పరిశ్రమ, పాదరక్షలు, ఆయుష్, వైద్య పరికరాలు, లైట్ ఇంజినీరింగ్, క్రీడా సామగ్రి రంగాలతోపాటు ఉత్తరప్రదేశ్ లఘు ఉద్యోగ భారతికి చెందిన పారిశ్రామిక ప్రముఖులను ఈ చర్చ ఒక్క వేదికపైకి చేర్చింది. తోలు పరిశ్రమలో భారత తయారీ నైపుణ్యం, ఫార్మా పరిశ్రమ, వైద్య పరికరాల పరిశ్రమ, ఇంజినీరింగ్ ఉత్పత్తుల విస్తృతిని, వైవిధ్యాన్ని వివరించేలా.. పరిశ్రమ వర్గాలు అభిప్రాయాలను వెల్లడించాయి.
సమ్మిళితమైన, దూరదృష్టితో కూడిన, దేశ ప్రాధాన్యాలే బలమైన మూలంగా ఉన్న వాణిజ్య భాగస్వామ్యాలను నిర్మించుకోవాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత దృష్ట్యా.. భారత్ - న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ కేవలం సుంకాలపై కుదిరిన ఒప్పందం మాత్రమే కాదని మంత్రులిద్దరూ వ్యాఖ్యానించారు. మార్కెట్ లభ్యత, వ్యవసాయ ఉత్పాదకత, పెట్టుబడి, ప్రతిభా వినిమయం, క్రీడలు - పర్యాటక రంగాల్లో సహకారం, ప్రజా సంబంధాల వంటి అనేక అంశాలతో కూడిన సమగ్రమైన ఏర్పాటు ఇది. ఇరు దేశాల్లోని తయారీదారులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని రూపొందించారు.
దేశ మొత్తం తోలు పాదరక్షల ఉత్పత్తిలో సుమారు 75 శాతం వాటా కలిగిన ఆగ్రా... ఈ రంగానికి సంబంధించి భౌగోళిక గుర్తింపు సూచికను (జీఐ ట్యాగ్) పొందడమే కాకుండా, ఒక జిల్లా - ఒక ఉత్పత్తి పథకం కింద ప్రతిష్ఠాత్మక ఉత్పత్తిగా నిలిచింది. అమల్లోకి వచ్చినప్పటి నుంచి 100 శాతం భారతీయ ఎగుమతులపై ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సుంకాలను తొలగిస్తుంది. తోలు, పాదరక్షలపై సుంకాలను 5 శాతం నుంచి సున్నాకు తగ్గిస్తుంది. దీంతో భారతీయ ఎగుమతిదారులు పోటీపరంగా నిర్ణయాత్మక ప్రయోజనాన్ని పొందనున్నారు. భారీ ఉత్పత్తి నుంచి అత్యధికంగా విలువను పెంచే తయారీ దిశగా వ్యూహాత్మక మార్పు ద్వారా.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు ఎదిగే సామర్థ్యం ఈ రంగానికి ఉందని పరిశ్రమ ప్రతినిధులు వివరించారు. న్యూజిలాండ్‌లోని అపారమైన ముడి తోలు వనరులు, భారత్‌లోని తయారీ నైపుణ్యం కలిసి వాటిని సద్వినియోగం చేసుకుంటే.. ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సందర్భంగా మంత్రులు, పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆగ్రాను అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి కేంద్రంగా, ఉపాధికి చోదకంగా, ప్రపంచ స్థాయి ఎగుమతుల కేంద్రంగా నిలపడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఔషధ రంగం, వైద్య పరికరాల రంగాలపైనా ఈ చర్చల్లో ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంతర్జాతీయ స్థాయి నియంత్రణ సంస్థల నుంచి జీఎంపీ, జీసీపీ తనిఖీ నివేదికలను పరస్పరం అంగీకరించడం వంటి నిబంధనలను పరిశ్రమ ప్రతినిధులు స్వాగతించారు. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గడమే కాకుండా, భారతీయ తయారీదారుల ఉత్పత్తులకు వేగంగా అనుమతులు లభిస్తాయి. ఆయుష్ రంగానికి గుర్తింపునిస్తూ.. ఈ ఒప్పందంలో ఆరోగ్యం, సంప్రదాయ ఔషధంపై ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చడాన్ని వారు స్వాగతించారు. ఇరు దేశాల వాణిజ్య ఒప్పందాల్లో ఈ రకమైన గుర్తింపు ఇదే మొదటిసారి.
విద్య, ప్రతిభా వినిమయ రంగాల్లో ఈ ఒప్పందం కల్పించే గణనీయమైన అవకాశాలనూ శ్రీ పీయూష్ గోయల్ ప్రస్తావించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అందుబాటులోకి వచ్చే కొత్త మార్గాలను అన్వేషించేలా భారతీయ విద్యార్థులను, నిపుణులను ప్రోత్సహిస్తూ.. ఈ నిబంధనలను క్రియాశీలకంగా సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను, భాగస్వాములను మంత్రి కోరారు. ఇరు దేశాల మధ్య మరింత దృఢమైన, ప్రజా కేంద్రీకృత భాగస్వామ్యానికి ద్వారంగా ఈ ఒప్పందాన్ని చూడాలని పిలుపునిచ్చారు.
సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ... ద్వారాలనూ భావాలనూ తెరిచేదిగా ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని శ్రీ గోయల్ అభివర్ణించారు. సాధారణ ధోరణులకు భిన్నంగా ఆలోచించాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. ఫార్మా, ఆయుష్, విద్య, క్రీడలు, పర్యాటకం, పెట్టుబడుల రంగాల్లో ఈ ఒప్పందం కల్పిస్తున్న విస్తృత అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఎంఎస్ఎంఈకి, చిన్న సంస్థకు దీని ప్రయోజనాలు చేరేలా చూడాలని పారిశ్రామిక సంఘాలకు ఆయన పిలుపునిచ్చారు. న్యూజిలాండ్‌కు భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన దేశమని టాడ్ మెక్‌క్లే పునరుద్ఘాటించారు. న్యూజిలాండ్ కుదుర్చుకున్న అత్యున్నత ప్రమాణాలతో కూడిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా దీనిని అభివర్ణించారు. ఇరువైపులా ఉన్న వ్యాపార సంస్థలు చురుగ్గా సంయుక్త వ్యాపారాలను చేపట్టాలని ఆయన కోరారు. అలాగే విశేషంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పెట్టుబడి అవకాశాలను న్యూజిలాండ్ వ్యాపార సంస్థలు గమనిస్తున్నాయని వివరించారు.
న్యూఢిల్లీలో భారత్ - న్యూజిలాండ్ మధ్య కుదిరిన చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో నిర్వహిస్తున్న వరుస ఉన్నత స్థాయి చర్చల్లో భాగంగా ఆగ్రాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 మార్చి 16న ప్రారంభమైన ఈ చర్చలు, రికార్డు స్థాయిలో తొమ్మిది నెలల్లోనే పూర్తయ్యాయి. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి ఇది నాంది పలికింది.
***
(రిలీజ్ ఐడి: 2255988)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14