సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక న్యాయంపై జాతీయ చింతన శిబిరం చండీగఢ్‌లో పూర్తి...


2047 కల్లా అంత్యోదయ స్ఫూర్తితో ‘వికసిత్ భారత్’ ఆశయ సాకారానికి నిర్ణీత కాల మార్గ సూచీ ఖరారు

ఉపకార వేతనాల మొదలు లభ్యత, ట్రాన్స్‌జెండర్ సంక్షేమం వరకు... ఒక్క విధానపరమైన ఉద్దేశాలపైనే కాకుండా ఆచరణాత్మక పరిష్కారాలపైనా ఈ చింతన శిబిరం దృష్టి సారించిందన్న కేంద్రమంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్

‘అంత్యోదయ సే ఆత్మనిర్భరత’, ‘సమావేశన్-పహచాన్-ఏకీకరణ్’, ఆర్థిక సాధికారత, దివ్యాంగజనులకు ప్రమాణీకరణ, లభ్యత.. వీటిపై ఆచరణపూర్వక సిఫారసులను ఆమోదించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

జనగణన-2027 లో డీఎన్‌టీలను చేర్చడం, ఎస్ఈఈడీ పథకాన్ని పటిష్ఠపరచడం, ఎస్‌సీలు, ఇతర వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారత, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం విస్తృత స్థాయి మద్దతుపై ప్రత్యేక శ్రద్ధ

డీఓఎస్‌జేఈ పథకాల్లో ‘జాగరూకతా సే సుగమ్యతా’ (అవగాహన నుంచి లభ్యత)తో పాటు ప్రక్రియల సరళీకరణకు గాను నిర్దిష్ట చర్యలపై సమ్మతి తెలిపిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

సామాజిక న్యాయం అందజేతలో సంక్షేమ సంబంధిత ఉద్దేశాలను మరింత ముందుకు తీసుకుపోతూ క్షేత్ర స్థాయిలో ఫలితాల సాధన దిశగా పయనించాలన్న ఉమ్మడి సంకల్పాన్ని బలోపేతం చేసిన 3 రోజుల శిబిరం

నాడు పోస్టు చేయడమైనది: 26 APR 2026 5:44PM by PIB Hyderabad

సామాజిక న్యాయం, సాధికారత కల్పన శాఖ 3 రోజుల పాటు నిర్వహించిన జాతీయ చింతన శిబిరం ఈ రోజు చండీగఢ్‌లో ముగిసింది. ‘‘అంత్యోదయ కా సంకల్ప్, అమృత్ కాల్ కా ప్రతిబింబ్-వికసిత్ భారత్@2047” ఇతివృత్తానికి అనుగుణంగా సామాజిక న్యాయ పథకాలను దేశంలో ప్రతి ఒక్క రంగంలో ప్రభావవంతమైన పద్ధతిలో అమలు చేయడాన్ని పటిష్ఠంగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన నిర్ణీత కాలిక, ఆచరణాత్మక సిఫారసులపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకారాన్ని తెలియజేశాయి. 2026 ఏప్రిల్ 24 మొదలు ఏప్రిల్ 26 వరకూ నిర్వహించిన ఈ శిబిరంలో తొలి రోజున దృష్టికోణం, ఆత్మగౌరవం, లభ్యత అంశాలపై శ్రద్ధ వహించారు. రెండో , మూడో రోజుల్లో ఇతివృత్తం వారీగా లోతైన చర్చోపచర్చలు చేపట్టారు. ముగింపు సదస్సులో... చర్చల్లో లభించిన ఫలితాలను అనుసరించి, రాబోయే కాలంలో చేపట్టవలసిన చర్యలకు తుదిరూపు ఖరారు చేశారు.
సామాజిక న్యాయ సంబంధిత కార్యాచరణను కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరింత సులభతరంగా, జవాబుదారీతనం కలిగిందిగా,  అమలుకు అనువైందిగా ఎలా రూపొందించవచ్చన్న విషయంపై చర్చోపచర్చలు జరపడానికి ప్రధానమైన వేదికను ఈ జాతీయ చింతన శిబిరం అందించిందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత కల్పన శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. ఆయన ముగింపు ఉపన్యాసాన్నిచ్చారు. ‘‘అంత్యోదయ కా సంకల్ప్, అమృత్ కాల్ కా ప్రతిబింబ్-వికసిత్ భారత్ @2047”.. ఈ విస్తృత జాతీయ సంకల్పాన్ని ఆధారం చేసుకొని చర్చోపచర్చలు జరిగాయని ఆయన అన్నారు. దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికీ ఆత్మగౌరవం, లభ్యత, నిరంతరత.. ఈ అంశాలు కీలకంగా సామాజిక న్యాయం దక్కాలని మంత్రి పునరుద్ఘాటించారు. 

శిబిరంలో జరిపిన చర్చలు విస్తృత విధాన పరమైన ఉద్దేశాలను దాటి ముందుకు పోయి, ఉపకార వేతనాల అందజేత, వ్యసనాల నుంచి విముక్తి, వయోవృద్ధ పౌరుల సంక్షేమం, లభ్యత (ఏక్సెసబులిటీ), దివ్యాంగ వ్యక్తులకు సర్టిషికేషన్, బలహీన వర్గాల వారిని కలుపుకొని సాగిపోతూ సహాయాన్ని అందించే వ్యవస్థల ఏర్పాటు వంటి రంగాల్లో ఆచరణాత్మక పరిష్కారాల్ని అందించడంపై దృష్టిని కేంద్రీకరించాయని డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. ప్రారంభిక సదస్సు సందర్బంగా మొదలుపెట్టిన ప్లాట్‌ఫారాలు, అప్లికేషన్లు సహా మంత్రిత్వ శాఖ ప్రస్తుతం అమలు చేస్తున్న డిజిటల్, సంస్థాగత కార్యక్రమాలను గురించి ఆయన ప్రస్తావించారు. ఈ పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు ఎలాంటి జాప్యానికి తావు లేకుండా అందించాలని ఆయన చెప్పారు.  దీనికోసం సాంకేతికత ఆధారిత పాలన, ప్రక్రియల సరళీకరణ, ఉత్తమ పర్యవేక్షణ, కేంద్రానికి, రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య దృఢ సమన్వయాన్ని నెలకొల్పడం ముఖ్యమని కూడా ఆయన వివరించారు.
ఇతివృత్త ప్రధాన భోజన సదస్సులు, గ్రూపు ప్రజెంటేషన్లతో లభించిన సిఫారసులు సామాజిక న్యాయ రంగంలో అధిక ప్రభావాన్ని ప్రసరించగలిగే కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో తోడ్పడుతాయన్న విశ్వాసాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. చింతన శిబిరం ద్వారా లభించే ఫలితాలను రాష్ట్రాలతో, కేంద్రపాలిత ప్రాంతాలతో తమ మంత్రిత్వ శాఖ సన్నిహిత భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకొని ముందుకు తీసుకుపోతుందని, ఈ క్రమంలో పేదలు, వంచిత వర్గాలు, బలహీన వర్గాలను కలుపుకొని, సాధికారతను సమకూర్చి, క్షేత్ర స్థాయిలో కళ్లెదుట కనపడే ఫలితాల్ని సాధించడంపై నిరంతరం శ్రద్ధ తీసుకొంటామని ఆయన వివరించారు.
యోగ కార్యక్రమ నిర్వహణతో మూడో రోజును మొదలుపెట్టారు. దీని తరువాత, ‘‘జాగరూకతా సే సులభతా - అవేర్‌నెస్ టు ఏక్సెసబులిటీ అండర్ డీఓఎస్‌జేఈ’’ అంశంపై అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  దీనిలో  పాల్గొన్న వారు పథక-కేంద్రిత ఆలోచనా విధానానికి భిన్నంగా హక్కుల- ఆధారిత, సార్వజనిక డిజైన్ దృష్టికోణాన్ని అవలంబించాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. ఈ పద్ధతి.. లభ్యతను అన్ని సార్వజనిక మౌలిక సదుపాయాలు, సేవలు, డిజిటల్ వేదికల అంతర్భాగంగా పరిగణిస్తుంది. నిరంతర చైతన్యం, ఇంజినీర్లు, ఆర్కిటెక్టుల సామర్థ్యాన్ని పెంచడం, సాంకేతికతను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడం, రవాణా, ఐసీటీ, ప్రజా సేవలను దివ్యాంగులు సహా అందరికీ సులభతరంగా సమకూర్చడంలో స్థానిక సంస్థలు బలమైన భూమికను పోషించడం ముఖ్యమని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ సందర్భంగా స్పష్టం చేశాయి.
ఉదయం నిర్వహించిన సదస్సులో, ఐదు ఇతివృత్త ప్రధాన గ్రూపులు 2047 కల్లా వికసిత్ భారత్ సాధన ప్రణాళికలో భాగంగా విస్తృత చర్చతో పాటు ప్రెజెంటేషన్ కోసం ఉద్దేశించిన తమ రెండో సెట్ ఇతివృత్తాలపైన కూడా జరిగిన చర్చోపచర్చల్లో పాల్గొన్నాయి.
ఒకటో గ్రూపు ‘‘అంత్యోదయ సే ఆత్మనిర్భరతా: ప్రాంత ఆధారిత జోక్యాలతో సామాజిక, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం’’ అంశంపై దృష్టి కేంద్రీకరించింది. పీఎమ్-ఏజేఏవైలో భాగంగా సమన్వయ సాధన, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, ఎస్‌సీ సమాజాన్ని లెక్కలోకి తీసుకొని నైపుణ్యాభివృద్ధికి, జీవనోపాధికి సంబంధించిన సాయాన్ని అందించడంతో పాటు గ్రామం, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఫలితాలపై దృష్టి సారిస్తూ తగిన పర్యవేక్షణను చేపట్టాల్సిన అవసరం ఉందన్న అంశలపై కూడా చర్చించారు.
రెండో గ్రూపు ‘‘సమావేశన్, పహచాన్‌ అవుర్ ఏకీకరణ్’’ అంశంపై చర్చించింది. దీనిలో.. డి-నోటిఫైడ్, నోమాడిక్, సెమీ-నోమాడిక్ ట్రైబ్స్ (డీఎన్‌టీలు, ఎన్‌టీలు, ఎస్ఎన్‌టీలు) ఆర్థిక సాధికారత కల్పనకు ఉద్దేశించిన ఎస్ఈఈడీ స్కీముతో పాటు ఎంతో కాలం నుంచి నిరాదరణకు గురవుతున్న వర్గాలను లెక్కలోకి తీసుకొని ఖచ్చితమైన గణన, ప్రమాణీకరణ, సమస్యాత్మక ప్రాంతాల చెంతకు పరిపాలనను తీసుకుపోవడం వంటి చర్యలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడంపై మేధోమధనం చేశారు.  
మూడో గ్రూపు ‘‘ఆర్థిక సశక్తీకరణ్: రుణ లభ్యత, ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా సాధికారత కల్పన’’ అంశంపై చర్చించింది. ఎస్‌సీలు, ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ)లకు రుణాలు, నైపుణ్యాల అభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడం, ఆర్థిక సేవలను వారి అందుబాటులోకి తీసుకుపోవడాన్ని మెరుగుపరిచడమెలాగన్నది పరిశీలించారు. ప్రస్తుత ఆర్థిక సహాయ, జీవనోపాధి పథకాలతో మెరుగైన సమన్వయాన్ని ఏర్పరచడం అనే అంశాన్ని కూడా సమీక్షించారు.
నాలుగో గ్రూపు ‘‘సుగమ్యతా సే సమావేశన్: లభ్యత’’ అంశాన్ని చర్చించింది. దీనిలో.. లభ్యతకు సంబంధించిన ప్రజెంటేషన్ల ఆధారంగా 2027-28 కల్లా మార్పు చేయడానికి వీలు లేని లభ్యత ప్రమాణాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అడ్డంకుల ప్రసక్తే లేని ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్రాల స్థాయిలోనూ పథకాల రూపకల్పన, నిర్ధారిత నిధులు, ప్యానల్‌లో చేర్చిన ఆడిటర్లు, వ్యవస్థాగత సామర్థ్య పెంపుదల అవసరమంటూ పిలుపునిచ్చారు.
అయిదో గ్రూపు ‘‘పహచాన్ సే సమ్మాన్: దివ్యాంగులకు ఉద్దేశించిన సర్టిఫికేషన్’’ అంశంపై దృష్టి పెట్టింది. దీనిలో సకాలంలో, సాంకేతికత ఆధారిత దివ్యాంగ ధ్రువపత్రాల జారీ, ప్రయోజనాలను సులభంగా అందుకోవడంతో పాటు విభాగాల మధ్య సమాచారాన్ని మరింత మెరుగైన విధంగా ఏకీకరించాల్సిన అవసరం ఉందని వివరించారు.
జనగణన-2027లో డీఎన్‌టీ సమాజాలను చేర్చడం, ఎస్ఈఈడీ పథకం అమలును బలోపేతం చేయడం, పీఎమ్-ఏజేఏవై, తదితర ఎస్‌సీ, ఓబీసీ కార్యక్రమాల్లో భాగంగా జీవనోపాధి, సామాజిక భద్రతా చర్యలను పెంపొందించడంతో పాటు ఎస్ఎమ్ఐఎల్ఈ-టీజీ ఉప పథకంలో భాగంగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల విస్తృత పునరావాసం వంటి నిర్దిష్ట అంశాలపై అన్ని సమూహాలకు చెందిన వారు చర్చించారు. డీఎన్‌టీ భూమి హక్కులు, ఉపకార వేతనం అందజేత, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం (దీనిలో ‘గరిమా గృహాలు’, సంరక్షక విభాగాలు, సంక్షేమ మండళ్లు వంటివి భాగంగా ఉన్నాయి), వయోవృద్ధ పౌరులను దృష్టిలో పెట్టుకొని సమాజ ఆధారిత సహాయాన్ని అందించడం, లభ్యతలో నవకల్పనలకు సంబంధించిన అత్యుత్తమ పద్ధతులు, విజయ గాథలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ నివేదికల్ని సమర్పించాయి. ఈ పద్ధతులను, గాథలను ఇతర భాగస్వాములు కూడా అనుసరించి, విస్తరించాలనే ఉద్దేశంతో నివేదికల్ని సమర్పించారు.
డీఓఎస్‌జేఈ పథకాల్లో ‘‘ప్రక్రియల సరళీకరణ’’ అంశంపై భోజనకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో ప్రక్రియలను సరళం చేయడం, డాక్యుమెంటేషన్‌ హేతుబద్దీకరణ, ఫిర్యాదుల పరిష్కారాన్ని పటిష్ఠపరచడం, నిధుల సమీకరణని, వినియోగాన్ని మెరుగుపరిచే దిశగా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఉపకార వేతనాలు, పింఛన్లు, పునరావాస సంబంధిత సాయం, లభ్యత గ్రాంట్లు, ఇతర ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేదా ప్రక్రియాత్మక అడ్డంకులకు తావు ఉండని విధంగా అందజేయాలని, దీని కోసం ప్రక్రియను సరళీకరించడం, డిజిటల్ వేదికలతో పాటు ఖచ్చిత కాలావధులను నిర్దేశించడం తప్పనిసరని చర్చల్లో స్పష్టం చేశారు.
సవరించిన మార్గదర్శకాలు, సుదృఢ పర్యవేక్షణ, విస్తృత స్థాయి చేరిక, సామర్థ్యాల్ని నిరంతరం పెంపొందించుకోవడం వంటి వాటి ద్వారా చర్చోపచర్చల్లో తీర్మానించిన అంశాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో మంత్రిత్వ శాఖ ఓ సువ్యవస్థీకృత పద్ధతిలో ముందుకు తీసుకు పోతుందన్న ఉమ్మడి అవగాహనతో జాతీయ చింతన శిబిరాన్ని ముగించారు. సామాజిక న్యాయాన్ని కేవలం ఉద్దేశానికే పరిమితం చేయకుండా, నిరుపేదలు, అత్యంత బలహీన వర్గాల వారి జీవనంలో పక్కా మెరుగుదలను తీసుకురావాలన్న సామూహిక సంకల్పాన్ని శిబిరం పునరుద్ఘాటించింది. దీంతో, 2047 కల్లా సమ్మిళిత, సాధికార, సమానావకాశాల్ని కల్పించగల వికసిత్ భారత్‌‌‌ను ఆవిష్కరించాలనే లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పాటు లభించనుంది.
జాతీయ చింతన శిబిరం ప్రారంభిక సదస్సు (ఏప్రిల్ 24, 2026)తో పాటు రెండో రోజు (ఏప్రిల్ 25, 2026)న జారీ చేసిన పత్రికా ప్రకటనలను కింద ఇచ్చిన లింకులలో చదువవచ్చును.

 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2255407&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2255543&reg=3&lang=1

 

***


(రిలీజ్ ఐడి: 2255983) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Kannada