ఉప రాష్ట్రపతి సచివాలయం
‘‘క్యాన్సర్‌ను జయించిన వారు నిజమైన యోధులు’’: జైపూర్‌లో జరిగిన క్యాన్సర్ సర్వైవర్స్ డే వేడుకల్లో ఉపరాష్ట్రపతి
వైద్య రంగంలో అంతరాలను తొలగిస్తూ.. వెనకబడిన వర్గాలకు కీలకమైన క్యాన్సర్ చికిత్సను అందిస్తోన్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన: ఉపరాష్ట్రపతి
ఆయుష్మాన్ భారత్ కింద 75 శాతం క్యాన్సర్ చికిత్సలు గ్రామీణ ప్రజలే పొందుతుండటం విశేషం: ఉపరాష్ట్రపతి
క్యాన్సర్‌పై పోరాటంలో వ్యాధిని ముందుగానే గుర్తించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత కీలకం: జైపూర్‌లో ఉపరాష్ట్రపతి
‘‘క్యాన్సర్‌తో ఎవరూ ఒంటరిగా పోరాడవద్దు’’: సమష్టి చర్యకు ఉపరాష్ట్రపతి పిలుపు
క్యాన్సర్ నుంచి కోలుకున్న వారి గాథలు సమాజంలో కొత్త ఆశలు, ధైర్యాన్ని నింపుతాయి: ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
25 APR 2026 12:25PM by PIB Hyderabad
నేడు జైపూర్‌లోని భగవాన్ మహావీర్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 23వ క్యాన్సర్ విజేతల దినోత్సవం వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. క్యాన్సర్ విజేతల దినోత్సవం అనేది కేవలం ఒక రోజు కాదని, అది అచంచలమైన ఆశకు, మానవ స్ఫూర్తి అసాధారణ ధైర్యానికి నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన భగవాన్ మహావీర్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం, కేజీ కొఠారి మెమోరియల్ ట్రస్టు ప్రతినిధులను ఆయన అభినందించారు. 1997లో ప్రారంభమైన నాటి నుంచి ఈ ఆసుపత్రి క్యాన్సర్ సంరక్షణలో అందిస్తున్న ఆదర్శప్రాయమైన సేవలను ఆయన గుర్తు చేశారు. అంకితభావంతో, మానవీయ కోణంలో చికిత్స అందిస్తూ ఈ సంస్థ ఎందరో బాధితుల జీవితాల్లో వెలుగులు నింపిందని ప్రశంసించారు.
దేశంలో క్యాన్సర్ వ్యాధి విస్తరిస్తున్న తీరుపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీఎంఆర్ జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ గణంకాల ప్రకారం.. దేశంలో ప్రతి ఏటా సుమారు 15 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో క్యాన్సర్ నివారణ, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, అత్యాధునిక చికిత్స, రోగుల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పటిష్టమైన చర్యలు, కార్యక్రమాలు ప్రారంభించిందని ఉపరాష్ట్రపతి చెప్పారు.
ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద ఇప్పటి వరకు సుమారు రూ.13,000 కోట్లకు పైగా వ్యయంతో 68 లక్షల మందికి పైగా క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించినట్లు ఉపరాష్ట్రపతి వెల్లడించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో దాదాపు 75 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారని, ఆరోగ్య సేవల్లో ఉన్న అంతరాలను తొలగించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు.
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, ఇప్పటికే 450కి పైగా కేంద్రాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు, జిల్లా ఉప-విభాగ ఆసుపత్రులలో నిత్యావసర ఔషధాల జాబితాలో క్యాన్సర్ నిరోధక మందులను చేర్చడం వంటి జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపట్టిన కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు.
వ్యాధి నివారణ చర్యల ప్రాధాన్యతను వివరిస్తూ.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టేందుకు ఈ ఏడాది ప్రారంభించిన దేశవ్యాప్త హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధకృష్ణన్ ప్రస్తావించారు. సుమారు కోటి మంది బాలికలకు ఈ టీకాని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ దిశగా విశేష కృషి చేస్తున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను, రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ చికిత్స సంస్థల మధ్య బలమైన సమన్వయం, పరస్పర అభ్యాసం అవసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. క్యాన్సర్ సంరక్షణలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక పురోగతిని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నింటిలోనూ పరస్పరం పంచుకోవాలని ఆయన సూచించారు. తద్వారా మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు, నాణ్యమైన చికిత్స అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. సంస్థల మధ్య మరింత సహకారం, అవగాహన క్యాన్సర్‌పై దేశం చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
ధూమపానం, పొగాకు వాడకం, మాదకద్రవ్యాల వినియోగం, అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ అలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై నిరంతరం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో జీవనశైలి మార్పులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
క్యాన్సర్ నుంచి కోలుకున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ..వారి అసాధారణమైన పట్టుదల, సంకల్పం కలిగిన ‘యోధులు’గా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. వారి పోరాట ప్రయాణం ఇతరులకు ఆశాకిరణంలా నిలుస్తుందని ప్రశంసించారు. అంకితభావంతో, కరుణతో నిరంతరం సేవలు అందిస్తున్న వైద్యులకు, సంరక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
భగవాన్ మహావీర్ క్యాన్సర్ ఆసుపత్రి చేపడుతున్న విస్తృతమైన సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. వ్యాధిని ముందస్తుగా గుర్తించి ప్రాణాలను కాపాడటంలో ఆసుపత్రి నిర్వహిస్తున్న స్క్రీనింగ్ ప్రచారాలు, మొబైల్ వైద్య విభాగాలు, వీధి నాటకాలు, విద్యా సంబంధిత ఉపన్యాసాలు, కమ్యూనిటీ క్యాంపులు వంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని కొనియాడారు.
క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి తొలిస్థాయిలోనే వ్యాధిని గుర్తించాలనీ, క్యాన్సర్‌తో ఎవరూ ఒంటరిగా పోరాడకుండా సమష్టి ప్రయత్నాలు జరగాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. క్యాన్సర్ విజేతల గాథల నుంచి ప్రజలు స్ఫూర్తి పొందాలని కోరారు. భయంపై ఆశ విజయం సాధించే సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా క్యాన్సర్‌ను జయించిన పలువురు విజేతలను ఉపరాష్ట్రపతి ఘనంగా సన్మానించారు. వారి అసాధారణ ధైర్యాన్ని, పట్టుదలను గుర్తించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభౌ కిషన్‌రావ్ బాగ్డే, రాజస్థాన్ వైద్య మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ ఖిమ్సర్, భగవాన్ మహావీర్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ శ్రీ నవరతన్ కొఠారి ఇతర అతిథులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2255641)
आगंतुक पटल : 58