భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. .వడగాలులపై సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసిన ఐఎండీ


వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారత్‌లో వడగాలులు వీచే అవకాశం: ఐఎండీ

అప్రమత్తంగా ఉంటూ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పౌరులకు సూచన..

ఆన్‌లైన్‌లో అందుబాటులో వివరణాత్మక మార్గదర్శకాలు

నాడు పోస్టు చేయడమైనది: 25 APR 2026 2:24PM by PIB Hyderabad

దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్న వేడిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత వాతావరణ శాఖ  వడగాలులపై వివరణాత్మక మార్గదర్శకాలను, సూచనలను జారీ చేసింది.

 

తాజా అంచనాల ప్రకారం.. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారత్‌లోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోందని సూచిస్తోంది.

 

రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరప్రాంతాలు, తూర్పు రాష్ట్రాలలో ఉక్కపోతతో కూడిన వేడి, తేమ పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది. ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రులు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. దీనివల్ల ప్రజలు మరింత అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది.

 

వాయువ్య భారత్‌లో ఏప్రిల్ 27 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, మధ్య భారత్, ఇతర ప్రాంతాలలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి, ఆ తర్వాత తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.

 

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పౌరుల కోసం సమగ్రమైన భద్రతా మార్గదర్శకాలను ఐఎండీ జారీ చేసింది. పౌరులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వీటిలో ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎక్కువ సేపు నేరుగా సూర్యరశ్మి తగలకుండా ఉండటం, తగినంత నీరు తాగడం, తేలికపాటి, గాలి ఆడే, లేత రంగు దుస్తులు ధరించడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో శ్రమతో కూడిన బహిరంగ పనులకు దూరంగా ఉండటం వంటివి ఉన్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎండ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

ముందస్తు అవగాహన, నివారణ చర్యల ద్వారా వడదెబ్బ, వేడి వల్ల కలిగే తీవ్ర అలసట వంటి ప్రమాదాలను తగ్గించవచ్చని ఐఎండీ తెలిపింది. రాబోయే 7 రోజుల పాటు పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ కింది ప్రాంతాల్లో వడగాలులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

·                 వాయువ్య భారత్‌ (పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్)

·                 మధ్య భారత్‌ (మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ)

·                 పలు దక్షిణ ప్రాంతాలు (కేరళ, మాహె)

ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి తీరప్రాంత రాష్ట్రాల్లో ఉక్కపోత, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర భారత మైదాన ప్రాంతాల్లో రాత్రిపూట కూడా వేడి వాతావరణం కొనసాగవచ్చని, దీనివల్ల రాత్రి సమయాల్లో కూడా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.

 

ఐఎండీ విడుదల చేసిన ఏప్రిల్ నుంచి జూన్ వరకు గల ముందస్తు అంచనాల ప్రకారం.. తూర్పు, మధ్య, వాయువ్య భారత్‌తో పాటు ఆగ్నేయ ద్వీపకల్పంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలుల వీచే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ వేసవి కాలాన్ని తట్టుకోవడానికి ముందస్తు సన్నద్ధత, నివారణ చర్యలు అత్యవసరమని అధికారులు తెలిపారు.

 

వడగాలుల సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, వివిధ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సూచనలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఐఎండీ తన అధికారిక వెబ్‌సైట్‌లో   https://mausam.imd.gov.in/ అందుబాటులో ఉంచింది. ఆరోగ్య ప్రమాదాలను తగ్గించుకోవడానికి, తీవ్రమైన ఎండలను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడానికి వ్యక్తులు, సమాజాలు, స్థానిక యంత్రాంగాలకు ఈ మార్గదర్శకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

 

వాతావరణ శాఖ నిరంతరం ఉష్ణోగ్రత మార్పులను పర్యవేక్షిస్తూ, సమయానుకూలంగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రజలు అధికారిక వనరుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ, సూచించిన భద్రతా చర్యలను ఖచ్చితంగా పాటించాలని ఐఎండీ కోరింది.

***


(రిలీజ్ ఐడి: 2255636) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati