ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

38వ సెబీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రసంగం


ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా సైబర్ భద్రతా చర్యలను మెరుగుపరుస్తూ సెబీ సహా అన్ని నియంత్రిత సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు

ప్రతి ప్రధాన వేదికపై ప్రాంతీయ భాషల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని సెబీకి సూచన

సెబీ దేశవ్యాప్త పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమం 'మిషన్ జాగరూక్'నూ ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి

నమోదుకాని 'ఫిన్‌ఫ్లూయెన్సర్ల'పై సెబీ చర్యలను అభినందించిన ఆర్థిక మంత్రి

బాధ్యతాయుత ఆర్థిక అవగాహన కోసం విధాన ప్రణాళికల రూపకల్పనకు పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 25 APR 2026 2:42PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఈ రోజు ముంబయిలో జరిగిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 38వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేశారు.

సెబీ దేశవ్యాప్త పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమం 'మిషన్ జాగరూక్'నూ ఈ సందర్భంగా శ్రీమతి సీతారామన్ డిజిటల్‌గా ప్రారంభించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ... కొత్తగా తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సెబీ సిద్ధంగా ఉండాలని కోరారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లేనని ఆమె పేర్కొన్నారు. ఒక ప్రధాన ఎక్స్‌ఛేంజ్, డిపాజిటరీ, క్లియరింగ్ కార్పొరేషన్, పెద్ద బ్రోకర్‌పై జరిగే ఒక్క విజయవంతమైన సైబర్‌దాడి... జాతీయ స్థాయిలో మార్కెట్లను అస్తవ్యస్తం చేయగలదని, మదుపరుల సంపదను తుడిచిపెట్టగలదని అన్నారు. అలాంటి ఘటనలతో కోల్పోయిన ప్రజల విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి సంవత్సరాలు పట్టవచ్చని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు. ఏఐ ఆధారిత సాధనాలు సైబర్‌దాడులను వేగవంతంగా, మరింత అనుకూలంగా, విస్తరించగలిగేలా, కొన్ని సందర్భాల్లో అమలులో మరింత స్వయంప్రతిపత్తితో ఉండేలా చేస్తున్నాయని ఆమె అన్నారు. ఈ ప్రమాదాలు అనేక రూపాల్లో ఉండవచ్చని ఆమె తెలిపారు. సిస్టమ్ బలహీనతలను స్వయంచాలకంగా కనుగొనడం, హానికరమైన సోర్స్-కోడ్ ప్రమేయం, సాఫ్ట్‌వేర్ సరఫరా గొలుసులను లక్ష్యంగా చేసుకున్న దాడులు, గుర్తింపును తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు పరిణామం చెందగల సమన్వయ చొరబాట్లు ముఖ్య ప్రమాదాలని శ్రీమతి సీతారామన్ వివరించారు. "అందువల్ల, కేవలం సెబీ మాత్రమే కాకుండా, అన్ని నియంత్రిత సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. దాడి చేసే సాధనాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రక్షణ సాధనాలు అంతకంటే వేగంగా అభివృద్ధి చెందాలి" అని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు.

సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరిగిన పరిస్థితుల్లో సోషల్ మీడియాలో నకిలీ పెట్టుబడి వీడియోలు, యాప్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, వాటిలో చాలా వరకూ ప్రముఖులను అనుకరిస్తూ డీప్‌ఫేక్ ఏఐని ఉపయోగిస్తున్నాయనీ కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

ఏప్రిల్ 2025లో అమల్లోకి వచ్చిన సైబర్ సెక్యూరిటీ-సైబర్ రెసిలెన్స్ విధాన ప్రణాళిక ద్వారా ఈ విషయంగా సెబీ ప్రశంసనీయ కృషి చేసిందని ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్ అన్నారు. ఇది ఒక పటిష్ఠ పునాది... దీనిపై మరింత కృషి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

సంక్లిష్టమైన మార్కెట్ అవకతవకల నమూనాలను, నెట్‌వర్క్ ఆధారిత మోసాలను గుర్తించడానికి సెబీ డేటా అనలిటిక్స్-డిజిటల్ ఫోరెన్సిక్స్ ప్రయోగశాల అధునాతన విశ్లేషణలు, ఏఐ, ఎంఎల్ నమూనాలను ఉపయోగిస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. డబ్బు బదిలీ చేయడానికి ముందు, నమోదిత మధ్యవర్తుల చెల్లింపు వివరాలను పెట్టుబడిదారులు ధ్రువీకరించుకోవడానికి వీలు కల్పించే “సెబీ చెక్”ను ప్రవేశపెట్టిన సెబీని శ్రీమతి సీతారామన్ ప్రశంసించారు. "ఇవి ముఖ్యమైన చర్యలు. వీటిని గురించి అత్యవసరంగా, విస్తృతంగా అవగాహన కల్పించాలి" అని ఆమె అన్నారు. ప్రభుత్వ అధికారులమని చెప్పుకునే మోసపూరిత కంటెంట్‌పై వేగవంతమైన తొలగింపు యంత్రాంగాల ద్వారా, ప్రాంతీయ భాషల్లో ప్రతి ప్రధాన వేదికపై విస్తృత ప్రచారాలను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడానికి సెబీ భారీగా పెట్టుబడి పెట్టాలని ఆమె కోరారు. 

ఆర్థిక సామర్థ్యానికి, సమర్థ పాలనకు సౌమ్యమైన నియంత్రణ విధానం, ప్రజా సంప్రదింపులు అత్యవసరమని ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్ అన్నారు. అతి వివరాలతో కూడిన నియమావళికి బదులుగా, సాధ్యమైనంత వరకు సూత్రాల ఆధారిత నియంత్రణను ప్రోత్సహించాలని సూచించారు. నిబంధనల పాటింపు నాణ్యతను, సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి నియంత్రణ ప్రక్రియలో ప్రజా సంప్రదింపులను ఏకీకృతం చేస్తామని కేంద్ర బడ్జెట్ 2023లో స్పష్టంగా పేర్కొన్నట్లు ఆర్థిక మంత్రి గుర్తు చేశారు.

ప్రజాభిప్రాయాలను కోరడంతో పాటు కమిటీలు, మార్కెట్ భాగస్వాములతో సంప్రదింపులు జరపడం వంటి సంప్రదింపుల మార్గాన్ని సెబీ అనుసరించడం అభినందనీయమని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ, "మన పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, మన ఇష్యూయర్‌లు అంతర్జాతీయ మూలధన నిధులను సమీకరిస్తున్నారు. ఒక ప్రధాన అధికార పరిధిలోని నియంత్రణపరమైన పరిణామాలు దాని సరిహద్దులకు ఆవలా మార్కెట్ పద్ధతులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి"... అందుకే నియంత్రణపరమైన సంభాషణలు కేవలం దేశీయంగానే ఉండిపోకూడదని అన్నారు.

ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు విశ్వసనీయంగా, సదా అందుబాటులో ఉండేలా, సకాలంలో పరిష్కారాలు అందించేలా ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. మార్కెట్లపై విశ్వాసం కేవలం రాబడులపైనే కాకుండా, జరిగిన తప్పులను నిష్పక్షపాతంగా పరిష్కరిస్తారనే హామీపైనా ఆధారపడి ఉంటుందని పేర్కొంటూ... లైసెన్స్ లేని ఆర్థిక సలహాలను నియంత్రణ సంస్థ ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో తెలియజేసేలా, నమోదుకాని "ఫిన్-ఫ్లూయెన్సర్ల"పై సెబీ తీసుకున్న చర్యలను శ్రీమతి సీతారామన్ ప్రశంసించారు. "బాధ్యతాయుతమైన ఆర్థిక అవగాహన కోసం మనకు సహాయక విధాన ప్రణాళికలు అవసరం. అయితే వ్యక్తిగత సంపద కోసం అవగాహన లేని రిటైల్ పెట్టుబడిదారులు నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడాన్ని మనం సహించకూడదు" అని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు.

క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను తగ్గించడానికి, దాని గురించి మరింత అవగాహన కల్పించడానికి ఐఈపీఎఫ్ఏ, మార్కెట్ సంస్థలతో కలిసి సెబీ అనేక ఉమ్మడి ‘నివేశక్ శిబిర్’ కార్యక్రమాలను నిర్వహించిందని ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్ ప్రశంసించారు.

భారత సెక్యూరిటీల మార్కెట్ అంతటా ఉమ్మడి కేవైసీ నిబంధనలను నిర్దేశించడం, కేవైసీ ప్రక్రియలను సరళీకరించడం, డిజిటలైజ్ చేయడంలో సెబీ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి కోరారు. "ఈ రంగంలో నాయకత్వం వహించడానికి సెబీకి పెట్టుబడిదారుల భాగస్వామ్య స్థాయి, బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, తోటి నియంత్రణ సంస్థలతో సంస్థాగతమైన విశ్వసనీయత ఉన్నాయి" అని ఆమె అన్నారు.

సంవత్సరాలుగా సెబీ చేపట్టిన నిరంతర సంస్కరణల ప్రయాణం గురించి చైర్మన్ శ్రీ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ... స్క్రీన్-ఆధారిత ట్రేడింగ్‌కు మారడం, డీమెటీరియలైజేషన్‌ను ప్రవేశపెట్టడం, రోలింగ్ సెటిల్‌మెంట్‌లకు వెళ్లడం, కార్పొరేట్ పాలనను బలోపేతం చేయడం, పటిష్ఠమైన రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను నిర్మించడం వంటి అనేక ప్రాథమిక సంస్కరణలకు సెబీ నాయకత్వం వహించిందన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నేటి వరకు దేశంలో 5,900కు పైగా లిస్టెడ్ కంపెనీలు, 14 కోట్లకు పైగా ప్రత్యేక పెట్టుబడిదారులు ఉన్నారు. గత దశాబ్ద కాలంలో, మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 15 శాతం సీఏజీఆర్ చొప్పున వృద్ధి చెందింది. మ్యూచువల్ ఫండ్ ఆస్తులు ఏటా 20 శాతానికి పైగా విస్తరించాయి. కార్పొరేట్ బాండ్ మార్కెట్ తన స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. ప్రతి సంవత్సరం, ప్రైమరీ మార్కెట్ దాదాపు రూ. 10 ట్రిలియన్ల మూలధన సమీకరణకు వీలు కల్పిస్తోంది. వ్యాపారం సులభతరం చేయడానికి-నిబంధనలను సరళీకరించడం, ఆప్టిమైజ్ చేయడానికి-అస్పష్టతలను తొలగించడం, సమస్యలను పరిష్కరించడానికి-మూలధన సమీకరణకు వీలు కల్పించడం వంటి విస్తృత శ్రేణి సంస్కరణలను ప్రవేశపెట్టడానికి గత సంవత్సర కాలంలో సెబీ అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపింది.

 

***


(రిలీజ్ ఐడి: 2255525) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Gujarati , Kannada