పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
· ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా దాడులు నిర్వహించి 66,000 కంటే ఎక్కువ సిలిండర్లను స్వాధీనం
చేసుకున్న అధికారులు
·
MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా ఇప్పటివరకు ఎల్‌పీజీ కనెక్షన్ వదులుకున్న 41,000 మంది పీఎన్‌జీ వినియోగదారులు
·
2026 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 17 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల విక్రయం
·
హోర్ముజ్ జలసంధిలో విదేశీ జెండాలు కలిగిన నౌకలపై జరిగిన
కాల్పుల ఘటనల్లో చిక్కుకున్న భారతీయ నావికులు... ఆ రెండు నౌకల్లో ఉన్న భారతీయ
నావికులంతా సురక్షితం
·
గల్ఫ్ ప్రాంతంలోని వివిధ చోట్ల నుంచి గత 24 గంటల్లో ఇక్కడకు వచ్చిన 65 మందితో కలిపి ఇప్పటివరకు
సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న 2,680 మందికి పైగా భారతీయ నావికులు
· అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజ
భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడానికి
ప్రత్యేక కృషి చేస్తోన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2026 6:09PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ప్రజలను అప్రమత్తం చేసే చర్యలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తున్న సహాయం, కీలక రంగాల్లో స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.
ఇంధన సరఫరా, లభ్యత
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా లభ్యమయ్యేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ.. ఇంధన సరఫరా విషయంలో ప్రస్తుత పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించింది. మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాలు:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
· పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.
· వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.
· ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.
· పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
· ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్‌పీజీ, గృహావసరాల పీఎన్‌జీ, రవాణా సీఎన్‌జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
· వాణిజ్య ఎల్‌పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.
· ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.
· ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
· చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
· గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
· పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.
· కేంద్రం ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
o ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
o సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
o జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
o సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్‌కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o పీఎన్‌జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
o ఎల్‌పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
· అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.
· ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పత్రికా ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· ఎల్‌పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 2400 కంటే ఎక్కువ దాడులు నిర్వహించి 285 సిలిండర్లను సీజ్ చేశారు.
· ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 1.5 లక్షలకు పైగా దాడులు నిర్వహించి 66,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 1100కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 255 మందిని అరెస్టు చేశారు.
· ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. అవి నిన్నటివరకు 298 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లకు జరిమానాలు విధించటంతో పాటు 70 మంది డీలర్లను సస్పెండ్ చేశాయి.
ఎల్‌పీజీ సరఫరా
గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్‌పీజీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.
· ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
· నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు 98 శాతానికి పెరిగాయి.
· సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 94 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు డీఏసీ వస్తుంది.
· గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్లు 22.04.26న 52 లక్షలకు పైగా పంపిణీ అయ్యాయి.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
· మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
· కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ) సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని ప్రతి రాష్ట్రంలోనూ రెట్టింపు చేస్తున్నట్లు తెలియజేసింది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి. వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల సహకారంతో కేవలం ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.
· 2026 ఏప్రిల్ 1 నుంచి 17 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· నిన్న, దేశవ్యాప్తంగా 86,000కు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· 2026 ఏప్రిల్ 3 నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఓఎంసీ) 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై సుమారు 8200 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 1,27,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· నిన్న సుమారు 320 శిబిరాల ద్వారా 7877 ఐదు కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
· 2026 ఏప్రిల్‌లో (22.04.2026 వరకు) మొత్తం 1,40,362 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (73.87 లక్షలకు పైగా 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్లకు సమానం) విక్రయమైంది.
· 22.04.2026న 8483 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీని (4.46 లక్షలకు పైగా 19 కేజీల సిలిండర్లకు సమానం) విక్రయించారు.
సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు
డీ-పీఎన్‌జీ, సీఎన్‌జీ-రవాణాకు 100 శాతం సరఫరాలను కేటాయించడం ద్వారా వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఎరువుల కర్మాగారాలకు కేటాయించే మొత్తం గ్యాస్ పరిమాణాన్ని, వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.
అదనంగా, సీజీడీ నెట్‌వర్క్‌ల ద్వారా సరఫరాలు సహా... ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడం కోసం సీజీడీ సంస్థలు తమ అన్ని జిఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించాయి.
ఏజీఎల్, ఎమ్‌జీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ సహా సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
సీజీడీ నెట్‌వర్క్‌ల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మారే దీర్ఘకాలిక పరివర్తనలో సహకరించే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును భారత ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 తేదీ గల లేఖ ద్వారా... సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాసెస్ చేయడం కోసం 'తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధాన ప్రణాళిక'ను 3 నెలల పాటు ప్రత్యేకంగా అమలు చేస్తున్నది.
నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్‌లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం, నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026ను భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ గల గెజిట్ ద్వారా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లు వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన ప్రణాళికను అందిస్తుంది. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేస్తూ భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
డీ-పీఎన్‌జీ కనెక్షన్ల మంజూరును వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది. పీఎన్‌జీ విస్తరణలో ప్రస్తుత ఊపును కొనసాగించేందుకు గానూ 'జాతీయ పీఎన్‌జీ డ్రైవ్ 2.0' గడువును 30.06.2026 వరకు పొడిగించారు.
పరిశుద్ధమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధాన నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధానంగా పనిచేయడానికి ఉద్దేశించినది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు, వాణిజ్య ఎల్‌పీజీ అదనపు కేటాయింపుల కోసం తదుపరి విడతలో ప్రాధాన్యత ఇస్తున్నారు.
సీజీడీ నెట్‌వర్క్, మౌలిక సదుపాయాలకు సంబంధించి 'స్థాపన అనుమతి' గానీ, 'నిర్వహణ అనుమతి' గానీ మంజూరు చేసేందుకు అవసరమైన ఆదేశాలను ఎస్‌పీసీబీ, పీసీసీలకు 15 రోజుల్లోపు జారీ చేయాలని ఎమ్‌వోఈఎఫ్‌సీసీ తేది 07.04.2026 నాటి ఉత్తర్వుల ద్వారా సీపీసీబీని ఆదేశించింది.
మార్చి 2026 నుంచి, సుమారు 5.18 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించారు. అదనంగా 2.58 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 7.76 లక్షలకు చేరింది. కొత్త కనెక్షన్ల కోసం సుమారు 5.87 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
21.04.2026 నాటికి, 41,000 మందికి పైగా పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్‌లను రద్దు చేసుకున్నారు.
ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు
అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలు కలిగి ఉండి, పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలూ తగిన స్థాయిలో నిర్వహిస్తున్నారు.
గృహాల వినియోగానికి మద్దతుగా, రిఫైనరీల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.
దేశీయ మార్కెట్‌కు పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడానికి ఒక అంతర్-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గం ఏర్పాటు చేశారు. పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లతో సహా ఆయిల్ రిఫైనరీ కంపెనీలను... సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ధారించిన విధంగా కీలక రంగాలకు సీ3, సీ4 స్ట్రీమ్‌ల నిర్దిష్ట కనీస పరిమాణాలను అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం 01.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా అనుమతించింది.
ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, పెట్రో రసాయనాల శాఖ... పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ నుంచి అందిన అభ్యర్థనల ఆధారంగా ఫార్మా, రసాయన రంగ సంస్థల కోసం ఎల్‌పీజీ పూల్ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల కేటాయింపులకు వీలు కల్పించింది.
2026 ఏప్రిల్ 9 నుంచి ముంబయి, కొచ్చి, మధుర రిఫైనరీలు రసాయన, ఫార్మా పరిశ్రమలకు 6,300 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపిలీన్‌ను విక్రయించాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల సంబంధిత చర్యలు
దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ విక్రయ కేంద్రాలు సాధారణంగా పనిచేస్తున్నాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. వినియోగదారులను అధిక ధరల భారం నుంచి రక్షించేందుకు భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
దేశీయ మార్కెట్‌లో ఈ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడం కోసం భారత ప్రభుత్వం 11.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 55.50కి, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 42కి పెంచింది.
పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల రిటైల్ అవుట్‌లెట్‌లలో ధరల పెంపు ఏదీ లేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు చేస్తున్నారు.
18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లదాఖ్‌లు తమకు ఎటువంటి అవసరం లేదని సూచించాయి.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న సముద్ర పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను అందించింది. కింది సమాచారం తెలియజేసింది:
గత 24 గంటల్లో, హార్మూజ్ జలసంధిలో విదేశీ జెండాలతో ప్రయాణిస్తున్న నౌకలపై కాల్పులు జరిగినట్లు కొన్ని ఘటనలు నమోదయ్యాయి. వీటిలో భారతీయ నావికులూ ఉన్నారు. ఆ రెండు నౌకల్లోని నావికులందరూ క్షేమంగా ఉన్నారు.
పనామా జెండా కలిగిన 'యూఫోరియా' అనే కంటైనర్ నౌకలో 21 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారంతా క్షేమంగా ఉన్నారు.
పనామా జెండా కలిగిన 'ఎపమినోండాస్' అనే కంటైనర్ నౌకలో ఒక భారతీయ నావికుడు ఉన్నారు. ఆయన క్షేమంగా ఉన్నారు.
ఆ ప్రాంతంలోని భారతీయ నావికులంతా సురక్షితంగా ఉన్నారు.
భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్ గల 'దేశ్ గరిమ' నౌక 2026 ఏప్రిల్ 18న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. 31 మంది భారతీయ నావికులను తీసుకువెళ్తున్న ఈ నౌక, 2026 ఏప్రిల్ 22న ముంబయికి చేరుకుంది.
నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడం కోసం ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తోంది.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ తాజా సమాచారం... ఈ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి 7,403 కాల్‌లు, 15,639కి పైగా ఈమెయిళ్లను నిర్వహించింది. గత 24 గంటల్లో 161 కాల్‌లు, 320 ఈమెయిళ్లు అందాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ద్వారా ఇప్పటివరకు 2,680 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడాన్ని మంత్రిత్వ శాఖ సులభతరం చేసింది. వీరిలో గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో వచ్చిన 65 మందీ ఉన్నారు.
ఓడరేవు కార్యకలాపాలు: దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, క్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. కింది సమాచారాన్ని తెలియజేసింది:
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తున్నాయి. భారతీయ మిషన్లతో సమన్వయం కొనసాగిస్తూ పనిచేస్తున్నాయి.
సమాచారాన్ని పంచుకోవడం, కృషిలో మెరుగైన సమన్వయం కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
భారతీయ దౌత్య కార్యాలయాలు, కేంద్రాలు నిరంతరాయంగా పనిచేసే హెల్ప్‌లైన్‌లను కొనసాగిస్తూ, భారతీయ పౌరులకు చురుగ్గా సహాయం అందిస్తున్నాయి. అవి స్థానిక ప్రభుత్వాలతో సన్నిహిత సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి.
స్థానిక ప్రభుత్వాల మార్గదర్శకాలు... విమాన, ప్రయాణ పరిస్థితులు... కాన్సులర్ సేవలు... మన పౌరులకు మద్దతుగా చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యల గురించిన సమాచారం సహా, ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.
భారతీయ మిషన్లు స్థానిక భారతీయ పౌరులతో చురుగ్గా మమేకమవుతున్నాయి. రాయబారులు వారి సమస్యలను పరిష్కరించడానికి భారతీయ కమ్యూనిటీ సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన నిపుణుల బృందాలు, భారతీయ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. స్థానిక అధికారులు, సంస్థలతో సమన్వయం చేసుకోవడం... కాన్సులర్ సహాయం అందించడం... భారత్‌కు తిరిగి రావాలనే అభ్యర్థనల విషయంలో సహకరించడం వంటి అన్ని రకాల సహాయాన్ని భారతీయ దౌత్య కార్యాలయాలు వారికి అందిస్తున్నాయి.
ఈ ప్రాంతం నుంచి దేశంలోని వివిధ గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో... మొత్తం విమాన ప్రయాణ పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది. ఫిబ్రవరి 28 నుంచి సుమారు 12,12,000 మంది ప్రయాణికులు ఈ ప్రాంతం నుంచి భారత్‌కు ప్రయాణించారు.
యూఏఈలో... విమానయాన సంస్థలు కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా యూఏఈ- భారత్ మధ్య పరిమిత వాణిజ్య విమానాలను నడపడం కొనసాగిస్తున్నాయి. ఈ రోజు యూఏఈ- భారత్ మధ్య సుమారు 110 విమానాలు నడుస్తాయని అంచనా.
సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో... ఖతార్ ఎయిర్‌వేస్ భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.
కువైట్ గగనతలం మూసి ఉంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్, సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.
బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.
ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటిని భారత్‌కు తిరిగి వచ్చే ప్రయాణం కోసం వినియోగించుకోవచ్చు.
ఇరాన్ గగనతలం సరుకు రవాణా, చార్టర్డ్ విమానాల కోసం పాక్షికంగా తెరిచి ఉంది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం... భారత పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు అర్మేనియా, అజర్‌బైజాన్‌ల ద్వారా ప్రయాణించుటను సులభతరం చేస్తూనే ఉంది. ఇప్పటివరకు, 2428 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్‌బైజాన్‌లకు తరలివెళ్లారు. వీరిలో 1096 మంది భారతీయ విద్యార్థులు, 657 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు.
ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఆ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. వీటిని భారత్‌కు తిరిగి వచ్చే ప్రయాణం కోసం వినియోగించుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2255026)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam