నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
భారత్ 6.1 గిగావాట్ల పవన ఇంధన అదనపు ఉత్పత్తి 2025-26లో చరిత్ర...: నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి
2030 కల్లా 100 గిగావాట్ల పవన ఇంధన సామర్థ్యంతో పాటు 2036 కల్లా 156 గిగావాట్ల ఉత్పాదకతే ప్రభుత్వ లక్ష్యం: శ్రీ ప్రహ్లాద్ జోషీ
విధాన సంస్కరణలు, పరిశ్రమ మద్దతుతో ప్రపంచంలో పవన ఇంధన తయారీ కూడలిగా పటిష్ఠ స్థితికి చేరుకోనున్న భారత్: శ్రీ జోషీ
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 6:46PM by PIB Hyderabad
విండ్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐపీపీఏ) స్థాపక దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ ప్రసంగిస్తూ, పవన ఇంధన రంగంలో భారత్ చెప్పుకోదగిన ప్రగతిని సాధించినట్లు తెలిపారు. స్వచ్ఛ ఇంధన వినియోగం దిశగా దేశం వేగంగా పయనించేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.
పవన ఇంధన సామర్థ్యాన్ని పెంచుకొనే విషయంలో భారత్ ఇప్పటి వరకూ తన అతి శ్రేష్ఠమైన పనితీరును కనబరిచిందని శ్రీ జోషీ తెలిపారు. ఈ క్రమంలో 2025-26లో చరిత్రాత్మక రీతిలో 6.1 గిగావాట్ల (జీడబ్ల్యూ) సామర్థ్యాన్ని జోడించారని ఆయన వివరించారు. పవన ఇంధన రంగంలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచిందనీ, దీని స్థాపక సామర్థ్యం 56.1 జీడబ్ల్యూకు మించిందనీ, మరో 28 గిగావాట్ల సామర్థ్యాన్ని జోడించే పనులు పురోగమిస్తున్నాయన్నారు.
పవన ఇంధన రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి చెబుతూ, 150 మీటర్ల ఎత్తులో భారత పవన ఇంధన సామర్థ్యం దాదాపుగా 1164 గిగావాట్లు (జీడబ్ల్యూ)గా ఉండవచ్చని అంచనా వేశారన్నారు. నిరంతర ప్రయత్నాలతో, దేశం 2030 కల్లా 100 గిగావాట్లనూ, 2036కల్లా 156 గిగావాట్ల పవన ఇంధన ఉత్పాదకత సామర్థ్యాన్ని చేజిక్కించునకోగలదనీ, ఇది 2070 నాటికి నెట్-జీరో లక్ష్యాన్ని సాధించడంలో గొప్ప తోడ్పాటును అందించగలుగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
భారత ఇంధన వ్యవస్థను స్థిరీకరించడంలో పవన ఇంధనం ఒక కీలక పాత్రను పోషిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా సాయంత్రం పూటా, రాత్రుళ్లూ ఉత్పాదకత బాగా ఎక్కువగా ఉంటోందని తెలిపారు. దేశంలో విద్యుత్తుకు గిరాకీ అధికంగా ఉండేది కూడా ఈ సమయాలే. గిరాకీ అత్యంత అధికంగా ఉన్న కాలంలోనే పవన ఇంధన ఉత్పాదకతలో దాదాపు 45 శాతం ఉత్పాదకత నమోదు అవుతోందనీ, ఈ అంశం దీనిని (పవన ఇంధనాన్ని) సౌర ఇంధనానికొక కీలకమైన పూరక ఇంధన వనరుగా మారుస్తోందన్నారు.
విధానపరమైన ఆలోచనలను శ్రీ జోషీ వివరిస్తూ, డిమాండు నిరంతరంగా ఉండేటట్లు చూడడానికి ‘పునరుత్పాదక కొనుగోలు బాధ్యతల’లో భాగంగా ఒక ప్రత్యేక ‘పవన ఇంధన విభాగాన్ని’ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ‘ఆలస్య చెల్లింపునకు సర్‌చార్జీ’ నియమావళిని అమలు చేయడం, పారదర్శకతతో కూడిన వేలానికి సంబంధించిన మార్గదర్శకాలు, వీటితో పాటు మోడళ్లు, తయారీదారు సంస్థల ఆమోదిత జాబితా (అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మాన్యుఫాక్చరర్స్.. ఏఎల్ఎమ్ఎమ్)ను అమల్లోకి తీసుకురావడం వంటి ఆలోచనలతో పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తున్నాయనీ, దేశీయ తయారీకి ప్రోత్సాహం లభిస్తోందనీ ఆయన వివరించారు.
భారత్ 24 గిగావాట్ల కన్నా ఎక్కువ వార్షిక సామర్థ్యం కలిగిన పటిష్ఠ స్వదేశీ తయారీ అనుబంధ విస్తారిత వ్యవస్థను అభివృద్ధి చేసిందనీ, దీనిలో స్వదేశీకరణ స్థాయి 70 నుంచి 80 శాతం స్థాయికి చేరుకొందనీ మంత్రి తెలిపారు. బ్లేడ్లు, టవర్లు, గేర్బాక్సులు, తదితర కీలక భాగాల (కాంపొనెంట్స్) కోసం ఒక బలమైన సరఫరా వ్యవస్థను కూడా భారత్ సమకూర్చుకొందన్నారు.
పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని గురించి మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అదనపు పవన ఇంధన టెండర్లను జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. దీంతో పాటు, గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచడానికి హైబ్రిడ్ పథకాల్నీ, 24 గంటలూ అమలయ్యే (రౌండ్ ది క్లాక్.. ఆర్టీసీ) పథకాల్నీ ప్రోత్సహిస్తోందని కూడా ఆయన తెలిపారు. డీవియేషన్ సెటిల్‌మెంట్ మెకానిజం (డీఎస్ఎమ్)కు సంబంధించిన జరిమానాలు, విద్యుత్తు కోత, సరఫరాలో జాప్యాల వంటి సమస్యలు పరిశీలనలో ఉన్నాయనీ, ఈ సమస్యలకు సమతౌల్య, ఆచరణీయ పరిష్కారాలను వెదకే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
పరిశ్రమలు నేరుగా పునరుత్పాదక విద్యుత్తును కొనుగోలు చేసేందుకు వీలుగా ‘గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్’ నియమాలు, పాత విండ్ టర్బైన్లను మళ్లీ బలోపేతం చేయడం, గ్రీన్ ఎనర్జీ కారిడార్లో భాగంగా సరఫరా సంబంధిత మౌలిక సదుపాయాల్ని విస్తరించడం వంటి కార్యక్రమాల్ని అమలుచేస్తున్నట్లు మంత్రి ప్రస్తావించారు.
బ్లెండెడ్ ఫైనాన్స్, రుణ పెంపు ప్రణాళికల వంటి వినూత్న యంత్రాంగాల ద్వారా దీర్ఘకాలిక ప్రాతిపదికన, తక్కువ ఖర్చుతో ధనాన్ని సమీకరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. ‘కాంట్రాక్ట్‌స్ ఫర్ డిఫరెన్స్’ (సీఎఫ్డీ) నమూనాలో భాగంగా ఇటీవలే మొదలుపెట్టిన 500 మెగావాట్ల పథకంతో ఆదాయంలో ఖచ్చితత్వం నెలకొనడంతో పాటు, మార్కెట్టు స్థిరత్వం కూడా మెరుగుపడగలదన్న అంచనాలు ఏర్పడ్డాయి.
మారుతున్న ప్రపంచ ముఖచిత్రం భారత్‌కు వ్యూహాత్మక అవకాశాన్ని ప్రసాదిస్తోందని శ్రీ జోషీ అభిప్రాయపడ్డారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొంటూ దేశం పవన ఇంధన రంగంలో నమ్మదగిన ప్రపంచ స్థాయి తయారీ, సరఫరా ప్రక్రియల భాగస్వామిగా పేరు తెచ్చుకోగలదనీ, ప్రత్యేకించి వివిధ దేశాలు తమ సరఫరా వ్యవస్థల్లో వైవిధ్యాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత కాలంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవచ్చనీ శ్రీ జోషీ వివరించారు.
పవన ఇంధన పరిశ్రమకు ఒక విశ్వసనీయ గొంతును అందిస్తున్న విండ్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐపీపీఏ)ను మంత్రి అభినందించారు. విధానపరమైన చర్చలను సాకారం చేయడంలో, క్షేత్ర సంబంధిత సవాళ్లను పరిష్కరించడంలో, భారత పునరుత్పాదక ఇంధన రంగ మహత్వాకాంక్షలకు మద్దతునివ్వడంలో ఈ సంఘం కీలక పాత్రను పోషించిందని ఆయన అన్నారు.
వచ్చే పదేళ్లలో 156 జీడబ్ల్యూ ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని మంత్రి తన ప్రసంగం ముగింపులో వ్యాఖ్యానించారు. విధాన రూపకల్పన పరంగా స్పష్టమైన దిశానిర్దేశం, బలమైన సంస్థాగత సహకారంతోపాటు పరిశ్రమ భాగస్వామ్యం ఈ లక్ష్య సాధనకు మద్దతును అందిస్తున్నాయని ఆయన చెప్పారు. విశ్వసనీయమైన, మన్నిక కలిగిన ఇంధన భవిష్యత్తును నిర్ధారించడానికి పవన, సౌర, నిల్వ సామర్థ్యాల మిశ్రణంతో ఏకీకృత హైబ్రిడ్ వ్యవస్థల రూపకల్పనపై దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ సంతోష్ సారంగీతో పాటు ఇతరులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2254858)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6