ప్రధాన మంత్రి కార్యాలయం
హైదరాబాద్‌లోని స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపసును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
· ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యం కలిగిన స్కైరూట్ మొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-Iను ఆవిష్కరించిన ప్రధాని
· ఆవిష్కరణలు, సవాళ్లను స్వీకరించే తత్వం, వ్యవస్థాపక సామర్థ్యంతో కొత్త శిఖరాలను చేరుతున్న మన యువశక్తి
· విశ్వసనీయత, సమర్థత, విలువల ద్వారా దశాబ్దాలుగా భారత అంతరిక్ష ప్రస్థానాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన ఇస్రో.. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్‌కు విశిష్ట గుర్తింపు
· గత ఆరేడు సంవత్సరాల్లోనే సార్వత్రిక, సహకార, ఆవిష్కరణాత్మక వ్యవస్థగా భారత అంతరిక్ష రంగం
· ప్రభుత్వం అంతరిక్ష రంగంలో అవకాశాలను తెరిచిన వేళ, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ముందుకొచ్చిన మన యువత.. అందులో ముందున్న జెన్-జీ యువతరం
· అంతరిక్ష రంగంలో ప్రపంచంలో కొన్ని దేశాలకే సొంతమైన సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి: ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
27 NOV 2025 12:30PM by PIB Hyderabad
తెలంగాణలోని హైదరాబాద్‌లో స్కైరూట్స్ ఇన్ఫినిటీ క్యాంపసును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశానుద్దేశించి ప్రసంగిస్తూ, అంతరిక్ష రంగంలో మునుపెన్నడూ లేనన్ని అవకాశాలు నేడు భారత్‌కు ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రైవేటు రంగం వేగంగా అభివృద్ధి చెందడంతో దేశంలో అంతరిక్ష రంగం విశేషంగా పురోగమించిందన్నారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్.. భారత్ కొత్త ఆలోచన, ఆవిష్కరణ, యువ శక్తులకు అద్దం పడుతోందన్నారు. దేశ యువత ఆవిష్కరణ, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, ఔత్సాహికత కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయంటూ ప్రశంసించారు. మున్ముందు ప్రపంచ ఉపగ్రహ ప్రయోగ వ్యవస్థలో భారత్ అగ్రగామిగా నిలవనున్న తీరును నేటి కార్యక్రమం ప్రతిబింబిస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. శ్రీ పవన్ కుమార్ చందన, శ్రీ నాగ భారత్ దాకాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది యువ అంతరిక్ష ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వీరిద్దరూ స్ఫూర్తిదాయకమన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకుపోతూ, సవాళ్లను ఎదుర్కొనేందుకు వారు వెనుకాడకపోవడం వల్లే.. నేడు దేశం మొత్తం వారిని, వారి విజయాన్ని చూసి గర్విస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
భారత అంతరిక్ష ప్రస్థానం పరిమిత వనరులతోనే ప్రారంభమైనప్పటికీ, దేశ ఆశయాలు మాత్రం ఎప్పుడూ పరిమితం కాలేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. రాకెట్ విడిభాగాలను సైకిలుపై మోసుకెళ్లే స్థితి దగ్గరి నుంచి ప్రపంచంలో అత్యంత విశ్వనీయమైన ప్రయోగ వాహనాల రూపకల్పన వరకు... పెద్ద కలలు కనేందుకు భారీ సంపదే అవసరం లేదు.. దృఢ సంకల్పముంటే చాలని భారత్ రుజువు చేసిందని వ్యాఖ్యానించారు. “దశాబ్దాలుగా భారత అంతరిక్ష ప్రయాణానికి ఇస్రో కొత్త రెక్కలు తొడిగింది. విశ్వసనీయత, సామర్థ్యం, విలువలే ఈ రంగంలో భారత్‌కు విశిష్ట స్థానంలో నిలుపుతుందని నిరూపించింది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మారుతున్న కాలంలో అంతరిక్ష రంగం క్రమంగా, స్పష్టంగా అన్నింటా విస్తరిస్తోందన్న శ్రీ మోదీ.. కమ్యూనికేషన్, వ్యవసాయం, సముద్ర పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక, వాతావరణ అంచనా, దేశ భద్రతకు అది పునాదిగా మారిందని వ్యాఖ్యానించారు. అందుకే భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక సంస్కరణలు చేపట్టామనీ.. ప్రభుత్వం ఇందులో ప్రైవేటు ఆవిష్కరణలకు అవకాశాన్నిచ్చిందని, కొత్త అంతరిక్ష విధానాన్ని రూపొందించిందని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలను అంకుర సంస్థలు, పరిశ్రమలతో అనుసంధానించేందుకు కృషి చేశామని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇస్రో సౌకర్యాలు, సాంకేతికతను అంకుర సంస్థలకు అందించడం కోసం ఇన్-స్పేస్ (IN-SPACe)ను నెలకొల్పినట్టు చెప్పారు. “గత ఆరేడు సంవత్సరాల్లోనే భారత్ తన అంతరిక్ష రంగాన్ని సార్వత్రిక, సహకార, ఆవిష్కరణాత్మక వ్యవస్థగా తీర్చిదిద్దుకుంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. నేటి కార్యక్రమం ఈ పరివర్తనకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.
మన యువత ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారని, ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అంతరిక్ష రంగంలో ప్రభుత్వం అవకాశమిచ్చిన సమయంలో.. దేశ యువత ముఖ్యంగా జెన్-జీ తరం ముందుకొచ్చి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందన్నారు. నేడు 300కు పైగా అంకుర సంస్థలు భారత అంతరిక్ష భవితపై ఆశలు రేకెత్తిస్తున్నాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సంస్థల్లో చాలావరకూ చిన్న చిన్న బృందాలతోనే ప్రారంభమయ్యాయన్నారు. ఒక్కోసారి ఇద్దరు, కొన్నిసార్లు అయిదుగురు, మరికొన్ని చిన్న చిన్న అద్దె గదుల్లో... ఇలా పరిమిత వనరులే ఉన్నప్పటికీ, కొత్త శిఖరాలను అధిరోహించాలన్న దృఢ సంకల్పంతో వారు మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. “ఈ స్ఫూర్తి భారత్‌లో ప్రైవేటు అంతరిక్ష విప్లవానికి మూలమైంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. చోదక వ్యవస్థలు, మిశ్రమ పదార్థాలు, రాకెట్ దశలు లేదా ఉపగ్రహ వేదికలు... ఇలా అన్నింటా జెన్-జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను ఆవిష్కరిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కొన్నేళ్ల కిందట ఊహకు కూడా అందని రంగాల్లో భారత యువత పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రైవేటు అంతరిక్ష ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు విశిష్ట గుర్తింపును తెస్తోందన్నారు. భారత అంతరిక్ష రంగం నేడు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోందని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉపగ్రహాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, ప్రయోగాలు కూడా చాలా తరచుగా జరుగుతున్నాయని చెప్పిన శ్రీ మోదీ.. ఉపగ్రహ సేవలను అందించడం కోసం కొత్త కంపెనీలు ఈ రంగంలోకి వస్తున్నాయన్నారు. అంతరిక్షం ఇప్పుడు ఒక వ్యూహాత్మక ఆస్తిగా స్థిరపడిందని వ్యాఖ్యానించారు. మున్ముందు ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అనేక రెట్లు పెరగబోతోందని, ఇది భారత యువతకు విశేష అవకాశమని స్పష్టం చేశారు.
“నిపుణులైన ఇంజినీర్లు, అత్యుత్తమ తయారీ వ్యవస్థ, ప్రపంచ స్థాయి ప్రయోగ స్థానాలు, అలాగే ఆవిష్కరణలను ప్రోత్సహించే వైఖరి... ఇలా ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రమే సొంతమైన అంతరిక్ష సామర్థ్యాలు నేడు భారత్‌కు ఉన్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తక్కువ వ్యయం, విశ్వసనీయత... ఈ రెండూ భారత అంతరిక్ష సామర్థ్య విశేషాలని, అందుకే మన దేశంపై ప్రపంచానికి ఎన్నో అంచనాలున్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు భారత్‌లో ఉపగ్రహాలను తయారు చేయాలని, భారత ప్రయోగ సేవలను పొందాలని, అలాగే మనదేశంతో సాంకేతిక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని దేశం సద్వినియోగం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పులు భారత్ లో విస్తృత స్టార్టప్ ల విప్లవంలో భాగమని ప్రధానమంత్రి అన్నారు. గత దశాబ్ద కాలంలో ఫిన్ టెక్, ఆగ్రిటెక్, హెల్త్ టెక్, క్లైమేట్ టెక్, ఎడ్యుటెక్, ఢిపెన్స్ టెక్ వంటి పలు రంగాల్లో అంకుర సంస్థలు పుట్టుకొచ్చాయని తెలిపారు. దేశ యువత, ముఖ్యంగా జెన్-జీ తరం, ప్రతి రంగంలోనూ వినూత్న పరిష్కారాలను అందిస్తోందని స్పష్టం చేశారు. భారత్ లోని జెన్-జీ తరాన్ని ప్రశంసిస్తూ, వారి సృజనాత్మకత, సానుకూల దృక్పథం, సామర్థ్య నిర్మాణ నైపుణ్యాలు ప్రపంచంలోని జెన్-జీ తరానికి స్ఫూరి అని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థగా భారత్ మారిందని వెల్లడించారు. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన అంకుర సంస్థలు, ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ ఏర్పాటు అవుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 1.5 లక్షలకు పైగా నమోదైన అంకుర సంస్థలున్నాయని, వాటిలో చాలా వరకు యూనికార్న్ హోదా సాధించాయని చెప్పారు.
యాప్‌లు, సేవలకు మాత్రమే పరిమితం కాకుండా డీప్-టెక్, తయారీ, హార్డ్‌వేర్ ఆవిష్కరణల వైపు భారత్ పురోగమిస్తోందని చెబుతూ, జెన్-జీ తరానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సెమీకండక్టర్ రంగాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న కీలకమైన చర్యలు దేశ సాంకేతిక భవిష్యత్తుకు పటిష్టమైన పునాదిని ఏర్పరస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, చిప్ తయారీ, డిజైన్ కేంద్రాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. చిప్‌ల నుంచి వ్యవస్థల వరకు బలమైన ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను భారత్ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఇది స్వావలంబన సంకల్పంలో భాగం మాత్రమే కాదు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌ను బలమైన, విశ్వసనీయమైన ఆధారంగా మారుస్తుందని తెలిపారు.
సంస్కరణల పరిధి నిరంతరం విస్తృతమవుతుందని, అంతరిక్ష ఆవిష్కరణలను ప్రైవేట్ రంగానికి విస్తరించినట్లుగా అణురంగ విస్తరణకు కూడా భారత్ సిద్ధమవుతోందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ రంగంలో ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని.. దీని ద్వారా చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లు, అణు ఆవిష్కరణల్లో అవకాశాలు పుట్టుకొస్తాయని స్పష్టం చేశారు. భారత ఇంధన రంగానికి భద్రత, సాంకేతిక నాయకత్వానికి నూతనోత్తేజాన్ని ఈ సంస్కరణ ఇస్తుందని ఆయన తెలిపారు.
నేడు పరిశోధన రంగంలో జరుగుతున్న అధ్యయనాలపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, పరిశోధన రంగంలో యువతకు ఎక్కువగా అవకాశాలను కల్పించటంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఆధునాతన పరిశోధనలకు మద్దతుగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు గురించి వివరించారు. "ఒకే దేశం, ఒకే సభ్యత్వం" ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ పత్రికలు సులభంగా లభ్యమవుతున్నాయని చెప్పారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణకు లక్ష కోట్ల రూపాయల నిధి, దేశవ్యాప్తంగా ఉన్న యువతకు మద్దతిస్తుందని తెలిపారు. ఇప్పటికే 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో 50,000 కొత్త ల్యాబ్స్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రయత్నాలు భారత్‌లో నూతన ఆవిష్కరణలకు పునాది వేస్తున్నాయన్నారు. రాబోయే శకం భారతదేశానిది, ఇక్కడి యువత, ఇక్కడి ఆవిష్కరణలదేనని ఆయన స్పష్టం చేశారు. కొన్ని నెలల క్రితం అంతరిక్ష దినోత్సవం సందర్భంగా, భారత అంతరిక్ష రంగ ఆకాంక్షల గురించి మాట్లాడినట్లు ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో భారత ప్రయోగ సామర్థ్యం కొత్త శిఖరాలకు చేరుతుందని, అంతరిక్ష రంగంలో ఐదు కొత్త యూనికార్న్‌లను సృష్టిస్తుందని చెప్పినట్లు తెలిపారు. స్కైరూట్ బృందం పురోగతి ద్వారా భారత్ నిర్దేశించుకున్న ప్రతి లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి యువతీ, యువకుడికి, ప్రతి అంకుర సంస్థ, శాస్త్రవేత్త, ఇంజనీర్, పారిశ్రామికవేత్తకు అడుగడుగునా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి.. దేశ అంతరిక్ష ప్రయాణానికి కొత్త ఊపునిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సమస్త భూ ప్రపంచం, అంతరిక్షంలోనూ 21వ శతాబ్దం భారతదేశానిదే అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
భారత అంతరిక్ష అంకుర సంస్థ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్, ఒక అత్యాధునిక సౌకర్యం. డిజైన్, అభివృద్ధి, అనుసంధానం, వివిధ లాంచ్ వెహికల్స్ ను పరీక్షించటానికి దాదాపు 2,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యస్థలం ఉంది. ప్రతినెలా ఒక ఆర్బిటల్ రాకెట్‌ను రూపొందించగలిగే సామర్థ్యం దీనికి ఉంది.
భారత్‌లో ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్‌ని పవన్ చందన, భరత్ దాకా నెలకొల్పారు. వీరిద్దరూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులు. ఇస్రోలో మాజీ శాస్త్రవేత్తలైన వీరు ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా మారారు. నవంబర్ 2022లో, స్కైరూట్ మొదటి సబ్-ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-ఎస్ ను ప్రయోగించి, అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపిన తొలి భారతీయ ప్రైవేట్ కంపెనీగా చరిత్ర సృష్టించింది.
కొన్నేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల విజయానికి, వేగంగా పెరుగుతున్న ప్రైవేట్ అంతరిక్ష సంస్థలే నిదర్శనం. దీని ద్వారా విశ్వసనీయమైన, సమర్థవంతమైన ప్రపంచ అంతరిక్ష శక్తిగా భారత నాయకత్వం బలపడుతుంది.
(రిలీజ్ ఐడి: 2254291)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam