పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ.18,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ "ఈ రోజు కోల్‌కతా నుంచి పశ్చిమబెంగాల్, తూర్పు భారతదేశ అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలవుతోంది" అన్నారు.
ఈ కార్యక్రమంలో సుమారు రూ.18,000 కోట్లకుపైగా విలువైన రహదారులు, రైల్వేలు, ఓడరేవుల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, జాతికి అంకితమిచ్చినట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశానికి నూతనోత్తేజాన్ని కలిగిస్తాయని, వాణిజ్యం, పరిశ్రమలను ప్రోత్సహిస్తాయని అన్నారు. లక్షలాది మంది ప్రజలకు కొత్త అవకాశాలను కల్పించటం ద్వారా వారి జీవితాలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. కొన్ని కీలక ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ.. ఖరగ్‌పూర్-మోర్గ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని ప్రధామంత్రి చెప్పారు. దుబ్రాజ్‌పూర్ బైపాస్, కంగ్సాబతి, శిలాబతి నదులపై నిర్మిస్తున్న ప్రధాన వంతెనల గురించి వివరిస్తూ.. వాటిద్వారా రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందన్నారు. "ఈ పరివర్తనాత్మక ప్రాజెక్టుల సందర్భంగా పశ్చిమబెంగాల్, తూర్పు భారత ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
భారత రైల్వేల ఆధునీకరణకు దేశవ్యాప్తంగా ముమ్మర ప్రచారం కొనసాగుతోందని, ఈ మిషన్‌లో పశ్చిమబెంగాల్ వెనుకబడకూడదన్నదే ప్రభుత్వ దృఢ సంకల్పమని ప్రధానమంత్రి వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం వేగంగా విస్తరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలైకుండ-కనిమొలి విభాగంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను జాతికి అంకితమిచ్చారు. "ఈ కార్యక్రమాలు రద్దీగా ఉండే రైలు మార్గాల సామర్థ్యాన్ని పెంచుతాయి. సురక్షితమైన ప్రయాణాలు జరుగుతాయి. వేగంతో పాటు ప్రయాణికులకు సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి ప్రారంభించిన ఆరు రైల్వే స్టేషన్లు.. కామాఖ్యగురి, అనార, తమ్లుక్, హల్దియా, బారాభుం, సియూరిను అమృత్ భారత్ స్టేషన్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగాల్ గొప్ప సంస్కృతి ఇప్పుడు ఈ స్టేషన్లలో మరింతగా వెలుగొందుతుందని, మరికొన్ని స్టేషన్లు పునరాభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. పురులియా-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ఆయన ప్రారంభించారు. "ఈ రైలు సర్వీస్ ద్వారా పశ్చిమబెంగాల్ ప్రజలకు మాత్రమే కాక.. జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల ప్రజలకూ ఎంతో ప్రయోజనకరం" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఆర్థిక పురోగతిని వేగవంతం చేయటంలో రహదారి, రైలు మార్గాలతో పాటు ఓడరేవులు, జలరవాణా అంతే కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా తూర్పు భారత్‌లోని ఈ సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేశారని, నేడు జలమార్గాలు వాణిజ్యం, పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త మార్గాలను చూపిస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా కీలకమైన పోర్టు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితమిచ్చే కార్యక్రమాలు జరిగాయి. తూర్పు భారదేశంలో ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా కోల్‌కతా, హల్దియా నౌకాశ్రయాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. హల్దియా డాక్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న యాంత్రీకరణ ద్వారా ఓడరేవు సామర్థ్యం పెరగటంతో పాటు సరకు రవాణా కార్యకలాపాలు వేగవంతం అవుతాయని, వాణిజ్యానికి నూతన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అదనంగా కోల్‌కతా డాక్ సిస్టమ్‌లోని బాస్క్యూల్ వంతెన పునరుద్ధరణ పనులు, కిడ్డర్‌పూర్ డాక్ వద్ద సరకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచే పనులు కూడా జరుగుతున్నాయన్నారు. "ఈ ప్రాజెక్టులన్నీ తూర్పు భారతదేశంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి" అని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.
రహదారులు, రైల్వేలు, ఓడరేవులకు సంబంధించిన ఈ నూతన ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్ ఆధునిక భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. రైతులు, వర్తకులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, సమాజంలోని ప్రతి విభాగానికి ఈ ప్రాజెక్టుల ప్రయోజనాలు చేరుతాయన్నారు. పర్యాటక రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడటంతో స్థానిక పరిశ్రమలు, సేవా రంగాలు నూతనోత్తేజాన్ని సంతరించుకుంటాయని వ్యాఖ్యానించారు. భారతదేశానికి దిశా నిర్దేశం చేయటంలో బెంగాల్ కీలక పాత్రను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. బలమైన అనుసంధానత, ఆధునిక మౌలిక సదుపాయాలే అభివృద్ధి చెందిన బెంగాల్ ఏర్పాటుకు ఆధారమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. "భారతదేశానికి ఎల్లప్పుడూ దారి చూపిన బెంగాల్.. 'వికసిత్ బెంగాల్'గా వృద్ధి చెంది పూర్వవైభవాన్ని సంతరించుకోవాలన్నదే మా సంకల్పం" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
***