వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైతులకు మద్దతు లక్ష్యంగా మార్కెట్ల స్థిరీకరణ కోసం అదనంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఎగుమతులకు ప్రభుత్వ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 7:08PM by PIB Hyderabad

దేశీయ మార్కెట్లలో స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే, రైతులకు లాభదాయకమైన రాబడిని అందించడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... భారత ప్రభుత్వం అదనంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఎగుమతికి ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఉత్పత్తి, నిల్వల లభ్యత... ధరల ధోరణులపై సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత ఏడాది సాగైన 328.04 లక్షల హెక్టార్లతో పోలిస్తే... 2026 రబీ సీజన్‌లో గోధుమ సాగు విస్తీర్ణం సుమారుగా 334.17 లక్షల హెక్టార్లకు పెరిగింది. హామీ ఇచ్చిన కనీస మద్దతు ధర, పటిష్ఠ సేకరణ యంత్రాంగాల మద్దతుతో గోధుమ సాగు పట్ల రైతుల బలమైన విశ్వాసాన్ని ఈ పెరుగుదల ప్రతిబింబిస్తుంది. మరో మంచి పంట దిగుబడి వచ్చే అవకాశాన్ని ఇది సూచిస్తుంది.

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 2026 మార్చి 10న విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల ప్రకారం... 2025–26 సంవత్సరానికి గోధుమ ఉత్పత్తి 1202 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. అనుకూలమైన ఉత్పత్తి అంచనాలు, అధిక నిల్వల లభ్యత దృష్ట్యా అదనపు ఎగుమతులను అనుమతించడం సముచితమని భావించారు.

దీనికి ముందు, 2026 జనవరిలో 5 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తుల ఎగుమతికి డీఎఫ్‌పీడీ ఆమోదం తెలిపింది. 2026 ఫిబ్రవరి నెలలో అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తులు, 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఎగుమతికీ ఆమోదం లభించింది. తాజా ఆమోదాలతో ఇప్పుడు మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 10 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తుల ఎగుమతికి అనుమతి లభించింది.

అదనంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఎగుమతికి అనుమతించే తాజా నిర్ణయం ద్వారా మార్కెట్లో ద్రవ్య లభ్యతను పెంచడం, సమర్థమైన నిల్వల నిర్వహణకు వీలు కల్పించడం, గోధుమలు అధికంగా వచ్చే కాలంలో జరిగే అనవసర అమ్మకాలను నివారించడం వంటి ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇది దేశీయ ధరలను స్థిరీకరించడానికి, రైతుల ఆదాయాలను బలోపేతం చేయడానికీ సహాయపడుతుంది. అదే సమయంలో దేశ ఆహార భద్రత పూర్తిస్థాయి పరిరక్షణనూ నిర్ధారిస్తుంది.

వ్యవసాయ రంగంలో సుస్థిర వృద్ధిని ప్రోత్సహిస్తూనే రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను సమతుల్యం చేయడం కోసం క్రమబద్ధంగా, సకాలంలో చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2253996) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati