రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

దక్షిణ కొరియా అధ్యక్షుడికి భారత రాష్ట్రపతి ఆతిథ్యం


భారత నైపుణ్యం, వేగం, స్థాయి... కొరియా హై-టెక్ తయారీ రంగ నైపుణ్యాల మేళవింపుతో యువతకు అసంఖ్యాక అవకాశాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 10:18PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు గౌరవ లీ జే మ్యుంగ్‌కు సాదర స్వాగతం పలికారు. ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు.

భారత్‌లో తొలిసారిగా పర్యటిస్తున్న అధ్యక్షుడు మ్యుంగ్‌కు స్వాగతం పలుకుతూ... భారత్-కొరియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం, ముఖ్యంగా కొరియా-భారత్ పార్లమెంటరీ స్నేహ బృంద అధ్యక్షులుగా ఆయన కృషిని రాష్ట్రపతి అభినందించారు. అధ్యక్ష పదవి చేపట్టిన మొదటి సంవత్సరంలోనే చేపట్టిన ఈ పర్యటన... ఇరు దేశాల మధ్య సంబంధానికి ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని భారత రాష్ట్రపతి అన్నారు.

భారత్-కొరియాలు ఉమ్మడి విలువలను పంచుకునే శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలని రాష్ట్రపతి అన్నారు. భారత పార్లమెంటులో ఇటీవల భారత్-కొరియా పార్లమెంటరీ స్నేహ బృందాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారత పార్లమెంటు, కొరియా జాతీయ అసెంబ్లీ మధ్య చర్చలు, పరస్పర సహకారాన్ని మరింత ప్రోత్సహిస్తుందని, తద్వారా పరస్పర అవగాహననూ, విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.

ఓడల నిర్మాణం, ఓడరేవుల అభివృద్ధి, డిజిటల్ సహకారం, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు, ఉక్కు, విద్య, పరిశోధన, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం కోసం ఇరుపక్షాలు ఒక ప్రతిష్ఠాత్మక అజెండాను నిర్దేశించుకున్నాయని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) విషయంగా చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరుపక్షాలు ఆమోదించాయని శ్రీమతి ముర్ము పేర్కొన్నారు. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, పరిశుద్ధ ఇంధనం, సేవలు, పర్యాటకం వంటి రంగాల్లో కొరియాతో పరస్పర ప్రయోజనకర వాణిజ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి, సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ ఎదురుచూస్తోందని భారత రాష్ట్రపతి తెలిపారు.

భారత్ నైపుణ్యం, వేగం, స్థాయిని కలిగి ఉందని... కొరియాకు హై-టెక్ తయారీ రంగంలో నైపుణ్యం ఉందని రాష్ట్రపతి అన్నారు. మన బలాలను ఏకం చేయడం ద్వారా, మన యువతకు అనేక అవకాశాలను సృష్టించగలమని తెలిపారు.

మానవాళికి సుస్థిర భవిష్యత్తును అందించడం లక్ష్యంగా భారత్, కొరియాలు హరిత, పరిశుద్ధ ఇంధన రంగాలు సహా ఇతర వాతావరణ సాంకేతిక రంగాల్లో సహకారానికి అవకాశాలను అన్వేషించాలని రాష్ట్రపతి కోరారు.

భారత్, కొరియాల మధ్య సన్నిహిత సహకారం మన ప్రజలకు అపారమైన ప్రయోజనాలను చేకూర్చగలదని, ఇరు దేశాలు ఒకరి నుంచి మరొకరు ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. పర్యావరణం, ఆవిష్కరణలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పనిచేయడం ద్వారా ఇరు దేశాల ప్రజలు ప్రయోజనం పొందగలరని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ప్రసంగం చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి-


(రిలీజ్ ఐడి: 2253991) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati