పార్లమెంటరీ వ్యవహారాలు
పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయసభల్లో 9 బిల్లులకు ఆమోదం
బడ్జెట్ సమావేశాల కాలంలో లోక్‌సభ ఉత్పాదకత సుమారు 93 శాతం... రాజ్యసభ ఉత్పాదకత సుమారు 110 శాతం
నాడు పోస్టు చేయడమైనది:
18 APR 2026 3:29PM by PIB Hyderabad
జనవరి 28, 2026 బుధవారం రోజున పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు-2026 ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 18, 2026 శనివారం రోజున పార్లమెంటు ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మధ్య కాలంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల పద్దుల డిమాండ్లను పరిశీలించి, నివేదికలు సమర్పించేందుకు వీలుగా పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు సమయం ఇస్తూ ఫిబ్రవరి 13 శుక్రవారం నాడు ఉభయసభలు తొలిసారి వాయిదా పడ్డాయి. తిరిగి మార్చి 9, 2026 సోమవారం రోజున సభలు పునః ప్రారంభమయ్యాయి. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం ఏప్రిల్ 2న సభలు వాయిదా పడి, తిరిగి ఏప్రిల్ 16న ప్రారంభమయ్యాయి
బడ్జెట్ సమావేశాల మొదటి దశలో లోక్‌సభ, రాజ్యసభలు ఒక్కొక్కటి 13 సార్లు సమావేశమయ్యాయి. సమావేశాల రెండో దశలో రెండు సభలు 15 సార్ల చొప్పున భేటీ అయ్యాయి. ఇక మూడో దశలో లోక్‌సభ, రాజ్యసభలు 3 సార్ల చొప్పున సమావేశమయ్యాయి. మొత్తంగా ఈ బడ్జెట్ సమావేశాలు జరిగిన 81 రోజుల్లో 31 సార్లు సమావేశాలు జరిగాయి.
ఈ ఏడాది తొలిసారి సమావేశాల సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 87(1) ప్రకారం.. జనవరి 28, 2026న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌సభలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్, నౌకాయాన శాఖ మంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్ ప్రతిపాదించగా, ఎంపీ శ్రీ తేజస్వీ సూర్య ఆ తీర్మానాన్ని బలపరిచారు. దీనిపై చర్చకు 18 గంటల సమయం కేటాయించగా సభలో అంతరాయాల కారణంగా కేవలం 2 గంటల 46 నిమిషాలు మాత్రమే లోక్‌సభ చర్చించింది. ఈ చర్చలో కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. రాజ్యసభలో ఈ తీర్మానాన్ని ఎంపీ శ్రీ సి. సదానందన్ మాస్టర్ ప్రవేశపెట్టగా, ఎంపీ డాక్టర్ మేధా విశ్రామ్ కులకర్ణి బలపరిచారు. ఈ అంశంపై రాజ్యసభలో 16 గంటల సమయం కేటాయించగా, 17 గంటల 20 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఈ చర్చలో మొత్తం 81 మంది సభ్యులు పాల్గొన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రధానమంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలను 05.02.2026న ఉభయసభలు ఆమోదించాయి.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2026న ఆదివారం నాడు ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల తొలిదశలో భాగంగా ఉభయసభల్లోనూ బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగింది. లోక్‌సభలో 12 గంటల 57 నిమిషాల పాటు జరిగిన చర్చలో మొత్తం 63 మంది సభ్యులు పాల్గొన్నారు. రాజ్యసభలో 16 గంటల 30 నిమిషాల పాటు కొనసాగిన చర్చల్లో 97 మంది సభ్యులు పాల్గొన్నారు.
లోక్‌సభ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ డాక్టర్ మహ్మద్ జావేద్ 10.03.2026న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై మార్చి 10, 11వ తేదీల్లో రెండు రోజుల పాటు చర్చ జరిగింది. మొత్తం 12 గంటల 27 నిమిషాల పాటు సాగిన ఈ చర్చలో 53 మంది సభ్యులు పాల్గొన్నారు. చివరికి ఈ తీర్మానాన్ని తిరస్కరించారు.
సమావేశాల రెండో దశలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వ రెండో, చివరి విడత అదనపు గ్రాంట్ల డిమాండ్లను 13.03.2026న లోక్‌సభ ఆమోదించింది. దీనికి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదం పొందింది.
లోక్‌సభలో రైల్వే, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖల పద్దులపై చర్చించి, ఓటింగ్ నిర్వహించారు. మిగిలిన అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల పద్దులను మార్చి 18, 2026న బుధవారం రోజున సభలో ఓటింగ్‌కు పెట్టారు. అనంతరం దానికి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు (నంబర్. 2) కూడా అదే రోజున లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులు దాన్ని పరిశీలించి, ఆమోదించారు.
25.03.2026న లోక్‌సభ ఆర్థిక బిల్లు-2026ను ఆమోదించింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో, చివరి విడత అదనపు నిధుల అభ్యర్థనలకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును 17.03.2026న రాజ్యసభ ఆమోదించి, తిరిగి పంపింది.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల పనితీరుపై రాజ్యసభలో చర్చ జరిగింది.
2026-27 సంవత్సరానికి సంబంధించి కేంద్ర నిధుల డిమాండ్లకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు (నంబర్ 2), ఆర్థిక బిల్లు- 2026ను కూడా 27.03.2026న రాజ్యసభ ఆమోదించి, తిరిగి పంపింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి 23.03.2026న లోక్‌సభలో, 24.03.2026న రాజ్యసభలో గౌరవ ప్రధానమంత్రి ప్రసంగించారు.
సమావేశాల మూడోదశలో భాగంగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ద్వారా మహిళలకు సీట్ల రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026లను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) ప్రకారం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లుకు అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో ఆ బిల్లుపై తదుపరి చర్యలేవీ తీసుకోలేదు. దీంతో ఆ బిల్లుపై ఆధారపడిన మిగిలిన రెండు బిల్లులు.. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026ల తదుపరి ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఈ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో మొత్తం 12 బిల్లులను ప్రవేశపెట్టగా, రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. లోక్‌సభ 9 బిల్లులను ఆమోదించగా, రాజ్యసభ కూడా ఆ 9 బిల్లులను ఆమోదించింది. లోక్‌సభ ఒక బిల్లును ఉపసంహరించుకుంది. కాగా, పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన మొత్తం బిల్లుల సంఖ్య 9.
లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుల జాబితా, ఉభయసభల సంయుక్త కమిటీకి సూచించిన బిల్లు, లోక్‌సభ ఆమోదించిన బిల్లులు, రాజ్యసభ ఆమోదించి, తిరిగి పంపిన బిల్లులు, పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన బిల్లులు, లోక్‌సభ ఉపసంహరించుకున్న బిల్లు అనుబంధంలో జతచేశారు.
బడ్జెట్ సమావేశాల కాలంలో లోక్‌సభ ఉత్పాదకత సుమారు 93 శాతం ఉండగా.. రాజ్యసభ ఉత్పాదకత సుమారు 110 శాతం ఉంది.
అనుబంధం
18వ లోక్‌సభ 7వ సమావేశం, 270వ రాజ్యసభ సమావేశాల సందర్భంగా నిర్వహించిన శాసన వ్యవహారాలు
I. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులు
1. ఆర్థిక బిల్లు-2026
2. పారిశ్రామిక సంబంధాల కోడ్ (సవరణ) బిల్లు-2026
3. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు-2026
4. ద్రవ్య వినిమయ బిల్లు-2026
5. ద్రవ్య వినిమయ (నంబర్.2) బిల్లు-2026
6. కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు-2026
7. విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు-2026
8. జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2026
9. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026
10. రాజ్యాంగ (131 సవరణ) బిల్లు-2026
11. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026
12. డీలిమిటేషన్ బిల్లు-2026
II. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు
1. కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లు-2026
III. ఉభయసభల సంయుక్త కమిటీకి పంపిన బిల్లు
1. కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు-2026
IV. లోక్‌సభ ఉపసంహరించుకున్న బిల్లు
1. సెలక్ట్ కమిటీ నివేదిక ప్రకారం జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2026
V. లోక్‌సభ ఆమోదించిన బిల్లులు
-
పారిశ్రామిక సంబంధాల కోడ్ (సవరణ) బిల్లు-2026
-
ద్రవ్య వినిమయ బిల్లు-2026
-
ద్రవ్య వినిమయ (నంబర్.2) బిల్లు-2026
-
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు-2026
-
ఆర్థిక బిల్లు-2026
-
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (సవరణ) బిల్లు-2026
-
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026
-
జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2026
-
కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లు-2026
VI. రాజ్యసభ ఆమోదించిన బిల్లులు
-
పారిశ్రామిక సంబంధాల కోడ్ (సవరణ) బిల్లు-2026
-
ద్రవ్య వినిమయ బిల్లు-2026
-
ద్రవ్య వినిమయ (నంబర్.2) బిల్లు-2026
-
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు-2026
-
ఆర్థిక బిల్లు-2026
-
కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లు-2026
-
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (సవరణ) బిల్లు-2026
-
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026
-
జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2026
VII. పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన బిల్లులు
-
పారిశ్రామిక సంబంధాల కోడ్ (సవరణ) బిల్లు-2026
-
ద్రవ్య వినిమయ బిల్లు-2026
-
ద్రవ్య వినిమయ (నంబర్.2) బిల్లు-2026
-
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు-2026
-
ఆర్థిక బిల్లు-2026
-
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (సవరణ) బిల్లు-2026
-
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026
-
జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2026
-
కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లు-2026
(రిలీజ్ ఐడి: 2253460)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6