గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్
రూ. లక్ష కోట్ల యూసీఎఫ్ ద్వారా రూ.4 లక్షల కోట్ల పట్టణ పెట్టుబడులకు ఊతం... టైర్-II, టైర్-III నగరాలపై ప్రత్యేక దృష్టి
చిన్న నగరాలు మార్కెట్ ఆధారిత ఆర్థిక వనరులను పొందేలా చేసేందుకు రుణ చెల్లింపు గ్యారెంటీ ఉప-పథకం
పాత నగరాలు, మార్కెట్ల అభివృద్ధి, పట్టణ రవాణా, ప్రతీ ప్రాంతానికి అనుసంధానత, సైక్లింగ్, పాదచారుల మార్గాల ఏర్పాటు, మంచినీరు, పారిశుద్ధ్యం వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పుల ప్రాజెక్టులకు ఈ నిధుల కేటాయింపు: శ్రీ మనోహర్ లాల్
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 3:00PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కార్యాచరణ మార్గదర్శకాలతో పాటు క్రెడిట్ రీపేమెంట్ గ్యారెంటీ సబ్-స్కీమ్ (సీఆర్‌జీఎస్ఎస్)ను కేంద్రమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఇవాళ ప్రారంభించారు. దేశంలోని పట్టణ మౌలిక సదుపాయాల ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఇది కీలక ముందడుగు.
ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా సహా వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
శ్రీ మనోహర్ లాల్ ప్రసంగిస్తూ.. భారత పట్టణాభివృద్ధి విధానంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ విప్లవాత్మక మార్పని అన్నారు. ఈ నిధి కేవలం గ్రాంట్లు ఇవ్వటానికి మాత్రమే కాదని, ప్రభుత్వ నిధుల ఆధారంగా భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించటం, నగరాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ పెట్టుబడులకు అనువైనవిగా తీర్చిదిద్దటమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
భారతదేశ నగరాలు ఆర్థిక వృద్ధికి, ఆవిష్కరణలకు, ఉపాధి కల్పనకు ప్రధాన శక్తిగా ఎదుగుతున్నాయని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మన నగరాలకు సమర్థవంతమైన ప్రణాళిక, నిధులను సమకూర్చటం, వాటి పాలన విధానంపైనే వికసిత్ భారత్-2047 దార్శనికత సాకారం ఆధారపడి ఉంటుందన్నారు. అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, స్మార్ట్ సిటీస్ మిషన్ వంటి కార్యక్రమాలు పట్టణ మౌలిక సదుపాయాలను ఇప్పటికే బలోపేతం చేశాయని, తదుపరి దశలో నగరాలు పెట్టుబడులను ఆకర్షించేలా సిద్ధం కావాలని, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని అన్నారు.
ఒక లక్ష కోట్ల రూపాయల కేంద్ర సహాయంతో రూపొందించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్, మార్కెట్ ఆధారిత ఫైనాన్సింగ్ ద్వారా దాదాపు నాలుగు రెట్ల పెట్టుబడిని సమీకరించే ఉత్ప్రేరక సాధనంగా పనిచేస్తుందని మంత్రి వెల్లడించారు. కేంద్ర సహాయం ప్రాజెక్ట్ వ్యయంలో 25 శాతానికి పరిమితం అవుతుందని, కనీసం 50 శాతం నిధులను మున్సిపల్ బాండ్లు, బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా సేకరిస్తామని, తద్వారా ఆర్థిక క్రమశిక్షణను పెంచటంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
మొత్తం కేటాయింపుల్లో రూ. 90,000 కోట్లను వివిధ ప్రాజెక్టులకు, రూ. 5,000 కోట్లను ప్రాజెక్ట్ తయారీ, సామర్థ్య పెంపుదలకు, మరో రూ. 5,000 కోట్లను క్రెడిట్ రీపేమెంట్ గ్యారెంటీ సబ్-స్కీమ్ కోసం కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ సీఆర్‌జీఎస్ఎస్ పథకం ముఖ్యంగా టైర్-II, టైర్-III నగరాలతో పాటు కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న నగరాలకు ఎంతో మేలు చేస్తుంది. క్రెడిట్ గ్యారెంటీల ద్వారా ఆయా నగరాలు మార్కెట్ ఆధారిత ఆర్థిక వనరులను పొందేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.
పాత నగరాలు, మార్కెట్ల అభివృద్ధి, పట్టణ రవాణా, ప్రతీ ప్రాంతానికి అనుసంధానత, సైక్లింగ్, పాదచారుల మార్గాల ఏర్పాటు, మంచినీరు, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులను తట్టుకోగల పట్టణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పుల ప్రాజెక్టులకు ఈ నిధులు మద్దతిస్తాయని శ్రీ మనోహర్ లాల్ స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందించే సామర్థ్యం ఉండి, విస్తరించదగిన, ప్రభావవంతమైన, బ్యాంకు రుణ సదుపాయం పొందేందుకు అర్హత గల ప్రాజెక్టులపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీల) పాత్రను ప్రస్తావిస్తూ, నగరాలు ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, సంస్కరణలను అమలు చేయాలని, మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని మంత్రి పేర్కొన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను కేవలం ఒక పథకంగా కాక.. అంతర్జాతీయ స్థాయి పోటీతత్వం, స్థిరత్వం, పెట్టుబడులకు అనువైన నగరాలుగా తీర్చిదిద్దే గొప్ప అవకాశంగా భావించాలని రాష్ట్రాలను, యూఎల్‌బీలను కోరారు.
గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ కటికితల ప్రసంగిస్తూ.. భారతదేశ పట్టణీకరణ ఒక నిర్ణయాత్మక దశలోకి ప్రవేశిస్తోందన్నారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్, మార్కెట్-అనుసంధానత, సంస్కరణల ఆధారిత, ఫలితాల ప్రాధాన్యత గల నూతన విధానాన్ని పరిచయం చేస్తోందని తెలిపారు.
మౌలిక సదుపాయాల కల్పనను ఆర్థిక సుస్థిరత, సంస్థాగత బలోపేతంతో ఈ నిధి అనుసంధానిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు బ్యాంకు రుణాలు, క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణకు ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు.
కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక పట్టణ సంస్థల మధ్య సహకారంతో పాటు సంస్కరణల సమర్థవంతమైన అమలు, సామర్థ్య పెంపుదల కార్యక్రమాలపైనే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ విజయం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
యూసీఎఫ్ సమర్థవంతమైన అమలును సులభతరం చేయటానికి, నగరాలను ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలతో అనుసంధానించే ఈ-డైరెక్టరీని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను సమర్థవంతంగా అమలు చేసే దిశగా ఉమ్మడి నిబద్ధతను స్పష్టం చేస్తూ.. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాల మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై డిజిటల్ సంతకాలు జరిగాయి.
కీలక భాగస్వాములతో డిజిటల్ రూపంలో అంగీకార పత్రాలపై (ఎల్ఓఐలు) సంతకాలు జరిగాయి. ఇందులో విద్యా, పరిశోధనా సంస్థల వంటి జ్ఞాన భాగస్వాములు, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, మర్చంట్ బ్యాంకర్లతో ఉన్న ఆర్థిక సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. పట్టణ రూపాంతర ప్రాజెక్టుల అమలు, సామర్థ్య పెంపు, ఆర్థిక సహాయానికి సమగ్రమైన వ్యవస్థను రూపొందించటంలో ఇది కీలక ముందడుగు.
నగరాలను సరికొత్త ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా మార్చటం ద్వారా భారతదేశ పట్టణ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే లక్ష్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అమలవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2252282)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17