ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
నేడు ప్రారంభిస్తున్న ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు.. మరింత బలమైన అనుసంధానం, ఆర్థిక – పర్యాటక రంగాలకు ఊతం
25 ఏళ్లు పూర్తిచేసుకుని 26వ యేట అడుగుపెట్టిన ఉత్తరాఖండ్.. ఈ ఢిల్లీ - డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రహదారి మరో మైలురాయి
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌తో ఈ ప్రాంతంలో విప్లవాత్మక మార్పు
ఈ కారిడార్‌తో సమయం ఆదా: తక్కువ వ్యయంతో, వేగంగా ప్రయాణం.. ప్రజలకు పెట్రోలు, డీజిలుపై తగ్గనున్న ఖర్చులు
చార్జీలు, రవాణా ఖర్చుల్లోనూ తగ్గుదల.. మెరుగైన ఉపాధి అవకాశాలు
మన పర్వతాలు, ఈ అడవులు, ఈ దేవభూమి వారసత్వం... ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలు: వీటిని పరిశుభ్రంగా ఉంచడం మన కర్తవ్యం
ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్త కుప్పలు... దేవభూమి పవిత్రతకు భంగం.. మన పుణ్యక్షేత్రాలైన ఈ దేవభూమి ప్రదేశాలను పరిశుభ్రంగా, అందంగా ఉంచుకోవడం అత్యావశ్యకం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 4:10PM by PIB Hyderabad
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, చుట్టుపక్కల ప్రాంత అభివృద్ధిలో కీలక ఘట్టమిది. డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బైశాఖి, బోహాగ్ బిహు, పుతాండు పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పండుగ శోభ నెలకొన్న వేళ ఈ ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు.
పుణ్యభూమి అయిన దేవభూమికి ప్రణమిల్లుతూ – యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, భద్రీనాథ్లను కలుపుతూ సాగే చార్‌ధామ్ యాత్ర త్వరలోనే మొదలవబోతోందన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజలు అత్యంత భక్తిప్రపత్తులతో ఈ యాత్ర కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కార్యక్రమానికి ముందు పంచభద్రి, పంచకేదార్, పంచప్రయాగ్లను సందర్శించిన ఆయన.. ఈ ప్రాంత ఆరాధ్యదైవాలైన సంకటలా మాత, దాత్ కాళీమాత తదితర ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. ‘‘ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేయడంలో దాత్ కాళీమాత ఆశీస్సులు గొప్ప బలాన్నిచ్చాయి’’ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, యావద్దేశం తరఫునా బాబా సాహెబ్‌కు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. పేదలూ, అణగారిన వర్గాలకు న్యాయం కోసం డాక్టర్ అంబేద్కర్ ఆజన్మాంతం కట్టుబడి ఉన్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. అధికరణ 370 రద్దు నుంచి పదులకొద్దీ జిల్లాల్లో మావోయిజాన్నీ, నక్సలిజాన్నీ నిర్మూలించడం వరకు.. గత దశాబ్ద కాలంగా రాజ్యాంగ విలువలను నిలబెట్టేలా ప్రభుత్వ విధానాలున్నాయని స్పష్టం చేశారు. ‘‘రాజ్యాంగపరమైన ఆకాంక్ష… ఉమ్మడి పౌరస్మృతిని ముందుకు తీసుకెళ్లడంలో దేశం మొత్తానికీ ఉత్తరాఖండ్ మార్గదర్శిగా నిలిచింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంగా ఇరవై ఆరవ యేట అడుగుపెడుతున్న ఉత్తరాఖండ్ ప్రస్థానాన్ని వివరిస్తూ.. ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఉత్తరాఖండ్‌దేనంటూ ఇదివరకే తాను చేసిన ప్రకటనను ప్రధానమంత్రి గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, ప్రజల కృషితో ఈ యువరాష్ట్రం అభివృద్ధిలో నిరంతరం కొత్తపుంతలు తొక్కుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి నవోత్తేజాన్నిస్తుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
రోడ్లు, హైవేలు, ఎక్స్‌ప్రెస్ రహదారులు, విమాన మార్గాలు, రైల్వేలు, జలమార్గాల్లోనే దేశ భవిత లిఖితమై ఉంటుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మునుపెన్నడూ లేనిరీతిలో వేగం పుంజుకుందన్నారు. 2014కు ముందు దేశంలో మౌలిక సదుపాయాలపై చేసే వ్యయం ఏడాదికి రూ. 2 లక్షల కోట్ల లోపే ఉండగా.. అది నేడు ఆరు రెట్లు పెరిగి రూ. 12 లక్షల కోట్లను దాటిందని వివరించారు. ‘‘ప్రస్తుతం ఒక్క ఉత్తరాఖండ్‌లోనే రూ. 2.25 లక్షల కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి’’ అని ప్రధానమంత్రి తెలిపారు.
ఢిల్లీ - పశ్చిమ యూపీ - ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఢిల్లీ మెట్రో విస్తరణ, మీరట్‌లో మెట్రో సేవల ప్రారంభం, ఢిల్లీ - మీరట్ నమో భారత్ రైలు ప్రారంభం, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంఆర్వో కేంద్రం పనుల ప్రారంభం... అనతికాలంలోనే ఈ పనులన్నింటినీ చేపట్టినట్టు గుర్తుచేశారు. ‘‘దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో ఒక్కసారి ఊహించండి.. ఈ చిన్న ప్రాంతంలో జరుగుతున్నది దానికొక మచ్చుతునక మాత్రమే’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఎన్నో విశేష ప్రయోజనాలున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ఆ ప్రాంతంపై ఈ ప్రాజెక్టు బహుముఖ ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఎక్స్‌ప్రెస్ రహదారి వల్ల ప్రయాణ సమయం, ఖర్చులు గణనీయంగా తగ్గుతాయనీ.. తద్వారా ఇంధనం చాలావరకూ ఆదా అవ్వడమే కాకుండా, రవాణా ఛార్జీలు కూడా తగ్గుతాయని ఆయన వివరించారు. ఇప్పటికే రూ. 12,000 కోట్ల పెట్టుబడితో సాగుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం.. వేలాది ఇంజినీర్లు, కార్మికులు, రవాణా రంగంలో పనిచేస్తున్నవారికి ఉపాధిని కల్పిస్తోందనీ, ఇది ప్రధానమైన ఉపాధి అవకాశాల చోదకంగా నిలిచిందనీ ఆయన వివరించారు. అలాగే ఉత్పత్తులను వేగంగా పెద్ద మార్కెట్లకు చేరవేయడం ద్వారా.. రైతులు, పశుపోషకులు లబ్ధి పొందుతారని ప్రధానమంత్రి వివరించారు. ఘజియాబాద్, బాగ్పథ్, బరౌత్, శామ్లీ, సహరాన్పూర్ గుండా వెళ్లే ఈ కారిడార్.. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఈ నగరాల్లో కూడా నూతన ఉత్తేజాన్ని నింపుతుందన్నారు. ‘‘ఇదొక రహదారి మాత్రమే కాదు.. ఈ ప్రాంతమంతటా వాణిజ్యం, పరిశ్రమలు, గిడ్డంగులు, వస్తురవాణా రంగాల్లో ఇది కొత్త దారులను తెరుస్తుంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
కొత్త ఎక్స్‌ప్రెస్ రహదారి వల్ల పర్యాటక రంగంలో కలిగే అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. దీనివల్ల డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేశ్, ముస్సోరీ, చార్‌ధామ్ ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభతరమవుతుందని ఆయన పేర్కొన్నారు. శీతాకాల పర్యాటకం, శీతాకాల క్రీడలు, పర్యాటక ప్రాంతాల్లో వివాహాలకు ఉత్తరాఖండ్ ప్రధాన వేదికగా నిలుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం ఏడాది పొడవునా సాగడం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ.. శీతాకాల యాత్రలకు అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన వెల్లడించారు. కొన్ని వందలుగా ఉన్న ఆది కైలాష్, ఓం పర్వత్ సందర్శకుల సంఖ్య.. 2025లో 36,000 దాటిందని తెలిపారు. అలాగే శీతాకాలంలో చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య 2024లో 80,000 ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య లక్షన్నర దాటిందని ఆయన వివరించారు. ‘‘పర్యాటకం వృద్ధి చెందితే హోటళ్లు, ధాబాలు, టాక్సీలు, వసతిగృహాలు.. ఇలా స్థానిక ఆర్థిక వ్యవస్థ మొత్తానికీ ప్రయోజనం కలుగుతుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రకృతి, సంస్కృతులతో అభివృద్ధిని సమతౌల్యం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఏనుగులు, ఇతర జంతువుల సంచారానికి ఎలాంటి ఆటంకమూ కలగకుండా.. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారిలో భాగంగా దాదాపు 12 కిలోమీటర్ల మేర ఎత్తైన వన్యప్రాణి కారిడార్‌ను నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ఈ దేవభూమిలోని కొండలూ, అడవులను సందర్శించే పర్యాటకులు, భక్తులు ఈ పవిత్ర క్షేత్రాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయొద్దని ఆయన కోరారు. ‘‘మౌలిక సదుపాయాల ద్వారా ప్రజలకు సేవలందించడంతోపాటు.. ఈ ప్రాంతాల్లోని వన్యప్రాణులు, సహజ వారసత్వాన్ని కూడా పరిరక్షించాలన్నదే మా సంకల్పం’’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
వచ్చే ఏడాది హరిద్వార్‌లో జరగబోతున్న కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని.. ఈ వేడుకను అత్యంత వైభవంగా, దివ్యంగా, స్వచ్ఛంగా నిర్వహించేలా చూడాలని సంబంధిత వర్గాలన్నింటికీ ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అలాగే భారత సాంస్కృతిక చేతనకు సజీవ సాక్ష్యంగా నిలిచే నందాదేవీ రాజ్‌జాత్ యాత్రనూ ఆయన ప్రస్తావించారు. ఈ యాత్రలో నందాదేవిని కుమార్తెగా భావించి గౌరవంగా వీడ్కోలు పలుకుతారనీ, ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం ఈ యాత్రను మరింత అర్థవంతంగా మారుస్తుందనీ ఆయన చెప్పారు. ‘‘రాజ్‌జాత్ యాత్ర ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు. అది మన సజీవ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
మహిళా సాధికారత అంశంపై మాట్లాడుతూ.. మహిళల రక్షణ, భద్రత, రాజకీయ భాగస్వామ్యానికి ప్రభుత్వం దృఢంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాల నిరీక్షణ అనంతరం లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. నారీ శక్తి వందన్ అధినియాన్ని పార్లమెంటు ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారు. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ప్రత్యేక చర్చకు ప్రణాళిక రూపొందించినట్టు ఆయన ప్రకటించారు. 2029 సాధారణ ఎన్నికల నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చేలా చూడం కోసం.. ఈ రాజ్యాంగ సవరణకు మద్దతివ్వాలని దేవభూమి సాక్షిగా అన్ని రాజకీయ పార్టీలనూ ఆయన అభ్యర్థించారు. ‘‘ఇది దేశంలోని అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డలందరి ఆకాంక్ష. మనమంతా ఏకగ్రీవంగా దీన్ని నెరవేర్చాలి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
చరిత్రాత్మక గర్హి కంటోన్మెంట్ వేదికగా.. గర్వించదగ్గ ఉత్తరాఖండ్ సైనిక సంప్రదాయాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. 1962 యుద్ధంలో రైఫిల్‌మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ వంటి అమరవీరుల పరాక్రమాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంక్షేమ చర్యలను ఆయన వివరించారు. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ కింద దాదాపు రూ. 1.25 లక్షల కోట్ల పంపిణీ, మాజీ సైనికుల ఆరోగ్య పథకం బడ్జెటులో 36 శాతం పెరుగుదల, 70 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దకే మందుల సరఫరా, పిల్లల విద్యా గ్రాంట్ల రెట్టింపు, కుమార్తెల వివాహ సహాయాన్ని రూ. 50,000 నుంచి రూ. లక్షకు పెంచడం వంటి అంశాలను ప్రస్తావించారు. ‘‘సాయుధ దళాలను బలోపేతం చేయడం, మన సైనికుల కుటుంబాలను గౌరవించడం మా ప్రభుత్వానికి రాజీపడలేని ప్రాధాన్య అంశాలు’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
పురోగతి, ప్రకృతి, సంస్కృతులను సమపాళ్లలో మేళవిస్తూ వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవాలని పిలుపునిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఎక్స్‌ప్రెస్ రహదారి ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రజలకూ, భారతీయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశభక్తి, అంకితభావం, అన్ని రంగాల్లో అభివృద్ధిని మేళవించడం ద్వారానే నిజమైన అభివృద్ధి చెందిన భారత్‌ను మనం నిర్మించగలం’’ అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2252059)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam