లోక్‌సభ సచివాలయం
బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్ భవన సముదాయంలోని ప్రేరణ స్థలం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్
బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అంజలి ఘటించిన కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, మాజీ ఎంపీలు, ఇతర ప్రముఖులు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం ఒక సాహసోపేతమైన పోరాట గాథ: లోక్‌సభ స్పీకర్
స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తర్వాతి తరాలను ప్రభావితం చేసి, స్ఫూర్తికి ఒక శాశ్వత కేంద్రంగా నిలిచిన బాబాసాహెబ్ దార్శనికత: లోక్‌సభ స్పీకర్
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 2:07PM by PIB Hyderabad
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నేడు పార్లమెంట్ భవన సముదాయంలోని ‘ప్రేరణా స్థలం’ వద్ద ఆయన విగ్రహానికి భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, పార్లమెంట్ సభ్యులు, మాజీ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొని బాబాసాహెబ్‌కు అంజలి ఘటించారు.
అనంతరం సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే, ఇతర ఎంపీలు, మాజీ పార్లమెంటు సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం లోక్‌సభ సచివాలయానికి చెందిన ‘ప్రజాస్వామ్యాల కోసం పార్లమెంటరీ పరిశోధన, శిక్షణ సంస్థ’ (ప్రైడ్), సంవిధాన్ సదన్‌లో నిర్వహించిన “నో యువర్ లీడర్” కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి శ్రీ ఓం బిర్లా ప్రసంగించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన అసాధారణ నైపుణ్యం, అంకితభావం, పట్టుదలతో తన జీవితంలోని ప్రతి సవాలును ఒక అవకాశంగా మార్చుకున్నారని కొనియాడారు. ఆయన జీవితం, ఆశయాలు, ఆలోచనలు, దేశ నిర్మాణంలో ఆయన చేసిన విశేష కృషి మనందరికీ నిరంతరం స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని శ్రీ ఓం బిర్లా చెప్పారు.
బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అందించిన విశేష సేవలను ప్రస్తావిస్తూ.. రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, ఎలాంటి వివక్ష లేని ఓటు హక్కు వంటి ప్రగతిశీల నిబంధనలు బలమైన భారతదేశానికి పునాది వేశాయని శ్రీ బిర్లా పేర్కొన్నారు. ఇవి దేశంలోని ప్రజాస్వామ్యానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలకు కూడా స్ఫూర్తినిస్తునే ఉన్నాయని ఆయన అన్నారు.
భారత యువతను బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ ఆలోచనలకు అసలైన రాయబారులుగా అభివర్ణించిన శ్రీ బిర్లా.. ఎల్లప్పుడూ ‘దేశమే ప్రథమం’ అనే నిబద్ధతతో పని చేయాలని వారిని కోరారు. యువతలోని ప్రతిభ, నైపుణ్యాలు, ఆవిష్కరణలు, అంకితభావమే భారత్‌ను మరింత బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శ్రీ బిర్లా ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘బీఆర్ అంబేద్కర్ జీవితం ఒక సాహసోపేతమైన పోరాట గాథ. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన అద్భుతమైన ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. తన అజేయమైన ధైర్యం, అవిశ్రాంత కృషి, విద్య పట్ల ఉన్న అంకితభావంతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా, లక్షలాది మంది అణగారిన, నిరుపేద ప్రజలకు సరికొత్త ఆశాకిరణంగా నిలిచారు.
సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ఆయన తన జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా చేసుకున్నారు. ఈ ఆశయాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా దేశానికి బలమైన, దూరదృష్టి గల దిశానిర్దేశం చేశారు. బాబాసాహెబ్ మన దేశపు విశిష్టమైన రత్నం. ఆయన జీవితం, దార్శనికత స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా అనేక తరాలను ప్రభావితం చేశాయి. ఆయన మనందరికీ నిరంతరం స్ఫూర్తిదాయకం.
రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఆయన దేశానికి అత్యంత దూరదృష్టితో కూడిన రాజ్యాంగాన్ని అందించారు. ఇది నేటికీ మన ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా ఉంటూ, ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షిస్తోంది. విద్య, చైతన్యం, సామూహిక కృషి ద్వారా సానుకూల సామాజిక మార్పు సాధ్యమని ఆయన జీవితం మనకు నేర్పుతుంది.
అభివృద్ధి చెందిన, సమగ్రమైన భారత్‌ను నిర్మించే దిశగా మనం ముందుకు సాగుతున్న నేటి తరుణంలో.. బాబాసాహెబ్ ఆలోచనలు మరింత సందర్భోచితంగా మారాయి. అన్యాయం, అసమానత, వివక్షకు వ్యతిరేకంగా నిలబడటానికి ఆయన చేసిన పోరాటం, సిద్ధాంతాలు మనల్ని ఎల్లప్పుడూ స్పూర్తినిస్తూనే ఉంటాయి.
న్యాయమైన, సామరస్యపూర్వకమైన, బలమైన భారత్‌ను నిర్మించడంలో డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తిదాయక జీవితం, ఆదర్శాలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయి.’’
***
(రిలీజ్ ఐడి: 2251890)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10