వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అంకురసంస్థల మూలధన సమీకరణ కోసం రూ.10,000 కోట్ల నిధితో 'స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0'ను నోటిఫై చేసిన ప్రభుత్వం
డీప్ టెక్, ప్రారంభ వృద్ధి-దశ, వినూత్న తయారీ రంగ అంకురసంస్థలకు మద్దతుగా
'స్టార్టప్ ఇండియా ఎఫ్‌వోఎఫ్ 2.0'.
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2026 6:50PM by PIB Hyderabad
దేశంలోని అంకురసంస్థల వ్యవస్థ కోసం వెంచర్, వృద్ధి మూలధన సమీకరణ లక్ష్యంగా మొత్తం రూ. 10,000 కోట్ల నిధితో 'స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0' ను ప్రభుత్వం నోటిఫై చేసింది.
అంకురసంస్థల కోసం నిధుల కొరతను పరిష్కరించడానికి, దేశీయ మూలధనాన్ని పెంపొందించడం లక్ష్యంగా 'స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళిక' కింద 2016లో ప్రారంభించిన 'ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్' (ఎఫ్ఎఫ్ఎస్ 1.0) అద్భుత పనితీరు ఆధారంగా 'స్టార్టప్ ఇండియా ఎఫ్‌వోఎఫ్ 2.0' ను రూపొందించారు.
16వ, 17వ ఆర్థిక సంఘాల పరిధిలో... అర్హత కలిగిన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్‌ల) కోసం 'స్టార్టప్ ఇండియా ఎఫ్‌వోఎఫ్ 2.0' మొత్తం రూ. 10,000 కోట్ల నిధిని కలిగి ఉంటుంది.
స్టార్టప్ ఇండియా ఎఫ్‌వోఎఫ్ 2.0 కింద పెట్టుబడులు... డీప్ టెక్ అంకురసంస్థలు, చిన్న ఏఐఎఫ్‌ల మద్దతు గల ప్రారంభ వృద్ధి దశ అంకురసంస్థలు, టెక్నాలజీ ఆధారిత, వినూత్న తయారీ రంగ అంకురసంస్థలు, రంగం లేదా దశతో సంబంధం లేని అంకురసంస్థలు సహా ప్రాధాన్య విభాగాలకు మద్దతునిచ్చే ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులపై దృష్టి సారిస్తాయి.
ఏఐఎఫ్‌ల కోసం ఒక క్రమబద్ధమైన ఎంపిక ప్రక్రియను స్టార్టప్ ఇండియా ఎఫ్‌వోఎఫ్ 2.0 అనుసరిస్తుంది. ఇందులో భాగంగా అంకురసంస్థల వ్యవస్థకు చెందిన అనుభవజ్ఞులతో కూడిన వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ (వీసీఐసీ) ద్వారా దరఖాస్తులను పరిశీలిస్తారు. ఈ పథకంలో పటిష్ఠ పర్యవేక్షణ, నియంత్రణ యంత్రాంగాలను పొందుపరిచారు. పథకం అమలు, పనితీరును పర్యవేక్షించడానికి ఒక సాధికార కమిటీని (ఈసీ) ఏర్పాటు చేస్తారు. తగిన పాలనాపరమైన భద్రతలతో కూడిన విధాన ప్రణాళిక ద్వారా ప్రభుత్వం, సంస్థాగత పెట్టుబడిదారుల సమష్టి పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలనూ దీనిలో చేర్చారు.
వీసీఐసీ నిర్వహణ మార్గదర్శకాలు, కూర్పును పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) జారీ చేస్తుంది.
భారత ఆవిష్కరణల ఆధారిత వృద్ధి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడంలో స్టార్టప్ ఇండియా ఎఫ్‌వోఎఫ్ 2.0 కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రపంచంతో పోటీపడగల సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించే అంకురసంస్థలకు మద్దతునివ్వడం ద్వారా ఈ పథకం... భారత ఆర్థిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఉత్పాదక సామర్థ్యాలను పెంచడానికి, నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడానికి, ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌ను నిలపడానికి దోహదపడుతుంది.
నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్ఐడీబీఐ) అమలు సంస్థ (ఐఏ)గా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ప్రతిపాదిత పథకాన్ని అమలు చేయడానికి మరొక దేశీయ అమలు సంస్థనూ ఎంపిక చేస్తారు.
కేంద్ర ప్రభుత్వం ‘అంకురసంస్థలు’గా గుర్తించిన సంస్థల్లో పెట్టుబడి పెట్టేందుకు గానూ, సెబీలో నమోదైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్) కార్పస్ కోసం స్టార్టప్ ఇండియా ఎఫ్‌వోఎఫ్ 2.0 తన వంతు సహకారాన్ని అందిస్తుంది.
వికసిత్ భారత్ @ 2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా... వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, భారత అంకురసంస్థల వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం పట్ల ప్రభుత్వ నిరంతర నిబద్ధతకు ఈ నిధి ప్రతీకగా నిలుస్తుంది.
నోటిఫికేషన్ కింది లింక్ వద్ద అందుబాటులో ఉంది:
egazette.gov.in/(S(di4any4wjavvuxgtdt4izvhc))/ViewPDF.aspx
***
(రిలీజ్ ఐడి: 2251667)
సందర్శకుల సూచీ సంఖ్య : : 34