రైల్వే మంత్రిత్వ శాఖ
నిరుపేదలతో పాటు సుదూర ప్రాంతాల ప్రజలకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేలు.. పెట్టుబడిలో ముందంజ వేస్తూ వైవిధ్య భరిత భారత్‌ను ఏకతాటి మీదకు తెస్తున్న రైల్వేలు
2025-26లో రికార్డు స్థాయిలో 6,000 కి.మీ. పొడవైన రైల్వే విస్తరణ పనులకు ఆమోదం..
వెనకటి సంవత్సరంతో పోలిస్తే 114 శాతం కన్నా అధిక వృద్ధి
గిరిజన ప్రాంతాల్లో కొత్త రైలు మార్గాల ఏర్పాటు.. సమయ పాలనలో మెరుగుదలను దృష్టిలో పెట్టుకొని రద్దీ ఉన్న మార్గాల వ్యవస్థీకరణ... ప్రయాణికులకు మేలైన అనుభవాన్ని అందించడంపై ప్రత్యేక శ్రద్ధ
రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడి.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 110 శాతం కన్నా ఎక్కువ.. భారత్‌లో ప్రపంచ స్థాయి అధిక సామర్థ్యం కలిగి ఉండే రైల్ నెట్‌వర్క్ అభివృద్ధికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 100 ప్రాజెక్టుల మంజూరు
కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రయాణ కాలాన్ని తగ్గించడం, ఉద్యోగాల కల్పన, కీలక పరిశ్రమలకు ప్రోత్సాహంతో పాటు రవాణా ఖర్చులో తగ్గింపునకు తోడ్పడనున్న ప్రాజెక్టులివి
అన్ని ప్రధాన రాష్ట్రాలనూ చుట్టి వచ్చే ప్రాజెక్టులు.. దేశవ్యాప్తంగా ప్రయాణికులతో పాటు సరకు రవాణా సేవల మెరుగుదలకు అధిక జనసంఖ్య కలిగిన రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ
సరకు రవాణా నడవాలు, పారిశ్రామిక అనుసంధానం, ప్రయాణికుల రాకపోకలను బలోపేతం చేయనున్న మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్
పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మార్కెట్లను, ఆరోగ్యసంరక్షణను, విద్యను, ఉపాధి అవకాశాల్ని అందరి అందుబాటులోకి తెస్తూ ప్రజలను ఏకతాటి మీద నిలిపే ప్రాజెక్టులు
రూ.1,000 కోట్ల కన్నా ఎక్కువ విలువ గల 35కు పైగా ప్రాజెక్టులు.. వాటిలో కసారా-మన్మాడ్, ఖర్‌సియా-నయా రాయ్‌పుర్-పర్మల్‌కసాతో పాటు ఇటార్సీ-నాగ్‌పుర్, సికందరాబాద్-వాడీ ల ఉన్నతీకరణ ప్రాజెక్టులు కూడా
కార్గోలో 3,000 ఎంటీల ‘ఫోకస్‌డ్ మిషన్’.. నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచుతూ ఇంధన భద్రత, ఓడరేవుల అనుసంధానం, బొగ్గు సత్వర రవాణా, కోస్తా వాణిజ్యానికి దన్ను ఈ ప్రాజెక్టుల లక్ష్యాలు
నాడు పోస్టు చేయడమైనది:
12 APR 2026 3:05PM by PIB Hyderabad
దేశంలో చివరి అంచెను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంతో పాటు నిరుపేదలకు, ఆదరణకు నోచుకోని ప్రాంతాలకూ సేవల్ని అందిస్తూ భారతీయ రైల్వేల సంస్థ ‘పీఎం గతి శక్తి జాతీయ బృహత్ ప్రణాళిక’ (పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్) లో భాగంగా పరివర్తన ప్రధాన విస్తరణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. సమ్మిళిత వృద్ధిపై, జాతీయ ఏకీకరణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ 2025-2626 ఆర్థిక సంవత్సరంలో కొత్త రైలు మార్గాలు, డబ్లింగు, మల్టీట్రాకింగులు సహా ఇతర పనులతో ముడిపెట్టిన 100 రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇదివరకు ఎన్నడూ ఎరుగని స్థాయిలో చేపట్టిన ఈ ప్రయత్నాలు మెరుగైన అనుసంధానం ద్వారా వివిధ రాష్ట్రాలను ఏకతాటి మీదకు తీసుకురావడంలో భారతీయ రైల్వేల నిబద్దతను చాటి చెబుతున్నాయి. అంతేకాదు, అధిక సామర్థ్యం కలిగిన, రాబోయే కాలం అవసరాలను తీర్చగలిగిన నెట్‌వర్క్ ఏర్పాటుకు పునాదిని కూడా వేస్తున్నాయి.
ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడిని నిర్దేశించారు. 6,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రైల్వే నెట్‌వర్క్ వీటి పరిధిలోకి రానుంది. రైల్వే విస్తరణలో ఒక చరిత్రాత్మక ప్రగతి ప్రస్థానాన్ని ఇది సూచిస్తోంది. రూ.72,869 కోట్ల ఖర్చయ్యే 64 ప్రాజెక్టులకు (2,800 కిలోమీటర్ల కన్నా మించినవి) మంజూరునిచ్చిన 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ సారి ప్రాజెక్టుల అనుమతుల్లో 56 శాతం వృద్ధి చోటుచేసుకుంది. రూట్ కవరేజీలో 114 శాతాని కన్న ఎక్కువ పెరుగుదల ఉంది. ఆర్థిక సహాయంలో 110 శాతం కన్న ఎక్కువగా చెప్పుకోదగిన వృద్ధి నమోదైంది.
మంజూరు చేసిన 100 ప్రాజెక్టుల్లో కొత్త మార్గాలు, డబ్లింగు, మల్టీట్రాకింగ్ పనులతో పాటు, బైపాస్ లైన్లు, ఫ్లయ్ ఓవర్లు, కార్డ్ లైన్లు కలిసి ఉన్నాయి. రద్దీతో కూడిన మార్గాల్లో రద్దీని నివారించడం, రైళ్లు నిర్దిష్ట వేళలకు నడిచేలా చూడడం, ఇంతవరకు తగినంత సదుపాయాలకు నోచుకోని ప్రాంతాల వరకూ అనుసంధానాన్ని విస్తరించడం ఈ ప్రాజెక్టులకు నిర్దేశించిన వ్యూహాత్మక లక్ష్యాలు. ఈ కార్యక్రమాలను అమలు చేసినందువల్ల పూర్తి నెట్‌వర్క్ నిర్వహణ సామర్థ్యం చాలావరకూ మెరుగుపడుతుందని, ప్రయాణానికి పట్టే కాలం తగ్గుతుందన్న అంచనాలున్నాయి.
ఈ ప్రాజెక్టులు దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. వీటి ద్వారా రైల్వే నెట్‌వర్క్ సమతౌల్య, సమ్మిళిత విస్తరణకు మార్గం సుగమమవుతుంది. 17 ప్రాజెక్టులతో మహారాష్ట్ర, 11 ప్రాజెక్టులతో బీహార్, 10 ప్రాజెక్టులతో జార్ఖండ్, 9 ప్రాజెక్టులతో మధ్యప్రదేశ్ కీలక ఫోకస్ రాష్ట్రాలుగా తెర మీదకు వచ్చాయి. సరకు రవాణా నడవాలు (ఫ్రయిట్ కారిడార్స్), పారిశ్రామిక అనుసంధానం, ప్రయాణికుల అవసరాల రీత్యా వీటి భూమిక కీలకం. ఈ ప్రాంతాల్లో పెట్టుబడి విస్తృతి ప్రయాణికులకు సేవలనీ, సరకు రవాణాని చాలా వరకూ మెరుగుపరచనుంది.
మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలోని ఈ ప్రాజెక్టులతో సరకు రవాణా నడవాలు బలోపేతం కానున్నాయి. పారిశ్రామిక సంబంధాలు బలపడతాయి. ప్రయాణికుల రాకపోకలు మెరుగుపడతాయి. ఈ రాష్ట్రాలు భారత ఆధునిక రవాణా నెట్‌వర్కుకు వెన్నెముకగా ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో మెరుగైన అనుసంధానం ఏర్పడడం వల్ల పూర్తి ఆర్థిక వ్యవస్థకు విస్తృత ప్రయోజనాలు లభిస్తాయి.
పీఎం గతిశక్తి నేషనల్ మాస్లర్ ప్లానుకు అనుగుణంగా, ఈ ప్రాజెక్టులు ఒక్క మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక మార్పునకు దోహదపడతాయి. గిరిజన ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల్లో రైలు అనుసంధానాన్ని విస్తరించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రావ్‌ఘాట్-జగ్‌దల్‌పూర్ మార్గం వంటి చరిత్రాత్మక కార్యక్రమం, జార్ఖండ్, ఒడిశాల్లోని అనేక ఇతర నడవాలు మార్కెట్లతో పాటు ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి సంబంధిత అవకాశాల్ని అందుబాటులోకి తీసుకు రానున్నాయి. దీంతో ఆదరణకు నోచుకోని జనులను జాతీయ అభివృద్ధి తాలూకు ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం సాధ్యమవుతుంది.
ఆర్థిక దృష్టికోణంలో నుంచి పరిశీలించినప్పుడు ఈ విస్తరణ పెద్ద ఎత్తున పరివర్తన ప్రధాన పెట్టుబడుల దిశగా ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుంది. ప్రధాన ప్రాజెక్టుల్లో దాదాపు రూ.10,150 కోట్ల వ్యయంతో కసారా-మన్మాడ్ 3వ, 4వ లైన్లు (131 కి.మీ.), రూ.8,740 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో కూడిన ఖర్‌సియా-నయా రాయ్‌పూర్-పర్మల్‌కసా 5వ, 6వ లైన్లు (278 కి.మీ.) తో పాటు రూ.5,450 కోట్లకు పైగా ఖర్చు అయ్యే ఇటార్సీ-నాగ్‌పూర్ 4వ లైను (297 కి.మీ.)తో పాటు రూ.5,000 కోట్ల కు మించిన ఖర్చుతో కూడిన సికందరాబాద్ (సనత్‌నగర్)-వాడీ 3వ, 4వ లైన్లు (173 కి.మీ.) భాగంగా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే, ఒక్క ఈ ప్రాజెక్టులకే రూ.28,000 కోట్లు ఖర్చవుతుంది. అధిక రద్దీతో కూడిన ట్రంక్ రూట్లను పటిష్ఠపరచడానికి రైల్వేలు ఎంతగా శ్రద్ధ వహిస్తోందీ ఈ ప్రాజెక్టులు తెలియజేస్తున్నాయి.
ఈ ప్రాజెక్టులు ‘మిషన్ 3000 ఎంటీ’ కార్యక్రమంతో వ్యూహాత్మకంగా ముడిపడి ఉన్నాయి. సరకు రవాణా సామర్థ్యంలో గణనీయ వృద్ధిని సాధించడం వీటి లక్ష్యం. పోర్ట్‌ఫోలియోలో ఇంధన నడవా (ఎనర్జీ కారిడార్) ప్రాజెక్టులది పైచేయిగా ఉంది. ఇవి బొగ్గు, ఖనిజాల సత్వర రాకపోకలకు వీలు కల్పిస్తాయి. అంతేకాక, ఇంధన భద్రతను పటిష్ఠపరుస్తాయి. కీలక మార్గాల్లో రద్దీని హై డెన్సిటీ నెట్‌వర్క్ ప్రాజెక్టులు తగ్గిస్తాయి. మరో వైపు, ‘రైల్ సాగర్ కారిడార్’తో ఓడరేవుల అనుసంధానంతో పాటు కోస్తా వాణిజ్యంలో మెరుగుదల సాధ్యపడుతుంది. ఇవన్నీ కలిపితే, ఈ కార్య్రమం మొత్తంమీద నెట్‌వర్క్ సామర్థ్యాన్నీ, ఆధునిక రవాణా వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం ఖాయం.
ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడంతో ఉపాధి అవకాశాలు అందివస్తాయి. ఉక్కు, సిమెంటు వంటి ప్రధాన రంగాల్లో డిమాండు పెరుగుతుంది. దేశమంతటా ఆధునిక రవాణా వ్యవస్థ ఖర్చులు తగ్గుతాయన్న అంచనాలున్నాయి. ఈ ప్రాజెక్టులు పురోగమించే కొద్దీ, రైల్వే సామర్థ్యం పెరుగుతుంది. సేవల అందజేత మెరుగవుతుంది. ఈ ప్రాజెక్టులు భారత ఆర్థికాభివృద్ధికి ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తాయి. ఇది ఏదో మామూలు ప్రగతి కాదు.. భారత్ తదుపరి ఆర్థిక ముందంజ ప్రక్రియ సాఫీగా సాగిపోయేందుకు పట్టాలను ఈ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయన్న సంగతి స్పష్టమవుతున్నది.
***
(రిలీజ్ ఐడి: 2251541)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11