రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వందే భారత్ రైళ్లకు పెరుగుతున్న ప్రజాదరణ... సత్వర... సౌలభ్య .. ఆధునిక రైలు ప్రయాణ నవ శకానికి ఇనుమడిస్తున్న డిమాండ్‌


· సుమారు 34 శాతం వృద్ధితో 2025-26లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దాదాపు 4 కోట్ల మంది ప్రయాణం

· ఈ హై స్పీడ్ రైళ్లు ఆరంభం నుంచే సుమారు లక్ష ట్రిప్పులలో 9.1 కోట్ల మందికిపైగా ప్రయాణికులకు సేవలందించాయి

· న్యూఢిల్లీ-వారణాసి.. న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవి-కట్రా.. సికింద్రాబాద్-విశాఖపట్నం.. చెన్నై-మైసూరు వంటి అధిక డిమాండ్ గల మార్గాల్లో ప్రయాణాల పెరుగుదలతో పర్యాటకం, ప్రాంతీయ అనుసంధానానికి ప్రోత్సాహం

· తొలి మూడు నెలల్లోనే 1.21 లక్షల మంది ప్రయాణికులతో వందే భారత్ స్లీపర్ సర్వీస్ 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీ సాధించింది

· మెరుగైన వేగం.. భద్రత విశిష్టతలు.. ప్రయాణికులకు సౌకర్యాలతో స్వదేశీ పరిజ్ఞానం ద్వారా రూపొందిన వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతను కొనసాగిస్తోంది

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 7:55PM by PIB Hyderabad

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ నెట్‌వర్క్‌కు భారత రైల్వే ప్రయాణికుల ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ మేరకు 2024-25లో 2.97 కోట్ల మంది ఈ రైళ్ల ద్వారా ప్రయాణించగా, 2025-26లో సుమారు 3.98 కోట్ల మంది ప్రయాణించారు. తద్వారా దాదాపు 34 శాతం బలమైన వార్షిక వృద్ధి నమోదైంది.  దేశవ్యాప్తంగా వేగవంతమైన, సౌకర్యవంతమైన, ఆధునిక రైలు ప్రయాణానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ప్రజాదరణలో గణనీయ పెరుగుదల స్పష్టం చేస్తుంది. వాస్తవానికి వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ఆరంభం నుంఏ లక్ష ట్రిప్పుల ద్వారా 9.1 కోట్ల మందికి పైగా ప్రయాణికులకు సేవలందించింది. ప్రజల విస్తృత విశ్వాసాన్ని, ఈ రైళ్లకు పెరుగుతున్న నిరంతర డిమాండ్‌ను ఈ పరిణామం ప్రతిబింబిస్తోంది.

తొలి దేశీయ రూపకల్పన-తయారీ ద్వార ఈ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ భారత రైల్వే ప్రయాణాన్ని పునర్నిర్వచిస్తోంది. దేశంలో తొలుత 2019 ఫిబ్రవరిలో న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో ఈ రైలు ప్రారంభం కాగా, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం వేగం, సౌకర్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలిఏ దేశవ్యాప్త నెట్‌వర్క్‌గా ఇది రూపొందింది.

 

న్యూఢిల్లీ–వారణాసి మార్గం నేడు అత్యంత రద్దీగా ఉండటంతో ఇప్పటిదాకా 73 లక్షల మందికిపైగా ప్రయాణించారు. న్యూఢిల్లీ–శ్రీ మాతా వైష్ణో దేవి-కట్రా మార్గంలో సుమారు 56 లక్షల మంది ప్రయాణించారు. పుణ్యక్షేత్ర యాత్రలలో ఈ రైలు తన ప్రాధాన్యాన్ని చాటి చెబుతోంది. దక్షిణ భారతదేశంలోని సికింద్రాబాద్–విశాఖపట్నం మార్గంలో 48 లక్షల మందికి పైగా ప్రయాణికులకు ఈ రైలు సేవలందించింది. మరోవైపు డాక్టర్‌ ఎంజీఆర్‌ సెంట్రల్ (చెన్నై)-మైసూరు మార్గంలో36 లక్షల మందికిపైగా ప్రయాణించారు. ఈ రైళ్ల నెట్‌వర్క్‌లో రద్దీ బలమైన ప్రాంతీయ డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. ఈ సేవలు పర్యాటక రంగానికి కీలక సాధనాలుగా మారాయి. కీలక మత, సాంస్కృతిక, తీరప్రాంత గమ్యాలకు ప్రయాణాన్ని మెరుగుపరుస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహించడంతోపాటు సందర్శకుల రాకపోకలను ఈ నెట్‌వర్క్‌ ఇనుమడింపజేస్తోంది.

సుదూర ప్రయాణ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ భారతీయ రైల్వే 2026 జనవరిలో వందే భారత్ స్లీపర్ సర్వీసును ప్రవేశపెట్టింది. ఇది ప్రారంభమైన తొలి మూడు నెలల్లోనే, దీని ద్వారా  119 ట్రిప్పులలో 1.21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసింది. అంటే- 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీ సాధించింది. రాత్రివేళ ప్రీమియం ప్రయాణానికిగల బలమైన డిమాండ్‌ను, ప్రయాణికుల విశ్వాసం పెరగడాన్ని ఇది సూచిస్తుంది.

ఆవిష్కరణలు, ప్రయాణిక-కేంద్రక సేవలు, స్వదేశీ తయారీ వగైరాలపై భారతీయ రైల్వే నిబద్ధతకు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ఒక నిదర్శనంగా నిలుస్తోంది. మెట్రో నగరాలు, పుణ్యక్షేత్రాలు, వారసత్వ నగరాలు, వర్ధమాన ఆర్థిక కేంద్రాలను జోడిస్తూ నిరంతర విస్తరణ సహా స్లీపర్ రకాన్ని కూడా ప్రవేశపెట్టడం ద్వారా వేగవంతం, సురక్షితం, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ భారతీయ రైల్వే ముందడుగు వేస్తోంది. మొత్తం మీద భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే ఆధునిక రైలు ప్రయాణ పురోగమనానికి నేతృత్వం వహిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2251119) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada