వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించిన వాణిజ్య శాఖ - ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖలు... ప్యాకేజింగ్, వస్తు రవాణా, నౌకాయాన సవాళ్లను అధిగమించడమే లక్ష్యం


నిరంతరాయంగా వాణిజ్యం, భాగస్వామ్య పక్షాల ఆందోళనలకు పరిష్కారం, సరఫరా వ్యవస్థ స్థిరీకరణ దిశగా సమన్వయంతో కూడిన చర్యలు

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 5:40PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, సమన్వయంతో కూడిన క్రియాశీల చర్యలను భారత ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా భారత వాణిజ్య, ఎగుమతి వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న వస్తే రవాణా, ప్యాకేజింగ్, నౌకాయాన సంబంధిత అవరోధాలను అధిగమించడం కోసం.. ఆయా రంగాల నిపుణులు, ఉన్నతాధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది.

ఈ దిశగా రెండు కీలక సమావేశాలు జరిగాయి. ఒక సమావేశాన్ని వాణిజ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించగా.. ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంవోపీఎస్‌డబ్ల్యూ) కార్యదర్శి - వాణిజ్య శాఖ కార్యదర్శి మరో సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఓడరేవు అధికారులు, నౌకాయాన సంస్థలు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమల ప్రతినిధులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

వాణిజ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ప్యాకేజింగ్ సామగ్రి, వాటికి అవసరమైన ముడిసరుకుల సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలతో.. పాలిమర్లు, రెసిన్ల వంటి కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు పెరగడమే కాకుండా, వాటి లభ్యతపై ప్రభావం పడే అవకాశాలను చర్చించారు. దీనివల్ల అన్ని రంగాల్లోనూ ప్యాకేజింగ్ సామగ్రి ఖర్చులు పెరగవచ్చని భావిస్తున్నారు. కీలకమైన ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల.. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని పరిశ్రమల ప్రతినిధులు వివరించారు.

సరఫరా వ్యవస్థలో ఆటంకాలు, రవాణా ఇబ్బందులు, ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల.. దుస్తులు, తోలు, టెలికాం/ఆప్టికల్ ఫైబర్, వైద్య పరికరాల వంటి పరిశ్రమలపై ప్రభావం పడే అవకాశం ఉందని వివిధ రంగాల ప్రతినిధులు వివరించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూనే.. ఎల్ఎన్‌జీ, హీలియం, పెట్రోకెమికల్ ఉత్పన్నాల వంటి కీలక ముడిసరుకుల లభ్యత విషయంలో అంతరాయాలు లేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే, పరిశ్రమల వద్ద నగదు లభ్యత పెరగడానికి వీలుగా జీఎస్టీ రీఫండ్లను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సవాళ్లు అనేక రంగాలపై ప్రభావం చూపుతాయని వాణిజ్య శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. కీలక ముడిసరుకుల లభ్యతలో అంతరాయం లేకుండా చూడడం, ఉత్పత్తిలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్యాకేజింగ్‌కు కీలకమైన ముడిసరుకులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలనీ, దేశంలో వాటి ఉత్పత్తి సామర్థ్యం - దిగుమతులపై మన ఆధీనతలను అంచనా వేయాలని సూచించారు. అలాగే ఎగుమతి - దిగుమతుల ధోరణులను, వివిధ రంగాల్లో ఒత్తిళ్లను ప్రతివారం పర్యవేక్షించడం కోసం ఒక నిర్మాణాత్మక పర్యవేక్షక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. కొత్తగా తలెత్తే సవాళ్లను గుర్తించి, సకాలంలో వాటి పరిష్కార చర్యలను చేపట్టేందుకు.. పరిశ్రమల ప్రతినిధులతో, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

ఎంవోపీఎస్‌డబ్ల్యూ కార్యదర్శి - వాణిజ్య శాఖ కార్యదర్శి సంయుక్తంగా అధ్యక్షత వహించిన రెండో సమావేశం.. భాగస్వామ్య పక్షాలు లేవనెత్తిన వస్తురవాణా, నౌకాయాన సంబంధిత సమస్యల పరిష్కారం దిశగా ఓ నిర్మాణాత్మక వేదికగా నిలిచింది. కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) చైర్మన్ కూడా హాజరైన ఈ సమావేశంలో సమన్వయంతో కూడిన సమగ్ర చర్చలు జరిగాయి.

డాక్యుమెంటేషన్ ప్రక్రియ, ఎగుమతి కాకుండా వెనక్కు వచ్చే సరుకు, సరుకు రవాణా సమస్యలు, షిప్పింగ్ లైన్లతో ప్రయోజనాలు, వైమానిక మార్గాల్లో సరుకు రవాణా వ్యయం, రైల్వే రాయితీలు, బంకర్లలో ఇంధన లభ్యత సహా.. వివిధ అంశాలపై నౌకాయాన కార్యదర్శి చర్చించారు. నిర్వహణపరమైన సవాళ్ల పరిష్కారంలో ప్రభుత్వ క్రియాశీలతకు ఈ చర్చలు నిదర్శనం.

ఓడల లభ్యత, సరుకు నిర్వహణ, ఓడల నడుమ సరుకు మార్పిడి వంటి ప్రస్తుత పరిస్థితులపై సంబంధిత భాగస్వామ్య పక్షాలకు వివరించారు. సరుకు రవాణా సాఫీగా సాగుతోందని, పెద్ద అడ్డంకులేవీ లేవని అధికారులు తెలిపారు. ఇది మన రవాణా వ్యవస్థ పటిష్టతను చాటుతోంది.

ఓడరేవుల వద్ద సరుకు అనుమతుల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు తీసుకున్న వివిధ చర్యలను సీబీఐసీ చైర్మన్ వివరించారు.

ప్రమాదకరమైన సరుకు రవాణాకు సంబంధించిన అంశాలపై సానుకూల చర్చలు జరిగాయి. ఈ ప్రక్రియను మరింత మరింత క్రమబద్ధీకరించే దిశగా.. సరుకులను కిందికి దింపడం వంటి నిర్దిష్ట కేసుల పరిశీలనకు కస్టమ్స్ విభాగం అంగీకరించింది.

నౌకాయాన సంస్థలు అందించాల్సిన ప్రయోజనాలను ఎగుమతిదారులకు బదిలీ చేయకపోవడానికి సంబంధించిన సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు వివిధ భాగస్వామ్య పక్షాలు ఈ సందర్భంగా తెలిపాయి.

భవిష్యత్తులో తలెత్తే సమస్యలను ముందస్తుగా పరిష్కరించేందుకు.. ఎగుమతిదారులు తమకు ఎదురయ్యే ప్రత్యేక సమస్యలను వెంటనే నివేదించాలని ప్రభుత్వం కోరింది. తద్వారా వాటిని వేగంగా, సమర్థంగా పరిష్కరించవచ్చని సూచించింది.

పారదర్శకతను, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచే తక్షణ చర్యలు తీసుకోవాలని.. సమావేశం అనంతరం అన్ని పోర్టులు, టెర్మినల్ ఆపరేటర్లను ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సరుకు రవాణా, ఓడలకు అందించే రాయితీలు, మినహాయింపుల వివరాలను బహిర్గతం చేయడం, ఓడలకు అవసరమైన ఇంధన లభ్యతను సమీక్షించడం, నిలిచిపోయిన కంటైనర్లను వేగంగా తరలించడం వంటివి ఈ చర్యల్లో ఉన్నాయి. ఇవి వ్యవస్థాగత సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్వహణపరమైన సవాళ్లను వేగంగా, సమర్థంగా పరిష్కరించేందుకు అన్ని భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఈ సమన్వయం వల్ల భారత వాణిజ్య వ్యవస్థను మరింత బలోపేతమవడమే కాకుండా.. అంతరాయాలను తగ్గిస్తూ ఈ క్లిష్ట సమయంలో పరిశ్రమలకు, వాణిజ్యానికి అది అండగా నిలుస్తోంది.

దేశ వాణిజ్య ప్రయోజనాలను కాపాడటానికి, సరుకు రవాణా కార్యకలాపాలు సాఫీగా సాగేలా చూడడం కోసం... వాణిజ్య శాఖ, ఓడరేవులు - నౌకాయానం - జలమార్గాల మంత్రిత్వ శాఖ, కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) కలిసి పనిచేస్తాయి. సంబంధిత మంత్రిత్వ శాఖలు, పరిశ్రమల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అవసరమైన అన్ని చర్యలను ఈ విభాగాలు కొనసాగిస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2251113) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati