మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎన్‌ఈపీ-2020లో భాగంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వృత్తిపరంగా సమగ్ర మార్గదర్శకత్వాన్ని అందించేందుకు కెరీర్ కార్డ్స్‌ను ప్రారంభించిన పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం కార్యదర్శి
వృత్తిపరమైన మార్గదర్శకత్వం, నైపుణ్య శిక్షణ ద్వారా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సాధికారత కల్పించటం, సమ్మిళిత, సమానత్వ, జ్ఞానాధారిత సమాజ నిర్మాణానికి కీలకం: శ్రీ సంజయ్ కుమార్
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 7:52PM by PIB Hyderabad
మార్చి 31, 2026న న్యూఢిల్లీలోని కర్తవ్యభవన్-2లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగ (డీఓఎస్ఈఎల్) కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం కెరీర్ కార్డ్స్‌ను ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ వృత్తిపరమైన మార్గదర్శకత్వాన్ని సమానంగా అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం కీలకమైనది. యూనిసెఫ్ ఇండియా, ఎన్‌సీఈఆర్‌టీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ), పండిట్ సుందర్ లాల్ శర్మ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ (పీఎస్ఎస్ సీఐవీఈ), ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, దివ్యాంగుల సాధికారత విభాగం (డీఈపీడబ్ల్యుడీ) పరిధిలోని జాతీయ సంస్థల సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా ఈ కెరీర్ కార్డ్స్‌ను రూపొందించారు.

ఈ సందర్భంగా శ్రీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020, పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళిక వ్యవస్థ (ఎన్‌సీఎఫ్-ఎస్ఈ)-2023 సూత్రాలపై ఈ కార్యక్రమం ఆధారపడి ఉందని చెప్పారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు, ప్రతి ఒక్కరూ వైవిధ్యమైన విద్యా కోర్సులు, వృత్తిపరమైన మార్గాలను ఎంచుకునే అవకాశం కల్పించటమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న ప్రయాణంలో జ్ఞానాధారిత, సమానత్వ, సమ్మిళిత సమాజంగా భారత్ ఎదుగుతున్న తరుణంలో విద్యార్థులంతా తమ వంతు సహకారాన్ని అందించేలా శక్తిమంతులను చేయాలన్న కేంద్ర విద్యా శాఖ మంత్రి దార్శనికతను ఆయన స్పష్టం చేశారు.
సీడబ్ల్యూఎస్ఎన్ ను ముందుగానే గుర్తించి, పరీక్షలు నిర్వహించటం, వారి అవసరాలను చూడటం వంటివి పాఠశాల విద్యా వ్యవస్థలోనే ఉండాలన్న ఆవశ్యకతను, విద్యా సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక ఉపాధ్యాయుల కోసం అదనపు పోస్టులను సృష్టించటమే కాక, నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సాధారణ ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీలు, డీఐఈటీల సహకారంతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా ప్రణాళికను ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించనుంది.

ఎన్ఈపీ-2020లో నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని, 2030 నాటికి 12వ తరగతి పూర్తి చేసుకునే ప్రతీ విద్యార్థి కనీసం ఒక కీలక నైపుణ్యాన్ని నేర్చుకుని ఉండాలని స్పష్టం చేశారు. సీడబ్ల్యూఎస్ఎన్ సహా అందరికీ నైపుణ్య శిక్షణను చేరువ చేయటంలో పీఎస్ఎస్ సీఐవీఈ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టటం అత్యంత ఆవశ్యకమని చెబుతూ.. 2047 నాటికి భారత్ సాధించబోయే పరివర్తనలో విద్యా వ్యవస్థే కీలకంగా ఉంటుందని తెలిపారు. సమ్మిళిత విద్యనందించే విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సేవలందించే సంస్థలతో అనుబంధం కోసం ఎన్ఐఓఎస్ దీర్ఘకాలిక ఎంఓయూ కుదుర్చుకుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా సంయుక్త కార్యదర్శి శ్రీమతి ప్రాచీ పాండే మాట్లాడుతూ.. యూనిసెఫ్ ఇండియా, ఎన్‌సీఈఆర్‌టీ భాగస్వామ్యంతో పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం ఒక కెరీర్ గైడెన్స్ పుస్తకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. జూలై 29, 2024న జరిగిన అఖిల భారతీయ శిక్షా సమాగమ్ లో విడుదల చేసిన ఈ పుస్తకంలో 500 కెరీర్ కార్డులున్నట్లు వివరించారు. ఇవాళ్టి ప్రారంభోత్సవంతో ఈ జాతీయ మార్గదర్శక వ్యవస్థను ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రూపొందించినట్లు తెలిపారు. అందరికీ అర్థమయ్యేలా సుమారు 150 కార్డులను తయారు చేశామని, భారత విద్యా పరివర్తన ప్రయాణంలో సమ్మిళిత్వం విశేష లక్షణంగా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఆర్థిక సలహాదారు శ్రీమతి ఎ. శ్రీజ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన శ్రీ ధీరజ్ సాహు (అదనపు కార్యదర్శి), శ్రీ రాహుల్ సింగ్ (సీబీఎస్ఈ, ఛైర్మన్), శ్రీ దినేశ్ ప్రసాద్ సక్లానీ (ఎన్‌సీఈఆర్‌టీ, డైరెక్టర్), శ్రీమతి ప్రాచీ పాండే (సంయుక్త కార్యదర్శి), శ్రీమతి అమర్ ప్రీత్ దుగ్గల్ (సంయుక్త కార్యదర్శి), శ్రీ వికాస్ గుప్తా (కేవీఎస్ కమిషనర్), శ్రీ రాజేశ్ లఖానీ (ఎన్ వీఎస్ కమిషనర్)లతో పాటు యూనిసెఫ్ నుంచి డాక్టర్ సాధనా పాండే, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నుంచి శ్రీమతి రుక్మిణీ బెనర్జీ పాల్గొన్నారు.
వివిధ వృత్తిపరమైన అవకాశాలపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించటం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవటంలో సహకరించేలా ఆలోచనాత్మకంగా ఈ కెరీర్ కార్డ్స్‌ను రూపొందించారు. ప్రతి కార్డులో వృత్తికి సంబంధించిన బాధ్యతలు, అర్హతలు, ఆ వృత్తిలో ఎదుగుదలకు ఉపయోగపడే మార్గాల గురించి సమాచారం ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, ఆశయాలకు అనుగుణంగా పలు రంగాల గురించి తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఆకర్షణీయంగా, సులభంగా అర్థమయ్యేలా ఉన్న ఈ కార్డులు.. విద్యా, వృత్తిపరంగా విద్యార్థులు సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించుకోవటంలో మార్గనిర్దేశం చేసేందుకు ఉపాధ్యాయులకు, సలహాదారులకు ముఖ్యమైన వనరుగా ఉపయోగపడతాయి.
గతంలో యూనిసెఫ్ సహకారంతో విద్యార్థుల కోసం 500 కెరీర్ కార్డులతో కెరీర్ గైడ్ బుక్‌ను ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించింది. ప్రస్తుతం ఈ సమాచారాన్ని సీడబ్ల్యూఎస్ఎన్ కు కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా కెరీర్ మార్గదర్శకత్వం అందరికీ అందుబాటులో, సమ్మిళితత్వంతో ఉండేలా యూనిసెఫ్ సహకారంతో సీడబ్ల్యూఎస్ఎన్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ 150 కెరీర్ కార్డులను రూపొందించింది. ఈ కార్డులు ప్రస్తుతం బ్రెయిలీ లిపిలోనూ అందుబాటులో ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2250416)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13