ఉప రాష్ట్రపతి సచివాలయం
న్యూఢిల్లీలో ఇగ్నో 39వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి
ఇగ్నో స్నాతకోత్సవంలో డిగ్రీలు, డిప్లొమాలు, ధ్రువప్రతాలు స్వీకరించిన 3.2 లక్షల మందికి పైగా విద్యార్థులు
సమ్మిళిత, అందుబాటులో ఉండే ఉన్నత విద్యకు ప్రధానాధారం ఇగ్నో... అనేక దేశాల జనాభా కంటే ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఎక్కువ: ఉపరాష్ట్రపతి
మన సంప్రదాయాలకు అనుగుణంగా ఆధునిక అభివృద్ధి... శాస్త్రీయ పురోగతికి నైతిక విలువలే మార్గదర్శనం
నాడు పోస్టు చేయడమైనది:
07 APR 2026 3:28PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విద్యాలయం (ఇగ్నో) 39వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 3.2 లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు, ధ్రువపత్రాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఇగ్నో పోషించిన పరివర్తనాత్మక పాత్ర గురించి ఉపరాష్ట్రపతి వివరించారు. దేశంలో సార్వత్రిక, దూర విద్యా విధానానికి ప్రధాన ఆధారంగా ఈ విశ్వవిద్యాలయాన్ని వర్ణించారు. ఉన్నత విద్యను దేశవ్యాప్తంగా గణనీయ స్థాయిలో విస్తరించిందన్నారు. ఈ విశ్వవిద్యాలయ సమగ్ర విస్తృతి గురించి వివరిస్తూ.. ఇగ్నోలో 14 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారని వారిలో 56 శాతం మంది మహిళలు, 58 శాతం గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాలకు చెందినవారున్నాని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ అని ఇది విద్యా సమానత్వం, సామాజిక చలనశీలతను, జాతీయాభివృద్ధిని ప్రతిబింబిస్తుందన్నారు. జీవితాంతం నేర్చుకొనే లక్షణాన్ని అలవరుచుకోవాలని, విలువలను నిలబెట్టాలని, దేశ నిర్మాణంలో సహకరించాలని విద్యార్థులకు సూచించారు.
కొవిడ్-19 మహమ్మారి సమయాన్ని ప్రస్తావిస్తూ.. బలమైన దూర విద్యా విధానం వల్ల ఇగ్నో స్థిరంగా నిలబడిందని ఉపరాష్ట్రపతి అన్నారు. నిరంతరాయంగా విద్యను అందించడానికి స్వయం, ఈ-జ్ఞానకోశ్ వంటి డిజిటల్ వేదికలను విశ్వవిద్యాలయం సమర్థంగా ఉపయోగించుకుని.. సాంకేతిక-ఆధారిత విద్యలో అగ్రగామిగా నిలిచిందన్నారు.
నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)ను ఇగ్నో స్వీకరించడాన్ని ఉపరాష్ట్రపతి స్వాగతించారు. వివిధ రకాల ఐచ్ఛికాలతో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తోందని, తద్వారా ఉన్నత విద్యను మరింత సులభతరంగా, విద్యార్థి కేంద్రంగా మార్చిందని తెలిపారు. భారతీయ విజ్ఞాన వ్యవస్థలను ఆధునిక విద్యతో అనుసంధానించడాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
అభ్యసన సామర్థ్యాలను కృత్రిమ మేధ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు మెరుగుపరుస్తాయని, విద్యార్థికి మెరుగైన సహకారాన్ని, వ్యక్తిగతీకరించిన విద్యను అందిస్తాయన్నారు. ఆధునిక అభివృద్ధిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో కంప్యూటర్లను ప్రవేశపెట్టినప్పడు ఆందోళనలు, ఉద్యోగాలు పోతాయనే భయాలుండేవన్నారు. కాలక్రమేణా అవే మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాయని, దేశాభివృద్ధికి సహకరించాయన్నారు.
కృత్రిమ మేధ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సైతం అదే తరహాలో స్వీకరించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. అయితే ఈ తరహా టెక్నాలజీలను బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
నైతిక విలువలపై భారత్‌కు ఉన్న నమ్మకమే దేశానికి గొప్ప బలమని ఉపరాష్ట్రపతి అన్నారు. మన సంప్రదాయాలకు అనుగుణంగా ఆధునిక అభివృద్ధి కొనసాగాలని, శాస్త్రీయ పురోగతికి నైతిక విలువలే మార్గదర్శనం చేయాలని చెప్పారు.
సమష్టి బాధ్యత గురించి తెలియజేస్తూ ఉపరాష్ట్రపతి ప్రసంగాన్ని ముగించారు. వ్యక్తుల ప్రయత్నాలన్నీ కలసినప్పుడు అవి 2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించడానికి తోడ్పడతాయన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ధ్రువపత్రాలు సులభంగా అందుబాటులో ఉండేలా నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) పరిధిలోని డిజిలాకర్ ద్వారా సర్టిఫికెట్లను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ఇగ్నో పూర్వ విద్యార్థుల పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్లో 5 మిలియన్ల మందికి పైగా నమోదు చేసుకున్నారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్‌జిత్ సింగ్ సంధు, ఇగ్నో వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా కంజీలాల్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కేంద్రాల్లో స్వయం ప్రభ స్టూడియోను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి నల్లు, గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ ప్రేమ్ చంద్ బైర్వా, తదితరులు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ కేంద్రాల నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2249900)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7