ఉప రాష్ట్రపతి సచివాలయం
మానసిక ప్రశాంతత, స్పష్టతకు ధ్యానమే మార్గం: న్యూఢిల్లీలో జరిగిన ధ్యాన గురువుల అంతర్జాతీయ సమావేశంలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
అంతర్గత మార్పునకు ధ్యానమే నాంది: ఉపరాష్ట్రపతి
మెరుగైన ఆలోచనలతోనే మెరుగైన సమాజం: అంతర్జాతీయ ధ్యాన సమావేశంలో ఉపరాష్ట్రపతి
ధ్యానంతో యువత మాదక ద్రవ్య వ్యసనానికి దూరం: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2026 12:12PM by PIB Hyderabad
భారత్ మండపంలో సంపూర్ణ జీవనం, శాంతియుత ప్రపంచం కోసం ధాన్యం అనే అంశంపై జరిగిన ధ్యాన గురువుల అంతర్జాతీయ సమావేశంలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగించారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్, బుద్ధ-సీఈవో క్వాంటమ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
నిర్వాహకులు, వక్తలు, ధ్యాన గురువులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉపరాష్ట్రపతి అభినందించారు. సమగ్ర జీవనం, ప్రపంచ శాంతికి మార్గంగా ధ్యానాన్ని ప్రోత్సహించడంలో వారు చూపిస్తున్న అంకితభావాన్ని ప్రసంశించారు.
తమిళ రుషి తిరుమూలర్ బోధనలను శ్రీ సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేసుకున్నారు. అజ్ఞానాన్ని పారదోలి, సత్యం, శాంతి దిశగా నడిపించేదిగా, అంతర్గత జ్ఞానజ్యోతిని వెలిగించేదిగా ధ్యానాన్ని వర్ణించారు. మానవ శరీరాన్ని గుడిగా, ధ్యానాన్ని మనలోని దైవత్వాన్ని సాక్షాత్కరింపజేసుకొనే సాధనంగా తిరుమూలర్ అభివర్ణించారని చెప్పారు.
నేటి ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, సంఘర్షణపైకి కనిపించేది మాత్రమే కాదనీ, అది వ్యక్తుల అంతరంగాల్లోనూ ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో శాంతిని, స్పష్టతను, సానుకూల దృక్పథాన్ని తీసుకురావడంలోనూ, ఇతరులు చెప్పేది వినడం, వారిని అర్థం చేసుకోవడంలోనూ ధ్యానం పరివర్తనాత్మక పాత్రను పోషిస్తుందని స్పష్టం చేశారు.
మానవుల్లో పరివర్తన తీసుకురావడంలోనే ధ్యానానికున్న పరివర్తనాత్మక శక్తి దాగి ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి, అతిగా ఆలోచించడం, అతిగా పనిచేయడం లాంటి సమస్యలను పరిష్కరించడానికి ధ్యానం తోడ్పడుతుందని వివరించారు.
అర్థవంతమైన జీవితాన్ని పణంగా పెట్టి భౌతికమైన విజయం కోసం పాకులాడవద్దని ఉపరాష్ట్రపతి సూచించారు. సంపద మనకు సౌఖ్యాన్ని ఇచ్చినప్పటికీ.. మన జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకొనేలా ఉండకూడదన్నారు. ధ్యానం ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తుందని, వ్యక్తులు సమతౌల్య జీవితాన్ని కొనసాగించేలా చేస్తుందని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతను అన్వేషించే వారి కోసమే ధ్యానం అనే వాదనను ఆయన ఖండించారు. ఇది అందరి కోసం ఉద్దేశించిందనీ, సామాన్యులను సైతం అత్యున్నత చైతన్యం వైపు నడిపించగలదని వివరించారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించాలనే లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ.. దీనికి ఆర్థికవృద్ధితో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా అవసరమని తెలిపారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అవసరమైన అంతర్గత ప్రశాంతత, మానసిక సమతౌల్యం, ఆలోచనల్లో స్పష్టతను పెంపొందింపజేయడంలో ధ్యానం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.
మాదక ద్రవ్యాల వ్యసనాన్ని అరికట్టేందుకు సాగిస్తున్న తన సుదీర్ఘ పోరాటం గురించి ఉపరాష్ట్రపతి వివరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా 2004లో తాను చేపట్టిన పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. యువతలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యసనం నుంచి బయటపడేసే శక్తిమంతమైన సాధనంగా ధ్యానంగా ఉపకరిస్తుందన్నారు. ఒత్తిడి, ఆందోళన, దిశ లేకపోవడం నుంచి బయటపడేందుకు తోడ్పడుతుందని తెలిపారు.
తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిని ఉటంకిస్తూ..‘‘ఎలాంటి విశ్లేషణ చేయకుండానే పరిశీలించగలగడమే అత్యుతన్న స్థాయి మేధాశక్తి’’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. ధ్యానం.. ఎలాంటి అభిప్రాయాలనూ వ్యక్తపరచకుండా ఆలోచనలను పరిశీలించుకొనేలా చేస్తుందని, వ్యక్తిగత పరివర్తనను ముందుకు తీసుకెళుతుందని చెప్పారు. ఇలాంటి మార్పు.. తెలివైన వ్యక్తులను, సామరస్యం నిండిన సమాజాలను, దయతో కూడిన నాయకత్వాన్ని, మానవతా సంస్థలను ప్రోత్సహిస్తుందని తెలియజేశారు.
మెరుగైన, ప్రశాంతమైన ఆలోచనలను పెంపొందించుకోవడం ద్వారానే మెరుగైన ప్రపంచం సాధ్యమవుతుందంటూ.. అంతర్గత పరివర్తన అవసరాన్ని ఉపరాష్ట్రపతి తెలియజేశారు. ఈ ప్రయాణానికి ఆరంభం ధ్యానమే అని చెప్పారు.
సీబీఐ, సీఆర్పీఎఫ్ మాజీ డైరెక్టర్ శ్రీ డీఆర్ కార్తికేయన్, రిషికేష్‌లోని పరమార్థ్ నికేతన్ ఆశ్రమం అధ్యక్షుడు, ఆధ్యాత్మిక గురువు స్వామి చిదానంద సరస్వతి, క్వాంటమ్ లైఫ్ విశ్వవిద్యాలయం ఛైర్మన్ డాక్టర్ న్యూటన్ కొండవేటి, బుద్ధ-సీఈవో క్వాంటమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ చంద్ర పులమరశెట్టి, పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ (హైదరాబాద్) ఛైర్మన్ శ్రీ విజయ్ భాస్కర రెడ్డి, ఇతర ధ్యాన గురువులు, విధాన రూపకర్తలు, పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2249205)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13