ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2026: ఆరోగ్య రంగంలో నిబంధనలు సులభతరం, చిన్నపాటి నేరాలకు శిక్షల తొలగింపు
నేరరహితం, సరళీకృత నిబంధనల ద్వారా సులభ వ్యాపారానికి ఊతం
కోర్టు కేసుల భారాన్ని తగ్గించడానికి నిర్ణయాత్మక పరిష్కార వ్యవస్థలు
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2026 5:41PM by PIB Hyderabad
పార్లమెంటులోని ఉభయ సభల ఆమోదం పొందిన జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2026 దేశంలో వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు. వ్యక్తులు, వ్యాపార సంస్థలపై నిబంధనల భారాన్ని తగ్గించడం ద్వారా నమ్మకంతో కూడిన పాలనను అందించడానికి, తగిన నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ బిల్లు చాటిచెబుతోంది.
ఈ బిల్లు నిబంధనల ప్రకారం, 23 మంత్రిత్వ శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాల్లో ఉన్న 784 నిబంధనలను సవరించారు. వీటిలో వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంపొందించడానికి 717 నిబంధనలను నేరరహితం చేయగా, జీవన ప్రమాణాలను సులభతరం చేయడానికి 67 నిబంధనలను సవరించారు. మొత్తంగా, చిన్నపాటి లోపాలను తొలగించడం ద్వారా 1,000 పైగా నేరాలను ఈ బిల్లు హేతుబద్ధీకరిస్తోంది. దీనివల్ల నియంత్రణ వాతావరణం మెరుగుపడటమే కాకుండా వ్యాపారాలకు, పౌరులకు మరింత అనుకూలమైన వ్యవస్థ ఏర్పడుతుంది.
ఆరోగ్య రంగానికి సంబంధించి, 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1948 నాటి ఫార్మసీ యాక్ట్, ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2010 నాటి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్,. 2021 నాటి నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్ వంటి కీలక చట్టాల్లో సవరణలు చేశారు. ప్రజారోగ్యానికి పటిష్టమైన రక్షణ కల్పిస్తూనే, నిబంధనలను పాటించడాన్ని సరళీకృతం చేయాలనే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఈ సంస్కరణలు ఉన్నాయి.
నిబంధనలను పాటించడానికి సంబంధించిన చిన్నపాటి ఉల్లంఘనలకు విధించే జైలు శిక్షల వంటి క్రిమినల్ శిక్షల స్థానంలో, తప్పు తీవ్రతను బట్టి హెచ్చరించి వదిలేయడం లేదా జరిమానాలు విధించడం ఈ సంస్కరణల ముఖ్యోద్దేశం. ప్రజారోగ్యం, భద్రతకు ముప్పు కలిగించే తీవ్రమైన ఉల్లంఘనలపై కఠిన చర్యలను కొనసాగిస్తూనే, నియంత్రణ వ్యవస్థను మరింత అనుకూలంగా మార్చే దిశగా ఇది ఒక కీలక అడుగు.
1940 నాటి మందులు, సౌందర్య సాధనాల (డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్) చట్టంలో జైలు శిక్షల స్థానంలో నగదు జరిమానాలను ప్రవేశపెట్టడానికి, క్రమబద్ధమైన తీర్పునిచ్చే యంత్రాంగాన్ని తీసుకురావడానికి పలు నిబంధనలను సవరించారు. ముఖ్యంగా, సెక్షన్ 27ఏ(ii), సెక్షన్ 28ఏ కింద జరిగే ఉల్లంఘనల కోసం ప్రత్యేక తీర్పు యంత్రాంగాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల సౌందర్య సాధనాల (నకిలీ లేదా కల్తీ కాకుండా) విషయంలో జరిగే చిన్నపాటి ఉల్లంఘనలకు కోర్టు జోక్యం అవసరం ఉండదు. బదులుగా వీటిని సివిల్ పెనాల్టీ వ్యవస్థ ద్వారానే పరిష్కరించవచ్చు.
అంతేకాకుండా, గతంలో పత్రాలను నిర్వహించకపోవడం లేదా సమాచారాన్ని సమర్పించకపోవడం వంటి ఉల్లంఘనలకు కోర్టు ద్వారా జరిమానాలు లేదా జైలు శిక్షలు ఉండేవి. ఇప్పుడు అటువంటి వాటిని ఈ సివిల్ పెనాల్టీ యంత్రాంగం ద్వారానే పరిష్కరించవచ్చు. మొదటిసారిగా, ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా తీర్పునిచ్చే అడ్జుడికేటింగ్ అధికారుల నియామకానికి అవకాశం కల్పిస్తోంది. దీనితో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించడం, అప్పీలు చేసుకునే యంత్రాంగంతో కూడిన ఒక స్పష్టమైన ప్రక్రియను కూడా రూపొందించారు.
ఈ సంస్కరణ కోర్టు లావాదేవీల భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. లిటిగేషన్ స్థాయుల్ని తగ్గిస్తుంది. చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలను వేగంగా పరిష్కరించడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా సౌందర్య సాధనాల రంగానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. చట్టబద్ధమైన రికార్డులు లేదా పత్రాలను నిర్వహించకపోవడం వంటి చిన్నపాటి పొరపాట్ల విషయంలో, సుదీర్ఘ కోర్టు కేసుల అవసరం లేకుండా క్రమబద్ధమైన, ముందస్తుగా అంచనా వేయదగిన పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవచ్చు
1948 నాటి ఫార్మసీ చట్టంలో చేసిన సవరణలు కూడా శిక్షా నిబంధనలను ఆధునికీకరించడం, నిబంధనల ఉల్లంఘనకు ఆర్థిక జరిమానాలను పెంచడం ద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ సంస్కరణలు నవీకరించిన చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి.
2006 నాటి ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద నిబంధనల అమలును బలోపేతం చేస్తూనే, తప్పు తీవ్రతకు అనుగుణంగా జరిమానాలు ఉండేలా నిబంధనలను సరళీకరించారు. ఇది నియంత్రణ పర్యవేక్షణ, నిబంధనలను పాటించడంలో సౌలభ్యం మధ్య సమతుల్యాన్ని అందిస్తుంది.
2010 నాటి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టాన్ని నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఆర్థిక జరిమానాలను విధించేలా నవీకరించారు. ముఖ్యంగా రోగుల భద్రతకు తక్షణ ముప్పు లేని లోపాల విషయంలో, క్రిమినల్ చర్యలకు వెళ్లకుండా లోపాలను సరిదిద్దుకునేలా ఇది ప్రోత్సహిస్తుంది.
2021 నాటి నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ చట్టాన్ని వృత్తిపరమైన ప్రమాణాలు, నియంత్రణ అవసరాలను తప్పనిసరిగా పాటించేలా బలోపేతం చేశారు. ఉల్లంఘనల తీవ్రతకు అనుగుణంగా ఉండేలా, అటువంటి తప్పులు జరగకుండా అడ్డుకొనేలా జరిమానాలను రూపొందించారు.
వివిధ ఆరోగ్య సంబంధిత చట్టాలలో ఈ సంస్కరణలను అనుసంధానించడం నియంత్రణ వ్యవస్థలను సమన్వయం చేసే లక్ష్యంతో కూడిన ఒక స్పష్టమైన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. క్రిమినల్ శిక్షల నుంచి సివిల్ జరిమానాలకు మారడాన్ని ప్రామాణీకరించడం, తీర్పునిచ్చే యంత్రాంగాలను ప్రవేశపెట్టడం ద్వారా, ఈ సవరణలు నిబంధనల అమలులో స్థిరత్వం, ముందస్తు అంచనా, తప్పుకు తగ్గ శిక్షను నిర్ధారిస్తాయి. ఈ సమన్వయం నియంత్రణ వ్యవస్థలో ఉన్న లోపాలను తగ్గిస్తుంది. నిబంధనలను పాటించే ప్రక్రియను సరళీకరిస్తుంది. ఆరోగ్య రంగంలోని వివిధ విభాగాలలో పనిచేసే భాగస్వాములకు స్పష్టతను ఇస్తుంది.
ఈ సంస్కరణల అమలులో 23 మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం ఉండటం నియంత్రణ వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర విధానానికి నిదర్శనం. ఈ విస్తృత భాగస్వామ్యం అన్ని రంగాలలో వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, జీవన ప్రమాణాలను పెంపొందించాలనే ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. సంస్కరణలు సమగ్రంగా, సమన్వయంతో, ప్రభావవంతంగా అమలు జరిగేందుకు దోహదపడుతుంది.
మొత్తంగా చూస్తే, ఈ చర్యలు ప్రజారోగ్యాన్ని, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ఎటువంటి రాజీ లేకుండా నిబంధనల అమలును మెరుగుపరుస్తాయని, కోర్టు కేసులను తగ్గిస్తాయని వాటాదారులకు, నియంత్రణ అధికారులకు మధ్య విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తాయని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2248952)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14