రక్షణ మంత్రిత్వ శాఖ
2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 38,424 కోట్లకు చేరుకున్న రక్షణ ఎగుమతులు: గతేడాదితో పోలిస్తే 62.66 శాతం మేర పెరుగుదల
డీపీఎస్‌యూల ఎగుమతుల్లో 151 శాతం, ప్రైవేటు రంగం వాటాలో 14 శాతం పెరుగుదల
ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా మారే దిశగా ప్రయాణిస్తున్న భారత్: రక్షణ మంత్రి
‘‘ప్రధానమంత్రి మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో అద్భుతమైన రక్షణ ఎగుమతుల విజయగాథ లిఖితమైంది’’
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2026 10:11AM by PIB Hyderabad
ఆర్థిక సంవత్సరం 2025-26లో రక్షణ ఎగుమతులు రూ. 38,424 కోట్ల జీవన కాల గరిష్ఠ స్థాయిని చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సర గణాంకాలు రూ. 23,622 కోట్లతో పోలిస్తే రూ. 14,802 కోట్లు (62.66 శాతం) భారీ పెరుగుదలను సూచిస్తోంది. ఈ చరిత్రాత్మక విజయంలో ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు (డీపీఎస్‌యూలు), ప్రైవేటు రంగం వరుసగా 54.84 శాతం, 45.16 శాతం మేర సహకారం అందించాయి. రక్షణ ఎగుమతులు చేస్తున్న అగ్రశ్రేణి దేశాల సరసన భారత్‌ను చేర్చాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా భారత రక్షణ పరిశ్రమ ఈ విజయాన్ని సాధించింది.
రక్షణ ఉత్పత్తి విభాగం, భారతీయ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఇతర భాగస్వాముల పనితీరును రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ప్రశంసించారు. రక్షణ పరికరాల తయారీలో ప్రపంచ కేంద్రంగా మారే దిశగా భారత్ ప్రయాణిస్తోందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో రక్షణ ఎగుమతుల్లో విజయగాథను భారత్ లిఖిస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రక్షణ మంత్రి పేర్కొన్నారు.
గతేడాదితో పోలిస్తే డీపీఎస్‌యూల ఎగుమతులు 151 శాతం మేర పెరిగాయి. 14 శాతం పెరుగుదలను నమోదు చేస్తూ ప్రైవేటు సంస్థలు తమ ఉనికిని చాటుకున్నాయి. వాటా విలువ పరంగా చూస్తే ప్రైవేటు రంగం రూ.17,353 కోట్ల ఎగుమతులు చేయగా, డీపీఎస్‌యూలు రూ. 21,071 కోట్లు అందించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ గణాంకాలు వరుసగా రూ. 15,233 కోట్లు, రూ. 8,389 కోట్లుగా ఉన్నాయి.
గత అయిదేళ్లలో మూడు రెట్లు పెరుగుదలను ఈ రికార్డు స్థాయి గణాంకాలు సూచిస్తున్నాయి.

భారత్‌లో తయారైన రక్షణ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండును, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఈ రంగానికి పెరుగుతున్న వాటాను ఈ గణనీయమైన పెరుగుదల సూచిస్తోంది. వ్యవస్థలు/ఉప వ్యవస్థల విషయంలో విజయవంతమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఉండటంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 80కి పైగా దేశాలకు రక్షణ పరికరాలను భారత్ ఎగుమతి చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఎగుమతిదారుల సంఖ్య 128 నుంచి 145కు పెరిగింది. ఈ పెరుగుదల 13.3 శాతంగా ఉంది.
పనితీరు ఆధారంగా, ప్రపంచ స్థాయిలో పోటీపడేలా రక్షణ రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని, రక్షణ ఎగుమతిదారులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది. ఈ వృద్ధిమార్గంలో రక్షణ ఎగుమతిదారులకు తోడ్పాటు అందించడానికి పునర్వ్యస్థీకరించిన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రక్షణ ఎగుమతుల నియంత్రణ ప్రక్రియమలను రక్షణ ఉత్పత్తుల విభాగం క్రమబద్దీకరించింది. ధ్రువీకరణల కోసం నిర్దేశిత కార్యకలాపాల విధానాన్ని సరళీకరించింది.
***
(రిలీజ్ ఐడి: 2248291)
సందర్శకుల సూచీ సంఖ్య : : 33