పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
గ్రామీణ భారత్‌లో బలంగా డిజిటల్ ప్రోత్సాహం: ఇ-గ్రామ్ స్వరాజ్ ద్వారా రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆన్‌లైన్ చెల్లింపులు.. 23 భాషలకు సభాసార్ విస్తరణ
నాడు పోస్టు చేయడమైనది:
31 MAR 2026 10:05AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా పంచాయతీల్లో డిజిటల్, సమ్మిళిత గ్రామీణ పరిపాలనను పెంపొందించే దిశగా.. రెండు కీలక మైలురాళ్లను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధిగమించింది. దేశంలోని గ్రామ పంచాయతీలు డిజిటల్ పాలనలో భారీ పురోగతిని సాధిస్తున్నాయి. ఇ-గ్రామ్ స్వరాజ్ వేదిక ద్వారా రూ. 3 లక్షల కోట్లకు పైగా (మొత్తంగా) చెల్లింపులు జరిగాయి. మరోవైపు ఏఐ ఆధారిత సభాసార్ టూల్ ఇప్పుడు 23 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఇది ఆర్థికంగా పారదర్శకతను, క్షేత్రస్థాయిలో సమ్మిళిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది.
ఇ-గ్రామ్ స్వరాజ్ ద్వారా విక్రేతలకు, సేవలందించే సంస్థలకు ఎప్పటికప్పుడు నేరుగా చెల్లింపులు జరుగుతున్నాయి. తద్వారా పూర్తిగా డిజిటల్ పారదర్శకతకు అవకాశం ఉంటుంది. సాంకేతిక ప్రాతిపదికన పాలన దిశగా ఇదొక కీలక ముందడుగు. ‘ఇ-పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్టు’ కింద రూపొందించి, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (పీఎఫ్ఎంఎస్)తో అనుసంధానించిన ఈ వేదిక.. పంచాయతీ స్థాయిలో ప్రణాళిక, అకౌంటింగ్, వ్యయ ప్రక్రియను క్రమబద్ధీకరించింది. నగదు, భౌతిక పత్రాల ఆధారంగా జరిగే పాత పద్ధతుల స్థానంలో వేగవంతమైన, జవాబుదారీతనం కలిగిన, అవినీతికి తావులేని వ్యవస్థను ఇది అందుబాటులోకి తెచ్చింది. 2025-26లో పంచాయతీరాజ్ సంస్థలు ఇ-గ్రామ్ స్వరాజ్ – పీఎఫ్ఎంఎస్ వేదికల ద్వారా రూ. 53,342 కోట్లను బదిలీ చేయగా.. 2,55,254 గ్రామ పంచాయతీలు తమ అభివృద్ధి ప్రణాళికలను ఈ వేదికలో అప్‌లోడ్ చేశాయి. మొత్తంమీద 2,59,798 పంచాయతీరాజ్ సంస్థలు ఇందులో చేరగా.. 2025-26లో 2,50,807 పంచాయతీరాజ్ సంస్థలు ఇ-గ్రామ్ స్వరాజ్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేశాయి. 1,60,79,737 మంది విక్రేతలు కూడా ఈ వేదికలో నమోదు చేసుకున్నారు. దీని స్థాయి విస్తృతిని, విస్తృత వినియోగాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి.
ఈ విప్లవాత్మక మార్పులకు ఊతమిచ్చేలా మరో కీలక చర్యను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టింది. 2025 ఆగస్టు 14న ప్రారంభించిన ఏఐ ఆధారిత శాబ్ధిక - సందేశ సమావేశ సంగ్రాహక సాధనం (వాయిస్ టు టెక్స్ట్ మీటింగ్ మీటింగ్ సమ్మరైజేషన్ టూల్) ‘సభాసార్’ గతంలో 13 భాషల్లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు దాన్ని 23 భారతీయ భాషలకు విస్తరించింది. అస్సామీ, బోడో, డోగ్రీ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలీ, సంతాలి, సింధీ భాషలను కొత్తగా చేర్చారు. దీంతో గ్రామసభల చర్చలను స్థానిక భాషల్లోనే రికార్డు చేసి, భద్రపరచడం సాధ్యమవుతుంది. సభాసార్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సభ మినిట్లు, హాజరు, తీర్మానాలు, కార్యాచరణ అంశాలను స్వయంచాలకంగా రికార్డు చేయవచ్చు. ఇది గ్రామసభ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే కాకుండా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతుంది. గతంలో హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ వేదిక.. ఇప్పుడు దేశంలోని పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన అన్ని భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. 2026 జనవరి 29 నాటికి 1,11,486 గ్రామ పంచాయతీలు సమావేశాల సారాన్ని నమోదు చేయడం కోసం ఈ ప్లాట్ఫాంను ఇప్పటికే ఉపయోగించుకున్నాయి. ఈ సాంకేతికత జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు నిర్వహించిన ‘టెక్నాలజీ సభ ఉన్నతి పురస్కారాలు - 2026’లో కృత్రిమ మేధ విభాగంలో దీనిని విజేతగా ప్రకటించారు. అలాగే ‘ఎకనామిక్ టైమ్స్ గవ్‌టెక్ పురస్కారాలు-2026’లో ‘సామాజిక ప్రభావం కోసం ఏఐ’ విభాగంలో రజత పురస్కారాన్ని కూడా గెలుచుకుంది.
డిజిటల్ సాధికారికంగా, పారదర్శకంగా, సమ్మిళితంగా పంచాయతీలను తీర్చిదిద్దడంలోనూ, అలాగే ఆర్థిక నిర్వహణను, క్షేత్రస్థాయిలో ప్రజాస్వామిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలోనూ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిరంతర కృషిని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2247366)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15