పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నగోయా ప్రోటోకాల్ పరిధిలో 'కాంప్లయన్స్ సర్టిఫికెట్ల' జారీలో ప్రపంచ అగ్రగామిగా నిలిచిన భారత్

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2026 8:53AM by PIB Hyderabad

‘యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్‌’పై కుదిరిన నగోయా ప్రోటోకాల్ కింద అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కాంప్లయన్స్ సర్టిఫికెట్లను (ఐఆర్‌సీసీ) జారీ చేయడంలో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా జారీ అయిన మొత్తం ధ్రువీకరణ పత్రాల్లో 56 శాతానికి పైగా వాటాను భారత్‌ కలిగి ఉంది. ఏబీఎస్ క్లియరింగ్-హౌస్ తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జారీ అయిన మొత్తం 6,311 ఐఆర్‌సీసీలలో భారత్ ఒక్కటే 3,561 ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది. ఈ ప్రోటోకాల్‌ను అమలు చేయడంలో భారత్ ఇతర దేశాల కంటే చాలా ముందుంది.

పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే ప్రపంచ స్థాయి ప్లాట్‌ఫామ్ అయిన 'ఏబీఎస్ క్లియరింగ్-హౌస్'లో 142 దేశాలు నమోదవ్వగా ఇప్పటివరకు కేవలం 34 దేశాలు మాత్రమే ఐఆర్‌సీసీ ధ్రువీకరణ పత్రాలను జారీ చేశాయి. ఈ జాబితాలో భారత్ తర్వాత ఫ్రాన్స్ (964 ధ్రువీకరణ పత్రాలు), స్పెయిన్ (320), అర్జెంటీనా (257), పనామా (156), కెన్యా (144) ఉన్నాయి. జీవ వనరులు, వాటికి సంబంధించిన విజ్ఞానాన్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వినియోగించడంలో భారతదేశానికి ఉన్న దృఢ సంకల్పాన్ని ఇది పునరుద్ఘాటిస్తోంది.

నగోయా ప్రోటోకాల్ ప్రకారం జన్యు వనరులు, అనుబంధ సంప్రదాయ విజ్ఞానాన్ని పొందేందుకు అనుమతినిచ్చే దేశాలు తప్పనిసరిగా ఐఆర్‌సీసీలను జారీ చేయాలి. వనరులను పొందే వినియోగదారులు, అందించే ప్రదాతల మధ్య 'ముందస్తు సమాచారంతో కూడిన అంగీకారం' లభించిందని.. అలాగే 'పరస్పర ఒప్పంద నిబంధనలు' కుదిరాయని చెప్పడానికి ఈ ధ్రువీకరణ పత్రాలు అధికారిక సాక్ష్యంగా పనిచేస్తాయి. ఈ వివరాలన్నింటినీ ఏబీఎస్ క్లియరింగ్-హౌస్‌లో పొందుపరుస్తారు. 

పరిశోధన, ఆవిష్కరణల నుంచి తుది వాణిజ్య ప్రయోజనాల వరకు జన్యు వనరులు ఎలా వినియోగమవుతున్నాయో పర్యవేక్షించడంలో ఐఆర్‌సీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల ఆ వనరులను అందించిన దేశానికి ప్రయోజనాలు నిష్పక్షపాతంగా అందేలా చూడొచ్చు.

ఈ ఘనతను భారత్ సాధించడం.. 'జీవ వైవిధ్య చట్టం- 2002' కింద రూపొందించిన ఏబీఎస్ ఫ్రేమ్‌వర్క్ సమర్థవంతమైన అమలును తెలియజేస్తోంది. ఈ వ్యవస్థ కేంద్ర స్థాయిలో 'నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ', రాష్ట్ర స్థాయిలో 'స్టేట్ బయోడైవర్సిటీ బోర్డులు లేదా యూనియన్ టెరిటరీ బయోడైవర్సిటీ కౌన్సిల్స్', స్థానిక స్థాయిలో 'బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీల' ద్వారా అమలు అవుతోంది. సరళీకృత విధానాలు, బలమైన సంస్థాగత యంత్రాంగాలు దరఖాస్తుల వేగవంతమైన పరిశీలన, అంతర్జాతీయ నిబంధనల పాటింపునకు దోహదపడ్డాయి.

ఈ ఘనత ప్రపంచ జీవ వైవిధ్య పరిపాలనలో భారతదేశ క్రియాశీల పాత్రను చాటిచెబుతోంది. జీవ వనరుల వినియోగం ద్వారా లభించే ప్రయోజనాలను నిష్పక్షపాతంగా, సమానంగా పంపిణీ చేయడంలో భారత్ చేస్తున్న నిరంతర కృషిని ఇది ప్రధానంగా తెలియజేస్తోంది. ఇది జీవ వైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగంపై అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా.. ప్రపంచ పర్యావరణ ఒప్పందాలను అమలు చేయడంలో కీలక భాగస్వామిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

 

****


(రిలీజ్ ఐడి: 2247359) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati