యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
బ్రిక్స్ తొలి యువజన సమన్వయ సమావేశం - 2026 నిర్వహించిన భారత్
‘‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’’ అనే అంశం పరిధిలో కార్యక్రమాలను ప్రారంభించిన సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2026 12:38PM by PIB Hyderabad
తొలి బ్రిక్స్ యువజన సమన్వయ సమావేశం - 2026ను యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని యువజన వ్యవహారాల విభాగం వర్చువల్ విధానంలో నిర్వహించింది. 2026 మార్చి 25 సాయంత్రం 4:30 నుంచి 6:00 (ఐఎస్టీ) వరకు జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
2026 ఏడాదికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టిన నేపథ్యంలో ‘‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’’ అనే ఇతివృత్తంతో కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించింది. ఇది ఈ ఏడాది యువజన సహకారానికి దిశానిర్దేశం చేస్తుంది.
సమావేశంలో బ్రిక్స్ యూత్ ట్రాక్ 2026 గురించి సమగ్రంగా భారత్ వివరించింది. దీనిలో కార్యాచరణ బృందాల సమావేశాలు, ఇతివృత్తాత్మక కార్యక్రమాలు, సర్వ్ బ్రిక్స్ స్వచ్ఛంద సేవా కార్యకలాపాలు, యువజన అభివృద్ధి వేదిక, యువజన మండలి సమావేశం, యువ సదస్సు, యువ మంత్రుల స్థాయి సమావేశం ఉన్నాయి.
సభ్య దేశాల మధ్య సహకారంలో ప్రధానాంశాలపై చర్చలు దృష్టి సారించాయి. వీటిలో విద్య, నైపుణ్యాలు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, సామాజిక భాగస్వామ్యం, సమ్మిళిత్వం, ఆరోగ్యం, క్రీడలు, పర్యావరణం, సుస్థిరత, ఒకరి మతం గురించి మరొకరు తెలుసుకునేలా చర్చలు, యూత్ ఎక్స్ఛేంజ్ తదితరమైనవి ఉన్నాయి.
విస్తృతమైన నేపథ్య అంశాలపై సభ్య దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేలా చేయడానికి, బ్రిక్స్ యూత్ ట్రాక్ - 2026 పరిధిలో సహకారాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన వేదికను ఈ సమావేశం అందించింది. ఇది భారత్ అధ్యక్షతన భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు బలమైన పునాదిని వేసింది.
***
(రిలీజ్ ఐడి: 2246043)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27